బలగం సినిమాపై ఏంటీ కాకి గోల?

ఇది తెలుగు వారందరి కథ
కాదు కాదు భారతీయుల కథ
ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం మానవాళి కథ

పల్లె తల్లి మట్టి పరిమళం, పంట చేల పచ్చదనం, పల్లె నిండా పరచుకున్న అనుబంధాల వెచ్చదనం, పల్లె మాటల కొంటెదనం, పల్లె మనుషుల గడుసుదనం, వారి పంతాలు, పట్టుదలలు, మూర్ఖత్వాలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఆలింగనాలు, పలకరింపులు, పరామర్శలు, బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాటి అంతరార్థం, పరమార్ధం వెరసి బలగం. బలగం కథ ఇంటింటి కథ. ప్రతి గుండెనూ తడి చేసే కథ. ప్రతి గుండే… జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా పడే వ్యధ. అందుకే బలగం ప్రతి మనసునూ కదిలిస్తోంది. ప్రతివారూ తమ బలగంతో, బంధు గణంతో వెళ్లి సినిమాను చూసేలా చేస్తోంది.

అసలు జబర్దస్త్ వేణులో ఇంత గొప్ప కథకుడు, దర్శకుడు ఉన్నారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. కానీ అతను ఎంచుకున్న కథ, ఆ కథను చెప్పిన తీరు, పాత్రధారుల ఎంపిక, నేపథ్యం, దృశ్యాలు, చిత్రీకరణ నిజంగా అద్భుతం. ఎంతో అనుభవమున్న దర్శకుడు తెరకెక్కించినట్లుగా చిత్రాన్ని తెరకెక్కించాడు. బలగంలోని బలాన్ని, బంధుత్వాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రేక్షకుల తలకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ మాండలికంలో చిత్రీకరించినప్పటికీ, చాలామంది అంటున్నట్లుగా ఈ సినిమా తెలంగాణ సినిమా కాదంటే కాదని నేను ఘంటాపథంగా చెప్తాను.

ఇది తెలుగు వారందరి కథ. కాదు కాదు భారతీయుల కథ. ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం మానవాళి కథ. మనుషుల గుండె లోతుల్లో ఎక్కడో ఏ మూలనో ఉండే మమతలు, ఆప్యాయతలు, అనురాగాలను తట్టి లేపే కథ. ఇది ప్రతి ఊరి కథ, ప్రతి వారి కథ. పెద్ద పెద్ద దర్శకులు దర్శకత్వం వహించి, పెద్ద పెద్ద హీరోలు నటించిన చిత్రాలు సైతం కథా బలంతో కాకుండా, తొడ కొట్టడాలు, పడికట్టు పదాలు, పంచ్ డైలాగులు, అంగాంగ ప్రదర్శనల మీద ఆధారపడి నడుస్తున్న సమయంలో….. వేణు లాంటి ఒక సాధారణ దర్శకుడు, సినిమా ఆసాంతం ఎక్కడా ఎలాంటి అశ్లీలతకు, అసభ్యతకు తావివ్వకపోవడం గమనార్హం. సినిమాలో వచ్చిన పాటలు కూడా అసహజంగా అతికించినట్లు కాకుండా ..సందర్భోచితంగా, కథలో ఇమిడిపోయేటట్లుగా ఉండడం కూడా వేణు దర్శకత్వ ప్రతిభకు ఓ తార్కాణం.

దురదృష్టమేమిటంటే…. ఇంతటి అసామాన్య జనాదరణకు నోచుకున్న ఓ సామాన్య చిత్రం, వేణు లాంటి ఓ సామాన్యుడి ప్రతిభను చాటి న చిత్రాన్ని కూడా, కొంతమంది విమర్శిస్తూ ఉండడం. ఓ విమర్శకుడంటాడూ… ఒకే తండ్రి కడుపున పుట్టినంత మాత్రాన అందరూ ఒక్కటిగానే ఉండాలా? ఒక్కొక్కరికీ ఒక్కొక్క రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి కదా? అని ప్రశ్నించాడు. కలసి ఉండడం కూడా కరెక్ట్ కాదని వాదించడం ఉంది చూశారూ….. ఆహా… ఎంత గొప్ప అభ్యుదయమండీ మీది? మేస్టారూ…. దీన్నే మరోలా చెప్పమంటారా? వేరు వేరు రాజకీయ అభిప్రాయాలు, ఆచరణలు ఉన్నంత మాత్రాన వ్యక్తులు కలిసి ఉండకూడదని ఎందుకనుకోవాలి?

నా రాజకీయ అభిరుచులతో, భావజాలంతో విభేదించే వారు సన్నిహిత మిత్రులు ఎందరో నాకున్నారు? మరి ఒకే ఇంట్లోని వారు, అభిప్రాయాలు వేరయినంత మాత్రాన ఎందుకు కలిసుండకూడదు? పైగా ఈ సినిమాలో వారి వ్యక్తిగత పంతాలు, పట్టుదలలు, కుటుంబ సమస్యల పైన చర్చించారే తప్ప వారి రాజకీయ అభిప్రాయాల జోలికి వెళ్లలేదే? ఆవు కథలాగా విషయం ఏదైనా…. ఎప్పుడూ ఒకే ఏడుపా? సమాజం కలిసున్నా, కలిసి ఉండకపోయినా, కలిసుండమని హితవు చెప్పినా ఏడుపేనా? ఇదెక్కడి సమస్యండీ బాబూ?

