హక్కుల కమిషన్‌కు దిక్కెవరు ?

Spread the love

– చైర్మన్‌కు స్టెనోగ్రాఫర్‌ లేని దయనీయం
– ఇంకా జీఏడీ నుంచే కారు, డ్రైవర్‌
– తీర్పులు సొంతంగా టైప్‌ చేసుకుంటున్న చైర్మన్‌ మాంధాత
– కమిషన్‌ విభజనకు మోకాలడ్డుతున్న సీఎంఓ
– క్యాంప్‌ కోర్టులకు మేం రాలేమని చెప్పేసిన సిబ్బంది
– తెలంగాణ ఉద్యోగులకూ ఏపీనే జీతాలిస్తున్న వైచిత్రి
– విభజనతో ఏపీ ఉద్యోగులకు తగ్గిన హెచ్‌ఆర్‌ఏ
– విభజనపై సీరియస్‌గా దృష్టి సారించని ఏపీ సర్కార్‌
– విభజన ఆస్తుల గొడవ లేకపోయినా ప్రక్రియ ఆలస్యం
– హక్కుల ఉల్లంఘనపై వేలల్లో వెల్లువెత్తుతున్న ప్రజల ఫిర్యాదులు
– వాటిని పరిశీలించేంత సిబ్బంది లేక ఇబ్బంది
– పత్తాలేని కమిషన్‌ విభజన కమిటీ
– కర్నూలులో హక్కుల కమిషన్‌ కష్టాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ మానవ హక్కుల కమిషన్‌ సినిమా కష్టాలు ఇంకా విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు తీర్పుతో ఏర్పడ్డ, ఆంధ్రప్రదేశ్‌ మానస హక్కుల కమిషన్‌ పాలనా వ్యవస్థ అత్యంతimageదారుణంగా ఉంది. హైకోర్డు న్యాయమూర్తి హోదా ఉన్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి ఇచ్చే తీర్పులను, టైప్‌ చేసే స్టెనో కూడా దిక్కులేని దారుణ పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించాల్సిన సిబ్బందిని రప్పించడంలో విఫలమైన విభజన కమిటీ, ఇప్పుడు పత్తాలేకుండా పోయింది. హక్కుల కమిషన్‌ మంచి చెడ్డలు పర్యవేక్షించాల్సిన ఏపీ సీఎంఓ నిర్లక్ష్యానికి, కమిషన్‌ పరువు పోతున్న పరిస్ధితి. ఇదీ కర్నూలులో అపద్ధర్మంగా నడుస్తున్న ఏపీ మానవ హక్కుల కమిషన్‌ పాలనతీరు.

జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి. ఏపీ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌. ఈ హోదా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానం. జీతభత్యాలు, ప్రొటోకాల్‌ కూడా హైకోర్టు సీజే స్థాయిలోనే ఉంటాయి. కానీ కమిషన్‌ చైర్మన్‌గా ఆయన పరిస్థితి పరిశీలిస్తే, ఎవరికైనా జాలికలగక తప్పదు. కమిషన్‌ ఫిర్యాదులపైimageతీర్పులిచ్చే ఆయన, చివరకు తీర్పులకు సంబంధించిన టైప్‌- దాని దిద్దుబాటు కూడా స్వయంగా చేసుకుంటున్న విస్మయకర పరిస్థితి. కారణం.. టైప్‌ చేయాల్సిన స్టెనోగ్రాఫర్‌ లేకపోవడం. ఆశ్చర్యంగా.. కొత్తగా కమిషన్‌ ఏర్పడ్డ రోజుల్లో, సర్కారు ఆయనకు అధికార వాహనం కూడా సమకూర్చలేదు. దానితో చాలాకాలం ఇంటి నుంచే అధికార పనులు నిర్వర్తించారు. ఈ దుస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో, జీఏడీ నుంచి ఆయనకు ఒక కారు-డ్రైవర్‌ సమకూర్చారు.

మానవ హక్కుల కమిషన్‌ను మాజీ చైర్మన్‌ కాకుమాను పెదపేరిరెడ్డి మాదిరిగా, జనంలోకి తీసుకువెళ్లాలని జస్టిస్‌ మాంధాత సంకల్పించారు. దానితో మూడు-నాలుగు జిల్లాలకు కలిపి ఒక జిల్లాలో క్యాంపు కోర్టు ఏర్పాటు చేశారు. ఫలితంగా జనం నుంచి ఊహించనంత స్పందన లభించింది. కమిషన్‌ ప్రధానimageకార్యాలయం ప్రస్తుతం కర్నూలులో ఉండటంతో, బాధితులు అంతదూరం రాలేక, తమ బాధలను పోస్టు కార్డులు, లెటర్ల రూపంలో ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని పరిశీలించేంత సంఖ్యలో సిబ్బంది కూడా లేరు. ఈ ఇబ్బందికర పరిస్థితి గ్రహించిన జస్టిస్‌ మాంధాత, కమిషన్‌ను జనం వద్దకు తీసుకువెళ్లారు. ఆ ప్రయోగం విజయవంతమైంది.

నిజానికి జస్టిస్‌ మాంధాత హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా వచ్చిన తర్వాత, రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘనలపై వివిధ వర్గాల నుంచి, ఫిర్యాదు కేసులు పెరిగాయి. అంతకుముందు ఉత్తరాలకే పరిమితమైన ఫిర్యాదులు, ఇప్పుడు చైర్మన్‌ దృష్టికి వస్తున్నాయి. ఆయన కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ అవిశ్రాంతంగా బెంచ్‌ మీద కూర్చుని, వీలైనన్ని ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాదులు చెబుతున్నారు.

‘కమిషన్‌ చైర్మన్‌ బాగా కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ వనరులు లేకపోతే ఆయన మాత్రం ఎంతవరకూ పనిచేయగలరు? ఆయన నుంచి మేం కూడా ఏం ఆశించగలం? ఇప్పటికైతే ఉన్న సౌకర్యాలు,image సిబ్బందితోనే ఆయన పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు సీజే హోదా ఉన్న చైర్మన్‌కు, కనీస వసతులు కల్పించకపోవడం దారుణం. చైర్మన్‌గారు తన తీర్పులను తానే టైప్‌ చేసుకోవడం ఎక్కడైనా ఉంటుందా? ఇది ఆయనకు కాదు. ప్రభుత్వానికి, హక్కుల చట్టానికే అవమానం’’ అని న్యాయవాది సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, తాము ఇకపై క్యాంపు కోర్టులకు రాలేమని, కమిషన్‌ సిబ్బంది చైర్మన్‌కు మొరపెట్టుకున్నారు. నలుగురైదుగురు చేయాల్సిన పని ఒకరు చేయడం కష్టమని వారు తమ నిస్సహాయత వ్యక్తం చేశారు. దానితో వారి సమస్యల్లోని వాస్తవాన్ని గ్రహించిన చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత, జిల్లాల్లో క్యాంపు కోర్టులు నిర్వహించడం నిలిపివేశారు.

కాగా విభజన కాకుండానే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కర్నూలుకు వచ్చిన తాము, హెచ్‌ఆర్‌ఏ నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. హైదరాబాద్‌లో కమిషన్‌ కార్యాలయంలో పనిచేసినప్పుడు రాష్ట్ర స్థాయి హెచ్‌ఆర్‌ఏ తీసుకున్న తాము, ఇప్పుడు కర్నూలుకు వచ్చి జిల్లా స్థాయి హెచ్‌ఆర్‌ఏతో సరిపెట్టుకోవలసి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కర్నూలులోని కమిషన్‌ కార్యాలయంలో జరిగే కోర్టులో, చైర్మన్‌ ఇస్తున్న తీర్పులను టైప్‌ చేయాల్సిన స్టెనోగ్రాఫర్‌కు, దిక్కులేకుండా పోయింది. దానితో గత్యంతరం లేక, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, ఇక్కడ కూడా చైర్మన్‌ హోదాలో అదే ర్యాంకు ఉన్న మాంధాత, తన తీర్పులను తానే టైప్‌ చేసుకోవాల్సిన దయనీయం నెలకొంది. హైకోర్టు సీజే స్థాయి హోదా ఉన్న మాజీ న్యాయమూర్తికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా ? అన్న ప్రశ్నలు న్యాయవాద వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

నిజానికి రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌ నాంపల్లిలోని కమిషన్‌ ప్రధాన కార్యాయలంలోని సిబ్బందితో కార్యకలాపాలు సరిపడినంత నడిచేవి. విభజన తర్వాత కూడా చాలాకాలం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగేవి. అయితే రెండు రాష్ర్టాల కమిషన్లకు చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో,2016 నుంచి 2019 వరకూ అసలు చైర్మన్లు లేకుండానే రెండు రాష్ర్టాల హక్కుల కమిషన్‌ కొనసాగడం మరో విశేషం.

ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో రెండు రాష్ర్టాల్లోనూ విడిగా కమిషన్లు ఏర్పడినప్పటికీ.. కమిషన్‌ విభజన జరగకపోవడంతో, తెలంగాణ ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వమే తన వంతు వాటాగా జీతాలిస్తోందని ఏపీ హక్కుల కమిషన్‌ ఉద్యోగులు చెబుతున్నారు. అదే విభజన ప్రక్రియ పూర్తి చేస్తే, హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఉద్యోగులు కర్నూలుకు రావడంతోపాటు, కొత్తగా మంజూరైన పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కమిషన్‌ కార్యాలయంలో, 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదే విభజన జరిగితే 2014 విభజన చట్టం, 10 వ షెడ్యూల్‌ ప్రకారం.. సుమారు 50 మంది ఉద్యోగులు ఏపీ కమిషన్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. 10వ షెడ్యూల్‌లో ఇంకా విభజన కాని ఉమ్మడి సంస్థలకు తెలంగాణ 48 శాతం, ఏపీ 52 శాతం బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ కింద జీతాలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఏపీ సీఎంఓ అధికారులు హక్కుల కమిషన్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషన్‌ అవసరాలు, సిబ్బంది తదితర అంశాలతో చైర్మన్‌ మాంధాత ఇచ్చిన లేఖలను.. సీఎంఓ అధికారి ముత్యాలరాజు అమలుచేయడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. హక్కుల కమిషన్‌ సభ్యులు.. విభజన కమిటీ సభ్యుడైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినప్పటికీ, ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్‌ కు ఎలాంటడి ఆస్తులు లేనందున, విభజనకు ఇంతకాలం ఎందుకు పడుతుందో అర్ధం కావడం లేదని న్యాయవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు- పర్యవేక్షణ కమిటీ ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ , మాజీ ఐఏఎస్‌ ప్రేంచంద్రారెడ్డి .. పెండింగ్‌లో ఉన్న శాఖల పునర్విభజన సమస్యలు చక్కబెట్టాల్సి ఉంది. తెలంగాణ కమిషన్‌తో మాట్లాడి, ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టవలసి ఉంది. కానీ ఆయన కూడా దీనిపై నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ లేకపోలేదు.

Leave a Reply