Suryaa.co.in

Entertainment

అవి సినీమాలు..ఇవి సినీమాయలు..!

భారీ చిత్రాలు కొన్ని..
అవి కళాఖండాలే..
మామూలు మూవీకి ఇంకొన్ని..
అవీ కళాఖండాలే..
అప్పట్లో వాటిని తియ్యడానికి ఖర్చు లక్షల్లోనే..
నిర్మాణంలో ఆలస్యం జరిగినా డబ్బుల్లేక..
లేదంటే దర్శకుడో..
ఇంకెవరైనా కీలక వ్యక్తి మరణం..
అలాంటి అవాంతరాలు ఎదురైనా గాని చివరకు నిర్మాణం పూర్తి చేసుకుని
విడుదలై రికార్డులు బద్దలు చెయ్యడమే గాక
అపురూప దృశ్యకావ్యాలుగా
నిలిచిపోయిన చిత్రరాజాలు..
ఇంగ్లీషులో..
టెన్ కమాండ్మెంట్స్..బెన్హర్..
మెకన్నాస్ గోల్డ్..!
మన కళ్ళ ముందు టైటానిక్..
హిందీలో..
మొఘలీ అజామ్..
మేరా నామ్ జోకర్..పాకీజా..
షోలే..
ఇక మన తెలుగులోనే..
మాయాబజార్..
లవకుశ..
దానవీరశూరకర్ణ..(ఈ సినిమాని ప్రస్తావించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి)..
శంకరాభరణం..
ఇలా.. ఓ పరంపర..
ఇవి మాత్రమే కాదు ప్రపంచంలోని ఎన్నో భాషల్లో
లెక్కకు మించిన కళాఖండాలు..గొప్పగొప్ప సినిమాలు విడుదలయ్యాయి..
ముఖ్యంగా మలయాళంలో..
బెంగాలీలో అపురూప చిత్రాలు చాలా వచ్చాయి.
నటన..దర్శకత్వం..కధ..
సాంకేతిక విలువల ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని చరిత్రలో ప్రత్యేకమైన చిత్రాలుగా మిగిలిపోయాయి.
అయితే ఈ సినిమాలకు కేవలం హంగు..ఆర్భాటం కోసం అలవిమీరిన ఖర్చు చెయ్యలేదు..కోట్లాది రూపాయలు వ్యయం చేసినట్టు పనికట్టుకుని చెప్పలేదు..జనాల్లో ఉత్సుకత..ఉత్కంఠ పెంచడం కోసం
చిత్రీకరణలో జాప్యం చెయ్యలేదు..అయినా అవి హిట్టయ్యాయి..మామూలుగా కాదు..
సూపర్ డూపర్ గా!
మరి..వీటి వేటికీ లేని ఇంత పబ్లిసిటీ..
తీస్తున్నప్పుడు..
తీసేసిన తర్వాత..మేకింగ్ ఆఫ్..ఆంటూ ఈ తరహా పోకడలు..ఇవి బాలీవుడ్..టాలీవుడ్..
కోలీవుడ్..అని కాకుండా
సినిమా అనే అత్యద్భుత వినోద సాధనాన్ని ఎక్కడికి తీసుకుపోతాయో..!
ఈ ప్రస్తావన అంతా వేటి గురించో..ఎవరి గురించో ఈపాటికి అర్థమైపోయినట్టే
కదా..ఇప్పుడు ఆ సినిమాలు..ఆ పోకడల గురించి మాట్లాడుకునే కన్నా
ముందే ప్రస్తావించుకున్న చారిత్రక చిత్రరాజాలు..
కళాఖండాలను గురించి
చర్చించుకుని కాస్త జనరల్ నాలెడ్జి పెంచుకునే ప్రయత్నం చేద్దాం..!
ముందుగా భారీ స్థాయి సినిమాల చిత్రీకరణకు ప్రసిద్ధి గాంచిన ఇంగ్లీషు సినిమాల గురించి..ఈ సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి
బెన్హర్..టెన్ కమాండ్మెంట్స్..
ఈ రెండూ ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన అపురూప చిత్రాలు..అలాగే సాంకేతికపరంగా ఆకట్టుకున్న మెకన్నాస్ గోల్డ్..టైటానిక్..వీటి గురించి ఎన్నయినా..ఎంతయినా రాయవచ్చు గాని కొన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాను..
ముందుగా
టెన్ కమాండ్మెంట్స్
కేవలం రెండేళ్లలో 13 మిలియన్ డాలర్ల వ్యయంతో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రిలీజ్ లోనే 122.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.2020 విలువల మేర కు లెక్కలు కడితే ఇది 1.17 బిలియన్ డాలర్లకు సమానం.గ్రాఫిక్స్ ఉసే లేని
ఆ రోజుల్లో ఈ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను ఆస్కార్ సొంతం చేసుకుంది.ఈ సినిమాలో నభూతో నభవిష్యత్ అనే రీతిలో సముద్రం చీలిపోయిన సన్నివేశాన్ని చిత్రీకరించారు.
తెరపై చూస్తున్నా కళ్ల
ముందు జరుగుతున్న అద్భుతంలా.. మనమే అక్కడ ఉన్నట్టు అనుభూతించేటంత
వాస్తవికంగా ఉంటుందా సన్నివేశం.ఈ సీన్ చిత్రకరణ కోసం పెద్ద కొలను నిర్మించి 31600 గ్యాలన్ల నీటిని వాడారు.

బెన్హర్…
212 నిమిషాల పాటు సాగే ఈ సినిమాను ఎనిమిది నెలల కంటే తక్కువ వ్యవధిలో నిర్మించారు.
దీని వెనక జరిగిన కృషి అసాధారణం.. ప్రతి రోజూ 12 నుంచి 14 గంటల పాటు నిర్విరామ షూటింగ్..ఇలా వారానికి ఆరు రోజుల పాటు..వంద మంది కాస్ట్యూమ్ డిజైనర్లు..రెండు వందల మంది సెట్ డిజైనర్లు
అహోరాత్రులు పని చేశారు.
ఈ సినిమా షూటింగులో 200 ఒంటెలు..2500 గుర్రాలను వినియోగించారు.
సుమారు పది వేల మంది అదనపు ఆర్టిస్టులు పని చేశారు.ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రథాల పందేనికి జెరూసెలంలోని చారిత్రక 18 ఎకరాల సర్కస్ గ్రౌండ్స్ లో అనూహ్య రీతిలో సెట్టింగులు వేసారు.ఎన్నో ప్రత్యేకతలు కలిగి 1958 మే నెలలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తదుపరి సంవత్సరం జనవరిలోనే పూర్తయి అదే సంవత్సరం నవంబర్ నెలలో విడుదలై ఇప్పటికీ ఒక సంచలన చిత్రంగా నిలిచి ఉంది..ఆ రోజుల్లో మామూలు థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచే అద్భుత అనుభవం..
మెకన్నాస్ గోల్డ్..నిన్న మొన్నటి టైటానిక్ కూడా అంతే..సంవత్సరాల తరబడి షూటింగ్ సాగకుండా పూర్తి చేసుకుని విడుదలై కన్నుల పండుగ చేసాయి..

హిందీలో..
షోలే..
బొంబాయిలోని మినర్వా థియేటర్లో నిర్విరామంగా అయిదేళ్లకు పైగా ప్రదర్శించబడిన ఈ సంచలన చిత్రం అతి పెద్ద
మల్టీస్టారర్లలో ఒకటి.