సినిమాలో చూపించిన ‘కాకి ముట్టటం’ అనే అంశం పైన మరో ఏడుపు. సినిమాలోనే చెప్పారుగా? ‘కాకి ఆత్మలను చూడగలదు’ అని. నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మని వాళ్ళని నమ్మమని బలవంతం చేయటం లేదు. అలాంటప్పుడు నమ్మే వాళ్ళ పైన నమ్మని వాళ్ళ ఏడుపులెందుకు? ఈ కాకి గోలెందుకు? పునరపి జననం… పునరపి మరణం…. అని శంకరాచార్యులన్నారు. “నైనం ఛిందంతి శాస్త్రాణి నైనం దహతి పావకః ! న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః !! ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఎండింపజాలదు.” అని గీతలో భగవానుడు చెప్పాడు. ఆ సత్యాన్నే బలగం సినిమా చాటింది.

ఇందులో అంతర్లీనంగా మరో అంశం కూడా ఉంది. “స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః” అని గీతలో చెప్పినట్లుగా ఏ కారణం చేతనైనా ఈ ఆచారాలకు, సాంప్రదాయాలకూ దూరమైనవారు పితృ ఋణం తీర్చుకోలేరు, వారి పూర్వీకులకు సద్గతులను ప్రాప్తింపజేయలేరు అనే విషయాన్ని కూడా ఈ చిత్రం అండర్ కరెంట్ గా చెబుతోంది.

చాలా రోజుల క్రితం టీవీలో వచ్చిన చాణక్య సీరియల్ లో ఓ సన్నివేశంలో…. చాణక్యుడు దేశ రక్షణకై తన శిష్యులను కార్యోన్ముఖులను చేసే ప్రయత్నంలో ఇలా చెబుతాడు…. “మనం మన సంస్కృతీ సాంప్రదాయాలను విడనాడనంతకాలం, మనం విదేశీ దురాక్రమణదారులకు భౌతికంగానే పరాజితులం. అయితే వారు మన భూభాగాన్ని ఆక్రమించిన మరుక్షణం నుంచీ వ్యక్తి వ్యక్తినీ కలిపే మన విశిష్ట సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. అదే జరిగితే మన పతనం తథ్యం. దాన్ని మనం అడ్డుకోవాలి.” అని చెబుతాడు.

సంస్కృతి వ్యక్తులను ఎలా కలుపుతుందని నాకప్పుడు సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ఇప్పుడు బలగం సినిమా తీర్చింది. ఎస్…. భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి వ్యక్తి వ్యక్తినీ కలుపుతుంది. ఆ సత్యానికి చిత్ర రూపమే ఈ బలగం. దశాబ్దాల క్రితమే దూరమైన బంధువుల మనసులను ఆ సంస్కృతే దగ్గర చేసింది. ఒకరి మీద ఒకరికి ప్రేమాప్యాయతలు, బాధ్యతలు ఉన్నా, పంతాలకు, పట్టింపులకు పోయి ఒకరి మధ్య ఒకరు అమాయకంగా, అసంకల్పితంగా నిర్మించుకున్న అభిజాత్యాల అడ్డుగోడలను ఆ సంస్కృతే పటాపంచలు చేసింది.

హిందూ ధర్మంలోని ఆచారాలు, సాంప్రదాయలు మనుషులను కలిపి ఉంచేందుకేనని చాటి చెప్పింది. కడుపున పుట్టిన బిడ్డలు ఒక్కటిగా మసలక పోతే ఆ తల్లిదండ్రులు పడే వేదనను వర్ణిస్తూ… ” ఒక్క కడుపున పుట్టినోళ్ళు మీరె మాకు ప్రాణము… ఒక్క పిడికిలి లెక్క మీరు కూడి ఉంటెనె బలగము… ఒకరికొకరు ప్రేమ పంచి తీర్చుకొండి మా ఋణము….” అంటూ సాగే ఆ చిట్టచివరి పాట ఎంతటి కరకు గుండెనైనా కరిగించి కన్నీరు పెట్టిస్తుంది. ఆ పాటే సోల్ ఆఫ్ ది మూవీ. కాకులు, కాట్లాటలు ఇవన్నీ… తన కడుపున పుట్టిన సంతానం కలిసుంటేనే…. ఏ తల్లికైనా, తండ్రికైనా ఆనందము, ఆత్మ తృప్తి అని చెప్పడానికే. అదే బలగం సినిమా కోర్ కంటెంట్ కూడా.

ఎవరి ఏడుపులు ఎలా ఉన్నా బలగం సినిమా ప్రజల మన్ననలు పొందింది. ఊరూరా పెద్ద స్క్రీన్లు పెట్టుకుని ఊరంతా కలిసి సినిమా చూస్తున్న దృశ్యాలు, తమ తాతలను, తండ్రులను, అమ్మలను, అమ్మమ్మలను, నానమ్మలను గుర్తు చేసుకుని ఆ ఆత్మీయ స్పర్శతో గుండె తడి కాగా…. ఆ తడి కన్నీరై కారగా ఒకరికొకరు ఓదార్చుకుంటూ విలపిస్తూ ఉన్న ఘట్టాలు ఊరూరా కనిపిస్తున్నాయి. ఇదీ భారతీయ జీవన విలువలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు, సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రజలలో ఉన్న ఆదరణ. ఆ ఆదరణే ఓ శంకరాభరణమై మెరిసింది, ఓ సాగర సంగమమై మన మనసులను తాకింది, ఓ కాంతారై కలకలం రేపింది. ఇప్పుడు అదే బలగమై బలాన్ని చాటింది. భారత్ మాతాకీ జై.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

Leave a Reply