Suryaa.co.in

Entertainment

నటవిన్యాసాల నర్తనశాల!

అరణ్యపర్వాన్ని అనుసరించి విరాటపర్వం..
పాండవవనవాసానికి కొనసాగింపుగా నర్తనశాల..
కమలాకరుని చిత్రమాల!

ఎవరి గురించి చెప్పాలి..
సరే..క్రెడిట్ కామేశ్వరుడిదే..
మరి నటుల్లో..
సలలిత రాగసుధారస సారం
సర్వకళాన్వయ
నాట్యవిలాసం..
అప్పటివరకు
మహావీరుల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్..
అటూఇటూ కాని
బృహన్నల గా
సమ్మోహన రూపంతో
నృత్యం నేర్చి మరీ
విజయలక్ష్మితో సమంగా
అసమాన్య విన్యాసం..!

అప్పటికే వనవాస కష్టాలు..
ఆపై సైరంధ్రిగా అజ్ఞాతవాసం..
రోకటిపోటులా
కీచకుడి కాటు..
ఇన్ని కష్టాల అభినయపరాకాష్ట
జననీ శివకామినీ..
సావిత్రి గజగామిని..!

విరాటపర్వానికి మూలవిరాట్టు
అభినయసమ్రాట్టు…
దేశాధినేతనే మెప్పించిన
వీరవిహారం..
ఆ అభినయం..
ఆ స్వాతిశయం..
ఎస్వీఆర్ నట విశ్వరూపం..
ఆయన అభినయమే
ఓ విశ్వవిద్యాలయం…
సైరంధ్రిని గాంచి ఉన్నత్తుడైన
మదోన్మత్తుడిగా
రంగారావు యాక్షన్..
అద్భుతమైన ఆయన డిక్షన్..
అసలు ఆ భీకరరూపం..
సినిమా నటనలో
ఆయన పీజీ..
ప్రపంచ సినిమా చరిత్రలోనే
ఆయన ఘనత
మొదటి పేజీ!

ప్రతి సన్నివేశంలో కోలాహలం..
మహానటుల సమ్మేళం..
గంభీరమైన ఎస్వీఆర్ గళం..
నందమూరి ఆడమేళం..
ఉత్తరతో తకధిమి తాళం…
మధ్యలో అభిమన్యుడి గందరగోళం..
విరాటుడి పక్కతాళం…
ఉత్తరకుమారుడి
ప్రగల్భాల హిందోళం..
కీచక వధతో
ఇటు దక్షిణ గోగ్రహణం
అటు ఉత్తర గోగ్రహణం..
ఫల్గుణుడికి వీడిన గ్రహణం..
చివరగా ఉత్తరతో
అభిమన్యుడి కరగ్రహణం!

సుసర్ల వారి సంగీతం..
ఘంటసాల..సుశీల..జానకి
మాధవపెద్ది..
బాలమురళి
స్వరవిన్యాసాలు..
కాంతారావు,ముక్కామల..
మిక్కిలినేని..శోభన్..
రేలంగి..ధూళిపాళ..
రాజనాల..కైకాల..
సూర్యకాంతం..
సంధ్య..లక్ష్మీరాజ్యం..
మించి దండమూడి కండలు..
ఎల్ విజయలక్ష్మి
నవ్వుల కలకండలు..
నిండిన రాజ్యం పిక్చర్స్
డబ్బుల కుండలు!

“*********”
నర్తనశాలకు అరవై..
11.10.1963..
✍️✍️✍️✍️✍️✍️✍️
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE