ఆ రోజులే వేరప్పా..

– నరసరావుపేట శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల మరిచిపోని మధురానుభూతి

గ్రామస్థాయి ప్రాథమిక పాఠశాల నుండి , సమీపములోని మేజర్ గ్రామపంచాయతీ మురికిపూడి లో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు వెళ్ళినప్పుడు గానీ , అక్కడనుండి నర్సరావుపేట లోని SSN కళాశాలకు వెళ్ళినప్పుడు గానీ కొంచెం బెరుకుబెరుకుగా ఉండి, యిటువంటి పెద్ద విద్యాలయాలలో మనము నిలదొక్కుగోగలమా ? అని నేను భయపడిన మాట వాస్తవము. ఇది నాలాంటి గ్రామీణ నేపథ్యం కలిగి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులందరికీ సహజం అని నా అభిప్రాయం.

హైస్కూల్లో చదివేటప్పుడు మా వేషధారణ ఎట్లావుండేదంటే , రోజూ ఉతికి ఆరేసిన (ఇస్త్రీ లేని ) కాటను నిక్కరు , చొక్కా , కాళ్లకు హవాయి చెప్పులు( స్ట్రాప్ తెగిపోతే పిన్నీసులతో బైపాసు సర్జరీ చేసి, సోలు అరిగిపోతే కాలి మడిమలు కొంతమేర నేలను తాకుతూ ) భుజంపై ఒక పెద్ద స్కూలు సంచీ . ఆ సంచీలో ఆరోజు ఉండే క్లాసుల పాఠ్యపుస్తకాలు , నోటుపుస్తకాలు , కాంపొజిషన్ పుస్తకం , డ్రాయింగ్ పుస్తకం జామెట్రీ బాక్సు , ఇత్యాదు లతో నిండిపోయేది . ఇంచుమించు వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఉంచిన గోతాము లా ఉండేది ఆ స్కూల్ బ్యాగ్ .

తర్వాత కాలేజీ చదువు కోసం (1971 ఇంటర్మీడియట్ CEC గ్రూప్) నరసరావుపేట లోని SSN కళాశాల లో చేరడం జరిగింది. , కాలేజీ కి వచ్చేటప్పడికి అక్కడి వాతావరణం వేరేగా ఉన్నది విద్యార్థులు అందరూ స్టైల్ గా కాళ్లకు మెరిసిపోతున్న బూట్లు, ఇస్త్రీమడతలతో ఉన్న రంగురంగుల టెరీకాటన్ ప్యాంట్లు అందులోకి దిగేసిన టెర్లిన్ పొడుగుచేతుల చొక్కాలు వేసుకొని, చేతిలో సుతారంగా రెండోమూడో నోటుబుక్కులు పట్టుకొని వచ్చేవారు ఆరోజుల్లో అక్కడ ఆడే తెలుగు సినిమాల్లో హీరోలులాగా ఉండేవారు. నిజానికి ఒకతను భార్యాబిడ్డలు లో నాగేశ్వర్రావులాగా , ఇంకొకతను కళ్యాణమంటపం లో శోభన్ బాబు లాగా , మరొకతను దత్తపుత్రుడులో రామకృష్ణ లాగా ఉండేవారని మిత్రులు అంటుండేవారు

SSN కాలేజీ కి సింహద్వారతోరణం పల్నాడు రోడ్డులో ( నరసరావుపేట- నాగార్జున సాగర్) వెళ్తుంటే పేట పరిధి (అప్పట్లో) దాటుతుండగ నే ఎడమవైపు ఉంటుంది . ఆ వెన్వెంటనే రావిపాడు గ్రామము . రోడ్డుమీద నుండి ఒక ఫర్లాంగు లోపే H ఆకారంలో కాలేజీ ప్రధాన భవనం ఉన్నది. కుడి వైపున సైకిలు స్టాండ్. , జీవశాస్త్ర విభాగం వారి ప్రయోగశాల , గ్రంధాలయం, కొన్ని క్లాసురూములు ఉన్నవి. .పోర్టికో దాటి ప్రధాన ద్వారం లోకి ప్రవేశించగానే, మొదటి అంతస్థు వెళ్ళటానికి మెట్లు ఉన్నవి. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎడమవైపున ఉన్న మొదటి గది ప్రిన్సిపాల్ గారిది . దాని ప్రక్కన పెద్దదిగా వుండే రెండవగది కాలేజీ ఆఫీస్. . రెండుపైపులా రెండేసి కిటికీలు ఉండేవి.

.వీటిప్రక్కన కూర్చున్న గుమాస్తాలు కాలేజి పనుల నిమిత్తం , బయటవుండే విద్యార్థులతో ఈ కిటికీల గుండా ప్రతిస్పందించే వారు (interact ) .వీటి గుండా నే మేము అడ్మిషన్ అప్లికేషన్ ఇచ్చింది తర్వాత ఫీజులు కట్టింది , మార్కుల లిస్ట్ తీసుకుంది ఇక్కడే , చివరకు బదిలీ సర్టిఫికెట్ , ప్రవర్తనా సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్ , బీకామ్ డిగ్రీ సర్టిఫికెట్లు కూడా ఈ ఆఫీస్ గదినుండే తీసుకున్నాము . ప్రిన్సిపాల్ గది , ఆఫీస్ గది లో ఎప్పటికప్పుడు మట్టిపాత్రలు శుభ్రపరచి తాజా త్రాగునీరు నింపడానికి ఒక ముస్లిం పెద్దావిడ ఉండేవారు. ఆమెకు మా తాతగారి ఊరు కొణిదెన గ్రామంలో బంధువులు ఉన్నారని తెలిసింది.

ఆ రోజుల్లో అసలే కాలేజీ ఫీజులు తక్కువ. .తక్కువ ఆదాయం గల కుటుంబాల్లోని విద్యార్థులు ఆ మేరకు ఆదాయం సర్టిఫికెట్ సమర్పిస్తే , ఆ ఫీజుకూడా మాఫీ అయ్యేది . చివరి తేదీ కావడంతో మా మిత్రుడు ఒకరు, ఉదయం ఆఫీస్ లో ఫారం తీసుకుని అంతా నింపి , తండ్రి సంతకం తానే చేసి మధ్యాహ్నం ఆఫీసులో ఇచ్చాడు. ప్రొద్దున సదరువిద్యార్దికి ఫారం ఇచ్చినట్లు గుర్తున్న ఆ గుమస్తా, “ఇప్పటికిప్పుడు సంతకం చేయడానికి మీ నాయన ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ? “అని తీవ్రంగా దూషించి , నీకు ప్రత్యేకంగా నాల్గు రోజులు గడువు ఇస్తున్నాను. పోయి నిజంగా మీ నాన్న తో సంతకం చేయించి ఫారం తీసుకురా! ఇట్లాంటి ఫోర్జరీ పనులు ఎప్పుడూ చేయకు . తప్పులు చేయకుండా నిజాయితీ గా ఉంటే జీవితంలో పైకి వస్తావు అని చెప్పి పంపించాడు.

ఈ మొదటి వరుస దాటి లోపలకు వెళ్తే ఎడమవైపు కాలేజీ విద్యార్థులు అందరూ కూర్చుని వీక్షించే వీలుగా, రాతితో కట్టిన పెద్ద గ్యాలరీ . కుడివైపున స్టేజి. వీటి వెనకాల వరుసలో రెండుఅంతస్థుల లో క్లాసురూములు . గ్యాలరీ వైపు ఒక ప్రవేశ ద్వారం ఉండేది . ద్వారాన్ని ఆనుకొని బయటవైపు కాలేజీ క్యాంటీను ఉన్నది. లెక్చెరర్ల కోసం ఒక గది , విద్యార్థులు కోసం హాలు ఉండేవి .

ఈ ద్వారం గుండా లోపలకు ప్రవేశిస్తే .. ఎడమవైపు ఆడపిల్లల వేచియుండుగది ఉన్నది. కాలేజీ భవనాలు ఆనుకుని దక్షిణంవైపు ప్లే గౌండ్ ఉండేది ఇందులో బాస్కెట్ బాల్ , బాడ్మింటన్ కోర్టులు , కబడ్డీ కోకో ఆట స్ధలాలు ఉండేవి . నైరుతి లో కాలేజీ హాస్టల్ భవనం ఉంది. హాస్టల్ ముందు క్రికెట్ గ్రౌండ్ ఉండేది. మేము 1971 లో ఇంటర్మీడియట్ లో చేరినపుడు డా .ఇలీంద్ర రంగనాయకులు గారు ప్రిన్సిపాల్ గా ఉండేవారు. వారు గణిత శాస్త్రంలో కొన్ని పుస్తకాలు వ్రాసారు . వాటిని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు డిగ్రీ స్థాయిలో పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు. వారు వ్రాసిన ఒక తెలుగు చారిత్రాత్మక నవలకుమాదేవి అనుకుంటా) BA డిగ్రీ వారికి non-detail పుస్తకం గా ఉండేది .

వారు కొంత కాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యునిగా కూడా ఉన్నారు. ఈ కాలేజీ విద్యార్థులు గానీ , పూర్వ విద్యార్థులు గానీ బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు , ” నీవు రంగనాయకులుగారి శిష్యుడివా ? ” అని గౌరవించేవారు . స్వయంగా పుట్టపర్తి శ్రీ సాయిబాబా భక్తులైన రంగనాయకులు గారు ఇక్కడ పదవీవిరమణ అనంతరం, పుట్టపర్తి చేరుకొని, స్వామి సన్నిధిలో శేషజీవితం గడుపుతూ అక్కడి కాలేజీలను నిర్వహించేవారు . నరసరావుపేట పట్టణములో ఎటువంటి విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక కార్యక్రమం జరిగినా .. రంగనాయకులు గారు ముఖ్యఅతిథిగా ఉండేవారు . ఇక యువకులు ఐతే వారి శిష్యులు ఐనా కాకపోయినా , వారి ఎదుటపడటానికి సంకోచించి, ప్రక్క రోడ్డులో వెళ్లేవారు. ఎవరైనా నమస్కరిస్తే ప్రతిచర్యగా , పలువరస కనిపించేటట్లు చిరునవ్వు నవ్వేవారు.

కాలేజీలో వివిధ విభాగాలు ఉండేవి. హిందీ విభాగం అధిపతి డా. రమణారెడ్డి గారు వైస్ ప్రిన్సిపాల్ గా ఉండేవారు . అది విద్యార్థులు సరదాగా వారికి పెట్టిన మారుపేరోమో అనుకున్నాము . కానీ సినిమాల్లోని రమణారెడ్డికి , వీరికి ఎక్కడా పోలికలేదు. తరవాత వారు అదే ఊళ్ళో క్రొత్తగా పెట్టిన శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజీకి ప్రిన్సిపాల్ గా వెళ్లారు తెలుగు విభాగం అధిపతి శ్రీ గుంటుపల్లి వెంకటేశ్వరరావు గారు . వీరి కుమారుడే ప్రస్తత రాజ్యసభ సభ్యులు GVL నరసింహారావు . ఆంగ్లవిభాగం అధిపతి గా శ్రీ GV జోగారావు గారు ఉండేవారు.

ఆంగ్ల విభాగంలో హ్యాండ్సమ్ మరియు ప్లీజింగ్ పర్సనాలిటీ శ్రీ DNM శర్మ గారు అంటే విద్యార్థుల్లో హీరో ఆరాధనా భావం ఉండేది . భౌతికశాస్త్రవిభాగం అధిపతి శ్రీ గుబ్బా బాలనరసయ్య గారు. వీరు కాలేజిహాస్టల్ వార్డెన్ గా వుండేవారు ..రసాయనశాస్త్రవిభాగం అధిపతి శ్రీ R. సీతారామారావుగారు . వీరు చాలా బక్క పలచగా ఉండేవారు .కెమిస్ట్రీ లెక్చెరర్ గుప్తా గారితో కలిసి వీరు తాలూకాఆఫీసు ప్రక్కన క్లబ్ గ్రౌండ్లో టెన్నిస్ ఆడేవారు. తెల్లటి నిక్కరు, టీషర్టు ధరించి dresscode పాటించేవారు.

ఆటకు ముందు దుర్గాభవన్ లో చపాతి కాఫీ సేవించడం వీరి ఆనవాయితీ . గణిత శాస్త్ర విభాగంలో గురువులు గారు అని ఒక లెక్చరర్ సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండేవారు. విద్యార్థులు అట్లా గౌరవంగా సంబోధించేవారేమో అనుకున్నాము .కానీ వారి అసలు పేరే “గురువులు ” అని తర్వాత తెలిసింది గణితశాస్త్ర విభాగం అధిపతి శ్రీ గర్నేపూడి సీతారామశర్మ గారు. వీరు కాలేజీ NCC విభాగము సమన్వయకర్త గా ఉండేవారు. ఇంకా చరిత్ర విభాగానికి శ్రీ మాధవరావుగారు , ఆర్థికశాస్త్ర విభాగానికి శ్రీ M సూర్యనారాయణ గారు వృక్ష శాస్త్ర విభాగానికి. శ్రీకృష్ణస్వామిగారు , జంతుశాస్త్ర విభాగానికి శ్రీ కృష్ణానందం గారు అధిపతులుగా ఉండేవారు.

ఇక మా వాణిజ్యశాస్త్ర (కామర్స్) విభాగం అధిపతి శ్రీ కళ్యాణ కృష్ణమూర్తి గారు. ఈ విభాగంలో ఇతరులు : బీకామ్ లో మాకు వ్యాపార న్యాయశాస్త్రం చెప్పిన KVLN రావు గారు,కాస్టింగ్ చెప్పిన వై.సత్యనారాయణ గారు, ఆడిటింగ్ చెప్పిన సి.సత్యనారాయణ గారు , బ్యాంకింగ్ చెప్పిన జుజ్జూ రి వేంకటేశ్వర రావు గారు , స్టాటిస్టిక్స్ చెప్పిన హరగోపాల్ గారు (వీరికి గాంధీ చౌక్ లో పుస్తకాల షాపు ఉండేది ) ఉండేవారు . వీరేగాక ఇంటర్మీడియట్ లో అకౌంట్స్ చెప్పిన నాగభూషణం గారు, కామర్స్ చెప్పిన క్రొత్త సుబ్బారావుగారు రామసుబ్బయ్య గారు గూడ కామర్స్ విభాగంలో ఉండేవారు .

ఈ ముగ్గురు అప్పుడే తాజాగా PG చేసి వెంటనే లెక్చరర్ ఉద్యోగంలో చేరినట్టున్నారు . పెద్దగా వయోబేధం ఉండేదిగాదు . మాలో చాలామంది విద్యార్థులు వీరి కంటే ఎక్కువ ఒడ్డుపొడుగుతో భౌతికంగా పెద్దగా ఉండేవారు. వీళ్ళను బాగా ఆట పట్టించేవారు. మా క్లాసులో విద్యార్థులు సుమారు వందమంది ఉండేవారు . కొంతమంది ఆకతాయిలు పిచ్చిఅల్లరి చేసి , వీరిని విసిగించేవారు. ఒకసారి సుబ్బారావు గారు కొందరి విద్యార్థులను “గెట్ అవుట్ ” అని బయటకు వెళ్లిపొమ్మన్నారు . నలుగురు విద్యార్థులు ఒకడిని శవంలాగా భుజాలపై మోస్తూ , పెద్దగా రోదిస్తూ (అభినయిస్తూ ) బయటకు నిష్క్రమించారు.

లైబ్రేరియన్ గా శ్రీ కేవీకే రామారావు ఉండేవారు. ఆయన ఈ జాబ్ తోపాటు.. అదనంగా 16mm సినిమాలు , పరిసర గ్రామాల్లో ప్రదర్శించే వ్యాపారం. గూడ చేస్తుండేవారు.. వారు నటరత్న NTR కు దగ్గరి స్నేహితులని , కోడెల శివప్రసాద్ గారిని ఎన్టీఆర్ కి పరిచయం చేసింది వారేనని తర్వాత చదివాను . ఉదయం లైబ్రరీ కేటలాగ్ చూసి రిక్వెస్ట్ పెడితే ,సాయంత్రం పుస్తకాలు ఇచ్ఛేవారు. లైబ్రరీ పుస్తకంలో మెయిన్ అట్ట తరవాత పేజీలో అంటిచిన ఒక పేపర్లో, ఎవెరెవరు ఎప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళింది , మళ్ళీ ఎప్పుడు తిరిగిఇచ్చిందీ స్కోర్ కార్డు లాగా ఉండేది. విద్యార్థుల లైబ్రరీ కార్డు తమ వద్ద అట్టేపెట్టుకుని, బుక్స్ ఇచ్చేవారు . పబ్లిక్ పరీక్షల హల్టికెట్స్ ఇచ్చే ముందు విద్యార్థుల నుండి బకాయిలు ఏమైనా ఉన్నాయా చూసేవారు.

పల్నాడు రోడ్ వైపు ఉన్న ప్రధాన ద్వార తోరణం కు .. ఎడమవైపు ” రీడింగ్ రూమ్ కం రిక్రియేషన్ ” ఆడిటోరియం హాలు ఉన్నది . ఈ హాలు బాల్కనీలో కూర్చొని దిన వార పక్ష పత్రికలు చదువుకోవచ్చు ,రేడియో ఉండేది .కొన్ని విజ్ఞాన కార్యక్రమాలు పాటలు వినిపించేవారు . క్రింద హాలులో విద్యార్థులు తమ సహచరుల ఆహ్వాన వీడ్కోలు ఉత్సవాలు చేసేవారు. స్టేజి ఉండేది . నాటకాలు డ్రామాలు వేసేవారు. రిహార్సల్స్ చేసుకునేవారు .కాలేజీ తరఫున కొన్ని దేశభక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ హాలులో జరిగేవి. . ఆగస్ట్ 15 న స్వాతత్ర్యదినోత్సవ కార్యక్రమం ముందు , కొన్ని దేశభక్తి గీతాలు వినిపించేవారు,. అందులో కొన్ని , ఘంటసాల పాడిన “స్వాతంత్రమే మా జన్మహక్కని చాటండీ ” “భారతీయ కోకిలమ్మ , తెలుగువారి కోడలమ్మ అమ్మా ! సరోజినీదేవి “, లాంటి దేశభక్తి పాటలు , అట్లానే కరుణశ్రీ విరచితమై ఘంటసాల వారు జాలిగొలిపేరీతిగా హృద్యంగా ఆలపించిన”పుష్పవిలాపం “, అదేవిధంగా ఘంటసాలగారే పాడిన “కుంతీ విలాపం ” “( సహజ కవచకుండలాలతో మెరిసిపోతున్న పసిబిడ్డ కర్ణుణ్ణి గంగానదిలో విడిచిపెట్టబోతూ కొడుకుని మళ్లీమళ్లీ తనువంతా ముద్దాడి కుంతీదేవి పడే మనోవేదన ఘంటసాల వారి కరుణాపూరిత స్వరంలో వింటున్న శ్రోతల గుండెల్ని పిండివేయకమానదు ). అట్లానే కొన్ని ఘంటసాల వారి లలితగీతాలు గూడ , ” తలనిండ పూదండ దాల్చిన రాణీ ” , ” బహుదూరపు బాటసారీ ఇటు రావో ఓక్కసారీ ” ” నిన్ను నేను మరువలేనురా !ఓ పోలీసు వెంకటసామీ ” లాంటివి వినిపించేవారు . అప్పుడప్పుడు ఈ ఆడిటోరియంలో లైబ్రేరియన్ రామారావు గారు కొన్ని చలనచిత్రాలును విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించేవారు.

నరసరావుపేట SSN కాలేజీ కి కేవలం పల్నాడు ప్రాంతం నుండేగాక… నెల్లూరు, కర్నూలు ,ప్రకాశం జిల్లాలనుండి కూడా విద్యార్థులు వస్తుండేవారు , కొండొకచో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలనుండి మరీ వచ్చేవారు . ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ కాలేజీకి మంచిపేరు ఉండేది., కాస్త సంపన్న కుటుంబాలనుండి వచ్చిన విద్యార్థులు, కాలేజిహాస్టల్ లో ఉండేవారు. . వీరిలో కొంతమంది నర్సారావుపేటలో రూములు అద్దెకు తీసికొని , హెటళ్లలో భోజనం చేసేవారు. రైలుస్టేషన్ రోడ్డులో ఉన్న ” వసంతవిహార్ ” హోటలు భోజనసమయంలో కాలేజీవిద్యార్ధులతోను , బ్రహ్మచారి ఉద్యోగస్తులతోను కిటకిటలాడుతుండేది . హోటల్ యజమాని సోదరులు “వాసు, కుమార్” లు అందరితో సరదాగా ఉండేవారు. దీపావళి వస్తే హోటల్ పనివాళ్ళు , కస్టమర్లతో కలిసి చాలాసేపు బాణాసంచా కాల్చేవారు.

ఒకసారి తారాజువ్వలు విరివిగా కాలుస్తూ , ఒక కొంటె విద్యార్థి తారాజువ్వలను ఆకాశంలోకి వదిలేబదులు నిర్మానుష్యముగాఉన్న రోడ్డువారగా వదిలాడు . అది కాస్త గతితప్పి రోడ్డుప్రక్క ఫుట్ పాత్ లో వెళ్తున్న సాధువు వైపు దూసుకెళ్తున్నది . దీనిని తప్పించుకునేందుకు ఆ సాధువు పాములాగా వంకరటింకరగా పరిగెత్తుతుంటే , ఈ తారాజువ్వ కూడా “లక్ష్యనిర్దేశితక్షిపణి (target guided missile )” లాగా అవ్వే వంకర్లుపోతూ నిప్పురవ్వలు వెదజల్లుతూ దూసుకెళ్లి సాధువును తాకింది . అతడు భయంతో కట్టుకున్న పంచె లాగేసుకొని దూరంగా విసిరి పారేసి ఎవ్వరికీ కనిపించకుండా సందులోకి పారిపోయినాడు.

కొంతమంది మధ్యతరగతి విద్యార్థులు రూము అద్దెకుతీసికొని స్వయంగా వండుకు తింటూ చదువుకునేవారు.. నేనుకూడా నా సమవయస్కులైన మేనమామలతో కలసి , మేమంతా నరసరావుపేట ఏంజెల్ టాకీసు వెనుకబజార్లో వారికి ఉన్న ఇంట్లో ఉండి, స్వయంగా వంటచేసుకుంటూ చదువుకునేవారం . బొగ్గులబస్తా వేయించుకొని , కుంపటిపై అన్నం వండుకునేవారం . ఊరి నుండి ఎవ్వరైనా వచ్చినపుడు , లేక మేమే స్వయంగా వెళ్లి తెచ్చిన పచ్చళ్లు ఉండేవి. .మిరపకాయబజ్జీలు అన్నం తో తినేవారం. పరిసరగ్రామాలు నుండి ఉదయాన్నే కొంతమంది పాలు పెరుగు నెత్తిమీద బుట్టలోపెట్టుకుని తెఛ్చి నెలవారీ ఖాతాపై పోసేవారు.

ఉదయం పూట రామిరెడ్డిపేట వైపునుండి , హెడ్డు పోస్టాఫీసు వైపునుండి వచ్చేవారితో కాంటీన్ రోడ్డు , లింగంగుంట్ల కాలనీ వైపునుండి , పొరుగూరి నుండి రైలు దిగి వచ్చేవారితో ప్లేగ్రౌండ్ రోడ్ లు నిండిపోయేవి . అందరూ కాంటీన్ వైపు ద్వారం గుండా, లేడీస్ వెయిటింగ్ రూమ్ ప్రక్కగా కాలేజీలోకి ప్రవేశించేవారు . ఇక పట్టణంలోని ఇతర ప్రాంతాల వారు సత్యనారాయణ టాకీసు వైపునుండి పల్నాడు రోడ్డుమీదుగానూ , రావిపాడు తదితర గ్రామాలనుండి వచ్చేవారు అదే రోడ్డుపై ఎదురుబొదురు గావచ్చి , ప్రధాన సింహద్వారంగుండా కాలేజీలోకి ప్రవేశించేవారు.

దాదాపు అందరు లెక్చరర్లు , కొంతమంది విద్యార్థులు సైకిళ్లపై వచ్చేవారు. స్కూటర్ లేదా కారు సంస్కృతీ అప్పటికి ప్రవేశించలేదు .హెడ్ పోస్టాఫీస్ రోడ్ నుండి ప్రిన్సిపాల్ రంగనాయకులు గారు , నల్లటి సిల్కు గొడుగు వేసుకొని నడిచి వచ్చేవారు . ఎవ్వరూ సైకిలుపై ఆయనను దాటుకొని వెళ్ళేవారుకారు . ఇదే రోడ్డులో ఒక్కొక్కసారి అప్పటి స్థానిక శాసనసభ్యులు శ్రీ దొండేటికృష్ణారెడ్డి గారు నడుచుకుంటూ వెళ్తూ కనిపించేవారు . (వర్తమాన కాలంలో MLA ఒక్కరే రోడ్డుపై నడుస్తూ వెళ్లడం ఊహించగలమా ?)

1975 వ సంవత్సరంలో కాలేజీ రజితోత్సవం (SILVERJUBILEE ) జరిగింది. అప్పటికి రంగనాయకులు గారి స్థానంలో కాలేజీ ప్రిన్సిపాల్ గా విజయవాడ లయోలా కాలేజిలో పనిచేస్తున్న శ్రీ కెవిరమణయ్య గారు వచ్చేశారు . సాహితీ సదస్సులు , నాటకపోటీలు , ఆటలపోటీలు , చర్చా కార్యక్రమాలు .వైజ్ఞానిక ప్రదర్శనలు జరిగాయి . డా.ప్రసాదరాయకులపతి , డా బెజవాడగోపాలరెడ్డి వంటి సాహితీప్రముఖులు , ఆచార్య సంజీవదేవ్ వంటి బొమ్మలచిత్ర కళాకారులు , జిల్లాకలెక్టర్ శ్రీ ఆర్ .కుప్పురావు లాంటి అధికారులు, మండలి కృష్ణారావు , కొత్త రఘురామయ్య లాంటి రాజకీయ ప్రముఖులు పాల్గొని రజితోత్సవాన్ని రంజింపచేశారు.

ఇంటర్మీడియట్, బి కామ్ లు చదవడంవలన.. SSN కాలేజీ తో ఐదు సంవత్సరాల (1971-76) అనుబంధం ఉన్నది . నేను సుమారు 50 సంవత్సరాల పైబడిన సంగతులు గుర్తు చేస్తూ వ్యాసం వ్రాస్తున్నాను . ఇప్పుడు కాలేజీ నైసర్గిక భౌతిక స్వరూపంలో చాలా మార్పులు వచ్చి ఉండవచ్చు.

కంచి మామయ్య

Leave a Reply