Suryaa.co.in

Political News

తెలుగు వజ్రం..ఇక భారతరత్నం

ఆర్ధిక విప్లవ సంస్కరణల మేధావి ప్రధానిగా ముద్ర వేసిన తెలుగు వజ్రం పాములపర్తి వెంకట నరసింహారావుకు అత్యున్నత భారతరత్న పురస్కారం లభించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. మరణానంతరం మహా మేధావి పివి నరసింహారావుకు ప్రకటించారు. అలాగే మరో నిరాడంబర పూర్వ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్.స్వామినాధన్ కు భారతరత్న ప్రకటించారు.

పద్మ అవార్డుల కమిటీకి సంబంధం లేకుండా ఇలా ఇష్టా రాజ్యంగా ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమైనా నిఖార్సయిన వారికి లభించడం వల్ల వివాదాలకు తావు లేకుండా పోయింది! పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పివి నరసింహారావు, జనతా పార్టీ కి చెందిన చరణ్ సింగ్ చౌదరి లకు ఇవ్వడం చూస్తుంటే ప్రధాని మోడీ రాజకీయ పరిణత అవార్డుల్లోకి కూడా చొరబడినట్లుగా భావించాలి.

మొత్తానికి అయోధ్య రామమందిరం కోసం రథయాత్ర చేపట్టిన ఎల్. కె. అద్వానికి, బాబ్రీ మసీదు కూల్చివేతకు అనుకూల వాతావరణం కల్పించిన అప్పటి ప్రధాని పివి నరసింహారావు కు భారతరత్న ఇచ్చి ఒక పని అయిపోయింది అనిపించుకున్నారు!

మన తెలుగు తేజాలు వెంకయ్య, చిరంజీవి పద్మవిభూషణ్ లతోనే ఈసారికి సరిపెట్టుకున్నాం అనుకుంటున్న తరుణంలో… ఆరు రోజుల క్రితం కురు వృద్ధ నేత బీజేపీ శ్వాస అయిన అద్వానికి భారతరత్న ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. అద్వానీ కూడా ఆశ్చర్యపోయారు! మళ్ళీ ఇవాళ ఇంకో ముగ్గురు మహా మేధావులకు ప్రకటించి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇప్పటికే అద్వానికి నిబంధనలకు విరుద్ధంగా, అవార్డుల కమిటీకి సంబంధం లేకుండా భారతరత్న ఇవ్వడం ఏమిటంటూ ఢిల్లీ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. మరో వైపు జాతీయ మీడియా లో చర్చ కూడా జరుగుతోంది. నిజానికి మునుపెన్నడూ ఇలా ఎప్పుడంటే అప్పుడు కమిటీతో సంబంధం లేకుండా నేరుగా ప్రధాని స్వయంగా తనకిష్టం వచ్చినట్లుగా అవార్డులు ప్రకటించిన దాఖలా లేదు! మోడీ ఇలా కూడా చరిత్ర సృష్టించారు.

కేసులు, వ్యక్తిత్వం ఇవేమి చూడకుండా, పార్టీలను కూడా పట్టించుకోకుండా దేశానికి చేసిన సేవను పరిగణన లోకి తీసుకుని, ప్రతిష్టాత్మక భారతరత్న ప్రకటించారు. ఇది మోడీ ఆత్మ విశ్వాసం! ఇది మోడీ సాహసం!

నిజానికి ఇది మంచి విధానమే! ఒక సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేతలపై కేసులు ఉండటం సహజం. వారు తీసుకున్న అనేక వాటిల్లో కొన్ని నిర్ణయాలు వికటించి ఉండొచ్చు! అంతమాత్రాన పూర్తిగా వారి సేవలను తోసిపుచ్చలేం! అదే మోడీ తీసుకున్న నిర్ణయానికి కారణమై ఉండొచ్చు! తెలంగాణ తేజం పివి నరసింహారావు కీర్తి కిరీటంలో ఇదొక మహోన్నతం! తెలుగు వారందరూ గర్వించే విషయం! పివి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.

ఇదే ఒరవడిలో దివంగత నందమూరి తారక రామారావుకు కూడా భారతరత్న ఇవ్వాల్సి ఉంది. ఎన్టీఆర్ పై లోకం నుంచి ఎదురు చూస్తున్నారు! వారి అభిమానులంతా ఇక్కడ ఆశగా ఉన్నారు! ఇదే ఆలోచన మోడీ కలలోకి వస్తే బావుండు.

– రవికుమార్

LEAVE A RESPONSE