Suryaa.co.in

Political News

భారత్ అడుగుజాడల్లో ప్రపంచ దేశాలు

( జినిత్ జైన్)

పాకిస్తాన్ ప్రోద్బలంతో మీద పడుతున్న ఉగ్రవాద బెడదను తిప్పికొట్టడంలో కావొచ్చు, విదేశీ గడ్డపై సమర క్షేత్రంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో కావొచ్చు, చైనా దురాగతాలను తిప్పికొట్టడంలో కావొచ్చు లేదా యుక్రెయిన్‌‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఒక క్లిష్టతరమైన సంక్షోభాన్ని నిశితంగా గమనించడంలోనూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం భారత్ జాతీయ భద్రతకు ఒక ఉపకరణంగా పనిచేస్తున్నది.

2022 సంవత్సరం మే 26.. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఇది ఎనిమిదవ వార్షికోత్సవ దినోత్సవం. పాలనాపరంగా వేర్వేరు రంగాల్లో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్న మోడీ సర్కారు అదే సమయంలో పటిష్టమైన ఒక విదేశాంగ విధానానికి రూపకల్పన చేసి, దానిని అంతర్జాతీయ వేదికపై మోహరింపజేయడంలో అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి ఆగర్భ శత్రువులు సైతం ఇదే విషయాన్ని అంగీకరించారు. ‘అలీన విధానం’ వైఖరిని వదిలించుకోవడం నుంచి అంతర్జాతీయ వేదికలపై తన అస్తిత్వాన్ని దఖలుపరుచుకోవడం వరకు, పొరుగు దేశాలు ప్రేరేపిస్తున్న టెర్రరిజంపై ఉక్కుపాదాన్ని మోపడం నుంచి పాశ్చాత్య అభిప్రాయాలకు తలొగ్గడానికి బదులుగా తన స్వ-ప్రయోజనానికి ప్రాధాన్యతను ఇచ్చేంతవరకు, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ విదేశాంగ విధానం ఒక గణనీయమైన రూపాంతరం చెందుతున్నది.

అయితే, మోడీ ప్రభుత్వం హయాంలో ఉన్నంత చురుకుగా, ఉత్తేజితంగా గతంలో భారత్ విదేశాంగ విధానం ఉన్నది లేదు. దేశానికి స్వరాజ్యం సిద్దించిన కొన్ని దశాబ్దాల వరకు భారత్ విదేశాం విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ‘నెహ్రూవియన్’ తప్పిదాలను చేసుకుంటూ పోతున్నది. ఉదాహరణకు, 1948లో జమ్మూ కాశ్మీర్‌పై దాడి, దురాక్రమణ చేసిన పాకిస్తాన్‌ను తుడిచిపెట్టకపోవడం లేదా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సభ్యత్వాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి చైనాకు అందించడం, అక్‌సాయ్ చిన్, అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా దురుద్దేశ్యాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చివరకు అది అనివార్యంగా 1962నాటి యుద్ధానికి దారి తీయడం లాంటి తప్పిదాలు ఉన్నాయి.

కానీ, గత కొద్ది సంవత్సరాలుగా, ప్రధాని మోడీ హయాంలో భారత్ విదేశాంగ విధానంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకున్నది. టెర్రరిజాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయడంలో అనాదిగా అనుసరిస్తున్న విధానాలకు అతీతంగా ముందుకు సాగాలనే తన సుముఖతను ప్రదర్శిస్తున్నట్టుగా దేశ సరిహద్దు వెంబడి తూర్పు, పశ్చిమ దిశల్లో సర్జికల్ దాడులను భారత్ చేపట్టింది. బాలాకోట్ వైమానికదాడులతో గతంలో లాగా భారత్ ఇంక ఎంతో కాలం తన గాయాలను తీరిగ్గా కూర్చుంటూ చూసుకోదని, వైరి పక్షాలపై దెబ్బకు దెబ్బ తీస్తుందనే వైఖరిని ప్రపంచం ఎదుట ప్రదర్శించింది.

కరోనా కష్టకాలంలో 100కు పైగా దేశాలకు టీకా డోసులు
కరోనా మహమ్మారి కోరల్లో యావత్ ప్రపంచం చిక్కుకున్న సమయంలో స్వదేశీ టీకాను రికార్డు సమయంలో అభివృద్ధిపరిచి తయారు చేయడంలో తన శక్తియుక్తులను భారత్ ప్రదర్శించిది. పాశ్చాత్య కంపెనీల అభివృద్ధి చేసిన టీకాలను పెద్ద ఎత్తున తయారుచేయడంలో తన సామర్థ్యాన్ని త్వరితగతిన వృద్ధి చేసుకుంది. విదేశీ దౌత్యం, మానవత్వం పట్ల తన కట్టుబాటుకు నిదర్శనంగా 100కు పైగా దేశాలకు 6.5 కోట్ల కోవిడ్ టీకా డోసులను భారత్ ఎగుమతి చేసింది. ‘ఔషధ ప్రపంచానికి’ పర్యాయపదంగా నిలిచింది.

పర్యావరణ మార్పు సవాళ్ళకు దీటుగా ప్రధాని ప్రతిజ్ఞ
పర్యావరణ మార్పు నుంచి వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నది. 2070 నాటికి దేశం నుంచి వెలువడే ఉద్గారాలను నెట్-జీరో కు తగ్గిస్తామని 2021 నవంబర్ రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినబూనారు. విద్యుత్తు లేదా ఇంధన ఉత్పాదనలో ప్రధాన వనరుగా ఇప్పటికీ శిలాజ ఇంధనాలను వినియోగిస్తున్న భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది ఒక ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యంగా నిలిచింది. ఇంధనానికి సంబంధించి పునరుద్ధరణీయ వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా దేశంలో కర్బన ఉద్గారాల కట్టడిని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.

మోడీ అడుగుజాడల్లో ప్రపంచ నేతలు
అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టోక్యోలో తీసిన ఒక ఫొటో 2014 తర్వాత భారత్ విదేశాంగ విధానంలో అనూహ్యమైన మార్పును ప్రతిబింబిస్తుంది. 2014కు ముందు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వంతో దిగజారిన ఒక ప్రాంతీయ శక్తిగా భారత్‌ను ప్రపంచ దేశాలు పరిగణించేవి. కానీ 2014 తర్వాత భారత్ పుణికిపుచ్చుకున్న అద్వితీయమైన శక్తి సామర్థ్యాలను గుర్తించేంత స్థాయికి ప్రపంచ దేశాలు ఎదిగాయి. వైరల్‌గా మారిన ఆ ఫొటోలో ప్రపంచ నేతలను ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోడీ కనిపించారు. భారత్ ప్రధానమంత్రిని అనుసరిస్తున్న ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనేస్, తదితరులు ఉన్నారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై సర్జికల్ దాడులు
ముంబైలో ఉగ్రదాడులకు ఊతమిచ్చిన పాకిస్తాన్ పట్ల కేంద్రంలో అప్పటి యూపీఏ సర్కాలు ఉదాసీనంగా వ్యవహరించగా, 2016లో ఉరీ ఉగ్రదాడులకు టెర్రరిస్టులను పంపించిన ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులకు ప్రధాని మోడీ అనుమతించారు. ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్‌లో ఒక కౌంటర్ ఆపరేషన్‌ను భారత వైమానిక దళం చేపట్టింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. తద్వారా భారత్‌లో ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదంటూ తన విదేశాంగ విధానంలో సరికొత్త మార్పును భారత్ సంకేతమాత్రంగా ప్రపంచానికి మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఇచ్చింది.

పశ్చిమ సరిహద్దుల వెంబడి దాడులు జరపడానికి ముందు, జవాన్లపై ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను మట్టుబెట్టడం కోసం మయన్మార్‌లోని దట్టమైన అడవుల్లో భారత సాయుధ బలగాలు సర్జికల్ దాడులు చేపట్టాయి. కొద్ది సంవత్సరాల తర్వాత, 2019లో పుల్వామా ఉగ్రదాడికి బదులుగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జెయిషే మహమ్మద్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరంపై అనూహ్యమైన వైమానిక దాడికి మోడీ సర్కారు అనుమతి ఇచ్చింది.

విదేశీ గడ్డపై సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులకు అండగా మోడీ సర్కారు
మోడీ ప్రభుత్వం వరకు.. పరస్పర వృద్ధి, అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలతో చెరగిపోని దౌత్య సంబంధాలను కలిగి ఉండటం విదేశాంగ విధానానికి చెందిన ఒక పార్శ్వంగా ఉన్నది. విదేశాల్లో సంక్షోభాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత అదే విదేశాంగ విధానానికి మరో ముఖ్యమైన పార్శ్వంగా ఉన్నది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అప్పటికి విదేశీ వ్యవహారాల మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ విదేశాంగ విధానాన్ని ప్రవాస భారతీయుల వరకు విస్తరింపజేశారు. కష్టకాలంలో ఉన్న ప్రవాస భారతీయులను ఆదుకునే క్రమంలో ట్విట్టర్‌ను ఒక హెల్ప్ లైన్‌గా మార్చటంలో సుష్మా స్వరాజ్ చేసిన కృషి అనన్యసామాన్యమైనది.

2019లో, అంతర్గత అనిశ్చితి కారణంగా భద్రత లోపించిన లిబియాలో చిక్కుకున్న ఒక CRPF దళాన్ని భారత్ విజయవంతంగా వెనక్కి రప్పించింది. అంతకుమునుపు 2015లో రణరంగంలా మారిన యెమెన్ నుంచి 4,500 మందికి పైగా భారతీయులు, 960 మంది విదేశీయులను భారత్ ప్రభుత్వం రక్షించింది. 2014లో సంక్షుభిత ఇరాక్‌లో ఐసిస్ ఉగ్ర మూకల నుంచి 46 మంది నర్సులను సైతం భారత్ కాపాడింది.

డ్రాగన్‌తో నువ్వా.. నేనా?: ప్రాదేశిక సమైక్యత, సరిహద్దు భద్రతలో రాజీ లేని ధోరణి
అంతకంతకు పెరిగిపోతున్న చైనా దూకుడును ఎదుర్కొంటున్న భారత్.. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రాదేశిక సమైక్యత పరిరక్షణకు కట్టుబడేలా వృద్ధి చెందింది. భారత్ సరిహద్దు ప్రాంతాలను చైనా నుంచి కాపాడుకోవడంలో గత ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాయి. అయితే ప్రస్తుతం భారత్ సరిహద్దు ప్రాంతాల దురాక్రమణ కోసం చైనా వేస్తున్న దుష్ట పన్నాగాలు ఏ మాత్రం సాగడంలేదు. చైనా దుష్ట పన్నాగాలకు భారత్ దీటుగా బదులిస్తున్నది.

2017 జూన్‌లో డోక్లామ్ సమీపంలో చైనా చేపట్టిన ఒక రోడ్డు నిర్మాణంపై భారత్ సాయుధ బలగాలు చైనాకు చెందిన PLA మూకలు బాహాబాహీకి దిగాయి. భారత్ సరిహద్దుకు సమీపంలో చైనా చేపట్టిన నిర్మాణాలను భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఆపరేషన్ జునెపర్‌లో భాగంగా చైనా రహదారి పనులు నిలుపుదల కోసం భారత్‌కు చెందిన 270 ట్రూప్‌ల సాయుధ బలగాలు, రెండు బుల్‌డోజర్లను సిక్కిమ్ సరిహద్దును దాటి డోక్లామ్‌లోకి అడుగుపెట్టాయి. వారాల పాటు సుదీర్ఘ మంతనాలు, దౌత్యపరమైన చర్చల అనంతరం డోక్లామ్‌లో అనిశ్చితి నెలకొన్న ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్న భారత్, చైనా ప్రకటించాయి. డోక్లామ్ అనిశ్చితికి ముగింపు.. దశాబ్దాల కాలంలో దౌత్యపరమైన వ్యవహారాల్లో భారత్ ఘన విజయాలకు నాంది పలికింది. చైనాతో నువ్వా.. నేనా? అన్న తీరుగా భారత్ వైఖరి మారింది.

2020లో, చైనా నగరం వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్ తలమునకలైపోయి ఉన్న వేళ, ఇదే అదనుగా సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి, ప్రాంతంలో చైనా దురాక్రమణ ఫలితంగా తూర్పు లడఖ్‌లో చైనా సైన్యంతో భారత్ బలగాలు నెలల తరబడి ఘర్షణకు దిగాల్సి వచ్చింది. సరిహద్దు వెంబడి భారత్ భూభాగంలో కొంత భాగాన్ని తనదిగా చెప్పుకునే దిశగా చైనా దురాక్రమణకు దిగింది. అయితే స్వదేశీగడ్డపై చైనా దురాక్రమణను భారత్ సాయుధ బలగాలు గట్టిగా వ్యతిరేకించాయి.

2020 జూన్ 15న లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనిక బలగాలు ఘర్షణకు దిగాయి. ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు భారత్ ప్రభుత్వం నివాళులర్పించి గౌరవించింది. చైనా మాత్రం తన వైపు నుంచి ఎంత మంది సైనికులు చనిపోయారనే విషయాన్ని ఇప్పటి వరకు వెల్లడించలేదు. గాల్వన్ లోయ ఉదంతం నుంచి చైనా పట్ల తన విదేశాంగ విధానంలో ఒక సునిశ్చితమైన దృఢ వైఖరిని భారత్ ప్రదర్శించసాగింది. ప్రాదేశిక సమైక్యత పరిరక్షణ, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత వరకైనా పోతామనే సందేశాన్ని డ్రాగన్‌ను మోడీ సర్కారు ఇచ్చింది.

ఉక్రెయిన్‌లోకి రష్యా చొరబాటుపై భారత్ వ్యూహాత్మక వైఖ‌రి
ఇటీవల, ఉక్రెయిన్‌‌లో రష్యా సమరంపై భారత్ ఆచితూచి మౌనాన్ని పాటిస్తున్నది. తద్వారా పశ్చిమ దేశాల గుర్తింపు పొందాలనే ఆకాంక్షకు మిన్నగా స్వ-ప్రయోజనానికి ప్రాధాన్యతను ఇచ్చింది. భారత్ అనుసరించిన ఈ విధానం వామపక్షవాదులు, ఆత్మవంచనకు పాల్పడే పాశ్చాత్య వ్యాఖ్యాతల విమర్శలకు గురైంది. రష్యాను ఎదుర్కోవడంలో భారత్ విదేశాంగ విధానం పశ్చిమ దేశాలకు అనుకూలంగా లేదు, సదరు అంశంపై భారత్ వ్యూహాత్మక వైఖ‌రి అచిరకాలంగా, అత్యంత నమ్మదగిన రక్షణ భాగస్వాముల్లో ఒకటైన రష్యాతో వైరం కొనితెచ్చుకోవడం లేదనే విమర్శలను వారు చేశారు.

భారత్‌కు అమ్ములపొదిలో ఉన్న కీలకమైన ఆయుధాల్లో అత్యధికంగా 85 శాతం రష్యా మూలాలను కలిగి ఉన్నవి. దీనికి తోడుగా, “2019-20లో రకరకాల రష్యా ఆయుధాల కోసం భారత్ పెట్టిన కొత్త ఆర్డర్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో రష్యా నుంచి ఆయుధాల ఎగుమతుల్లో పెరుగుదలకు దారి తీస్తాయి” అని ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.

రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, ఉక్రెయిన్‌లోకి రష్యా చొరబడిన నాటి నుంచి తన ఇంధన అవసరాలను తీర్చుకోవడం కోసం భారత్ రెండింతలుగా ముడి చమురును రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు దిగుమతి చేసుకున్నది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళు కమ్ముకుంటున్న వేళ, చమురు ధరలు పెరిగిపోతున్న తరుణంలో పాశ్చాత్య పెత్తనాన్ని తోసిరాజని డిస్కౌంట్ ధరలకు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ద్వారా మోడీ సర్కారు ముందు చూపుతో వ్యవహరిస్తున్నది.

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై పాశ్చాత్య దేశాలు గీసిన గీతపై సాగిలపడటానికి భారత్ నిరాకరించింది. వ్మూహ‌త్మ‌క‌ వైఖ‌రిని అవలంభించింది. నైతికతపై పాశ్చాత్య దేశాలు ప్రబోధించే ఆత్మవంచనతో కూడిన ప్రమాణాలను తోసిపుచ్చింది. తద్వారా తన విదేశాంగ విధానం మూలాలు దేశ స్వ-ప్రయోజనంలో ఉన్నాయనే అంశాన్ని ప్రపంచానికి భారత్ చాటి చెప్పింది.

SOURCE: OPINDIA
వీఎస్‌కె తెలంగాణ సౌజన్యంతో..

LEAVE A RESPONSE