ముగ్గురు సూపర్ స్టార్లు..అమితాబ్ బచ్చన్..ధర్మేంద్ర..ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు ఠాకూర్ సాబ్ గానే పిలవబడిన సంజీవ్ కుమార్ ఎటువంటి భేషజాలు లేకుండా వారి పాత్రలను అనుసరించి అద్భుతంగా నటించి సినిమా ఆద్యంతం రక్తి కట్టించారు.ముగ్గురితో పాటు అగ్ర కథానాయికలు జయబాధురి,హేమామాలిని
ప్రత్యేక ఆకర్షణ..ఈ సినిమా కోసం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి సిప్పి విలేజ్ గా నామకరణం చేశారు.ఇక ఈ సినిమాకి అత్యంత కీలకం గబ్బర్ సింగ్..అప్పటికి ఒకటో,రెండో సినిమాల్లో ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించినా గుర్తింపు పొందని
అంజాద్ ఖాన్ ని గబ్బర్ పాత్రకి ఎంపిక చేయడమే అనూహ్యమైన ప్లస్ పాయింట్..గబ్బర్ గా అంజాద్ అభినయం ఇప్పటికీ ఒక సంచలనమే..
ఇన్ని సంచలనాలకు వేదికైన ఈ షోలే సినిమాని రెండేళ్లలో పూర్తి చేశారు.ఇందులో అయిదు నిమిషాల నిడివితో సాగే యే దోస్తీ పాట తియ్యడానికి 21 రోజులు..రాధ పాత్రధారి జయబాధురి దీపం వెలిగించే సన్నివేశం పూర్తి చెయ్యడానికి సహజత్వం సరిగ్గా కుదరక 20 రోజులు.. ఎ కె హంగల్ కొడుకు సచిన్(సినిమాలో అహ్మద్) ను గబ్బర్ హతమార్చిన సన్నివేశం చిత్రీకరణకు మరో 19 రోజులు..ట్రైన్ రాబరీ షాట్స్ కు ఏకంగా ఏడు వారాలు..సినిమా 70 ఎం ఎం లో విడుదలైనా గాని అప్పటికి 70 ఎం ఎం కెమెరాలు వాడటం మరీ ఖర్చుతో కూడిన వ్యవహారం గనుక 35 ఎం ఎం కెమెరాలతోనే షూటింగ్ పూర్తి చేసి తర్వాత సాంకేతికంగా 70 ఎం ఎం వర్షన్లోకి మార్చారు.ఈ సినిమా ఎన్నో కోణాల్లో ఇప్పటికీ ఓ మాస్టర్ పీస్..!

ఇక మన తెలుగులో..
తెలుగు సినిమాల్లో అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ చెరిగిపోని ఓ చరిత్ర మాయాబజార్..ఈ సినిమా స్క్రిప్ట్ ఒక పాఠం.. కొందరు దర్శకులకు గుణపాఠం..
సంవత్సరాల తరబడి సాగదీయక షూటింగ్ జరుపుకున్న ఈ కళాఖండంలో చిరస్మరణీయ ఘట్టాలెన్నో ఉన్నాయి.ఈ సినిమా కోసం 12 అంతస్తుల్లో సుమారు 30 సెట్టింగులు వేసారు.400 మంది కార్మికులు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.వివాహ భోజనంబు పాట పాడడానికి మాధవపెద్ది అంతటి గాయకుడు వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు.తమిళ వెర్షన్లో అదే స్థాయిలో పాడేందుకు ప్రయత్నించిన గాయకుడికి దెబ్బకు గొంతు పుండ్లయిపోయింది..అలాంటి సినిమా ఇంతవరకు రాలేదని పేరు గాంచిన మాయాబజార్ లో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఎన్నో అద్భుతాలు చూపించారు.కన్నుల పండువకు అసలైన నిర్వచనం మాయాబజార్.

దానవీరశూరకర్ణ
నందమూరి తారక రామారావు మూడు పాత్రలు పోషించి దర్శకత్వం వహించిన ఈ సినిమా రికార్డు సమయంలో 43 రోజుల్లో పూర్తయింది.ఒక్కో పాత్ర మేకప్పుకే మూడు గంటలకు పైగా తీసుకునేది.సినిమా మొత్తం మీద ఓ పావు గంట ఎన్టీఆర్ లేకుండెనేమో..
అది కూడా ఇదిరా దొర మధిర..బాలకృష్ణ దీప పాట
కలగంటినో స్వామి పాటల
సమయంలో.. అప్పుడూ ఆయన తెరవెనక ఉన్నారు.
ఈ సినిమా నిర్మాణ వ్యయం పది లక్షలు..వసూలు కోటి రూపాయలు..
ఓ హీరో..భారీ తారాగణం..అదిరిపోయే సెట్టింగులు..ఇవేవీ లేకుండా సంచలనం సృష్టించిన శంకరాభరణం నిర్మాణ వ్యయం 13.50 లక్షలు..ఆ సినిమా ఇప్పటికీ ..ఎప్పటికీ ఓ దృశ్యకావ్యమే…!
భారీగా తీసిన కృష్ణ సినిమాలు కురుక్షేత్రం..
సింహాసనం..
ఎన్టీఆర్ కంచుకోట..
నాగేశ్వర రావు ప్రేమనగర్ అనుకున్న ఖర్చుతో నిర్ణీత సమయంలో పూర్తయ్యాయి.
రాజస్ధాన్ ఎడారుల్లో కృష్ణ తీసిన మోసగాళ్ళకు మోసగాడు కూడా హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం చేసుకున్నా సంవత్సరాల తరబడి నిర్మాణం సాగలేదు.
ఈ భారీ సినిమాలకు హీరోలు పెద్ద కాల్షీట్లు
ఇచ్చి ఉండవచ్చు గాని
వీటి నిర్మాణం జరుగుతున్నప్పుడు
కూడా ఇతర సినిమాల్లో యధావిధిగా నటించారు.
సరే..పాత రోజులే అనుకున్నా ఈ సినిమాల షూటింగ్ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారమే లేదు.అసలు సినిమా తీస్తున్నట్టే చాలా మందికి తెలియని రోజులు..
ఇప్పుడు బాహుబలి ద్వయం..ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే సంవత్సరాల తరబడి షూటింగ్..ఇందుకోసం హీరోలు బయట సినిమాల్లో చెయ్యకుండా ఉండడం..భారీ ఖర్చు..ఇట్టే తెలిసిపోయే.. కొండొకచో తేలిపోయే గ్రాఫిక్స్..నిర్మాతలకు
హై రిస్క్..
సరే..సినిమాలో ఏమున్నా..లేకపోయినా..
ఎన్నున్నా..ఏంటున్నా
అంత పెట్టుబడి మంచిదేనా..రాజమౌళి సినిమా స్టామినా సంగతి ఎలా ఉన్నా ఇతరత్రా
మ్యాజిక్కులు చేసి హిట్టు కొట్టగల ట్రిక్కులు..
గిమ్మిక్కులు అతగాడి దగ్గర
చాలా ఉన్నాయి..కాబట్టి రెండు బాహుబలులు..
ఆర్ ఆర్ ఆర్ పెట్టుబడిని మించి సొమ్ములు
రాబట్టుకున్నాయి.అయితే ఈ ఫీటు రాజమౌళికైనా ప్రతిసారి సాధ్యపడుతుందా..
ఇలా ఒకదానిని మించి ఒకదానికి భారీతనం పెంచుకుంటూపోతే.. ఎక్కడో ఒక దగ్గర ఆ ట్రిక్కు బెడిసి కొడితే..అప్పుడు రాజమౌళి పరిస్థితి ఊహిస్తే..బ్లాక్ అండ్ వైట్..ఈస్ట్ మన్ కలర్ రోజులా..తేరుకుని మళ్లీ అంతటి బొమ్మ ఇంకోటి తియ్యడానికి..మరోసారి నిర్మాతలు అతడిని నమ్మి అంత పెట్టుబడి
పెట్టగలుగుతారా..ప్రేక్షకులు నమ్ముతారా..సినిమా ఎలాంటి రంగుల మాయాప్రపంచమో తెలియంది కాదు..
పోనీ జక్కన్న మాట అలా ఉంచి ఒకరో ఇద్దరో దర్శక నిర్మాతలు వాతలు పెట్టుకుని వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీసి
చెయ్యి కాల్చుకుంటే పరిశ్రమ గతేమి కాను..నిర్మాత బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని రామారావు..నాగేశ్వర రావు..కృష్ణ..శోభన్ కాలం నుంచి నమ్ముతూ..ఆచరిస్తూ వచ్చిన సిద్ధాంతం.
నిర్మాతకు ఖర్చు తగ్గించాలని ప్రయత్నించేవారు నాటి హీరోలు..దర్శకులు..ఆమాటకొస్తే అందరూనూ..ఎన్టీఆర్.. ఎయెన్నార్ మాంచి ఊపు మీదున్న రోజుల్లో అయిదువేల రూపాయలు పారితోషికం పెంచాలనుకుంటే ఇద్దరూ కలిసి నిర్మాతలను ఈయన ఆఫీసుకో..ఆయన ఇంటికో టీ కి పిలిచి మొహమాటంగా మనసులోని మాట చెప్పేవారట..ఆ రోజుల్లో ఆ ఇద్దరూ ఎంత అడిగితే అంత ఇచ్చుకోవాల్సిన రోజులు..అయినా నిర్మాతలకు చెప్పి మరీ పెంచిన నిబద్ధత..ఇప్పుడు ఒక్క సినిమా హిట్టుతో
కోట్లలోకి చేరిపోతున్నాయి పారితోషికాలు..
ఒక్క సినిమా ప్లాపుతో
కనుమరుగైపోతున్నారు నిర్మాతలు..ఇప్పటికే నిర్మాతల సంఖ్య తగ్గి కొందరు నిర్మాతలు..దర్శకుల పెత్తనంలోనే..కొన్ని కుటుంబాల అధీనంలోనే నడుస్తోంది చిత్ర పరిశ్రమ..
కొత్త నిర్మాతలు వచ్చినా పెరుగుతున్న నిర్మాణ వ్యయం కారణంగా ఒక్క సినిమా తుస్సుమన్నా చాప చుట్టేస్తున్నారు.ఈ పరిణామాలన్నీ పరిశ్రమకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు..అందరూ ఆలోచించ వలసిన విషయం..!!

కొసమెరుపు…
మాయాబజార్ సినిమా ఒక్కొక్కరు ఎన్నిసార్లు చూసి ఉంటారో అదో పెద్ద లెక్క..నేను ఇరవై సార్లు చూసాను..ముప్పై మార్లు వెళ్ళాను.. ఇలా చెప్పడం ఇప్పటికీ ఒక బడాయి..డైలాగులు చెప్పడం,పాటలు పాడడం ఫ్యాన్స్ కే కాదు ఎవరికైనా
ఓ ఫ్యాన్సీ..
అలాగే గుండమ్మకథ..దేవదాసు..
మూగమనసులు..
దసరాబుల్లోడు..అడవిరాముడు..కర్ణలో ఎన్టీఆర్ డైలాగులు..శంకరాభరణం పాటలు..అదో లోకం..
ఇప్పుడు సినిమా హిట్టు.. బ్లాక్ బస్టర్..ఇలా ఏమనుకున్నా గాని అతి తక్కువ కాలంలోనే మర్చిపోతున్నారు జనం…
అంతెందుకు మొన్నటి వరకు పుష్ప హడావిడి..ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్..రేపు మరొకటి..ఓ వేడి..అంతే..
అవి కళాఖండాలు..
ఇవి కరిగిపోయే కండలు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE