బుడుగు వ్యంగ్యట ఋమణ

రెండైన తెలుగు లోగిళ్లలో ‘ముత్యాలముగ్గు’ వేసి ,’ గోరంత దీపం’ పెట్టాము, ‘రాజాధిరాజు’ లాగా తరలి రావయ్యా! రమణయ్యా !! మీకివే మా ‘మేలుపలుకుల మేలుకొలుపులు’ ఓ !వెంకట రమణా !!
దివి నుంచి భువికి మీ అభిమానుల ‘సాక్షి’గా దిగిరా .’ఇద్దరు మిత్రులు’ కలిసివస్తే మాకింకా సంతోషం సుమండీ. మీరు లేని ఈ పదేళ్లలో ‘బుడుగు’ బాగా ఉచితాల కోసం వెంపర్లాడే ఓటరులా అల్లరి చిల్లరగా ,పనీ పాట లేకుండా తిరుగుతున్నాడు . మీ కోసం బెంగ పెట్టుకున్నాడో ఏమో కరువు లో రైతు లాగా బక్కచిక్కి పోయాడు. తొంభై యేళ్ల కుర్రాడిగా వచ్చి మీ హాస్యాన్ని ఊతకర్రగా వాడుతున్న తెలుగు’వాడి’ని చూసి గర్వపడతారో ,నవ్వుతారో మీ ఇష్టం . మీరు ఎగరేసిన మానవత్వం అనే జెండా పైన మీ తెలుగు అక్షరాలు ఒక హాస్యంగానో, ఒక వ్యంగ్యంగానో ,ఒక పేరడీగానో మార్పుకోసం నిరంతరం శ్రమిస్తూనే వున్నాయి.

పదాల విరుపు ,సెటైర్ చరుపు ,పేరడీల ఒరవడి ,ఉపమానాల జీడిపప్పు ఉప్మా,అందులోకి చమత్కారప్పొడి. ఇలా భిన్న రుచుల సమాహారం ముళ్ళపూడి వేడి, వాడి రచనల మెనూ. ‘రమణ కేవలం హాస్య రచయిత అన్నది అబద్ధం ‘ఎందుకంటే వారి కథల్లో ఒక్క హాస్యాన్నే కాదు ఎన్నో కోణాలున్న జీవితాలను రమణీయమైన కథలుగా మలిచి మనకు అందించారు. వారి అభిమాన విషయము లైన ప్రేమ ,సినిమా ,రాజకీయం జొప్పించిన రాతలు రమణీయం.

శ్రీశ్రీ కష్టజీవికి అటూఇటూ నిలిస్తే , రమణ మధ్య ‘మ ‘అక్షరం దన్నుగా మధ్యతరగతి మనుషుల మనసులకు దగ్గరయ్యాడు .యువ రచయితలకు దిక్సూచిగా ,కథా నావికుడిగా కనిపిస్తారు ఈ బుడుగు వెంకటరమణ.బడి పిల్లల కోసం వీడియో పాఠాలు తీసి ‘బాలబంధు’ బిరుదాంకితుడు అయ్యారు చిరంజీవి బుడుగు నాన్న .

సాహిత్య కవలలుగా ప్రసిద్ధి పొందిన బాపు రమణ పేర్లు విడివిడిగా రాయలేము విడిగా చూడలేము . రమణ రచనలన్నీ బాపు బొమ్మల కొలువులే. రమణ సృష్టించిన పాత్ర లన్నిటి లోనూ బుడుగు, సీగానపెసూనాంబ, అప్పారావు, రెండు జెళ్ళ సీత ,రాధాగోపాళం తెలుగిళ్ళల్లో సుపరిచితమైన పాత్రలు . రమణ పదాల విరుపు ,బాపు బొమ్మల పెదాల విరుపు వ్యంగ్యాన్ని పండించాయి. తెలుగు మాగాణిలో వినూత్న పదాలను నాటిన భూస్వామి ముళ్ళపూడి. తెలుగు అక్షరాల తోటలో పదబంధాలు, జాతీయాలు, నానుడుల కొత్త హైబ్రీడ్ వంగడాలు సృష్టించిన తెలుగు తోటమాలి రమణుడు.

పద క్రీడా విన్యాసం ముళ్ళపూడి రచనలకు పెట్టని ఆభరణం. ఋణ రమణీయంలో అప్పారావు ‘హలో కులాసా ‘అంటే చాలు నవ్వులు కూడా ఋణగ్రస్థమవుతాయి. ఋణానందలహరిలో ఋణదత్తులవారిని సృష్టించి సృష్టిలో అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ నవ్వుతుండాలి అని సందేశమిచ్చారు ఋమణ మహర్షి. మన కళ్ళముందు నడయాడిన అసమాన అద్వితీయ ప్రతిభా మూర్తి ముళ్ళపూడి. వరించి వచ్చిన పురస్కారాలు రఘుపతి వెంకయ్య అవార్డు మరియు రాజాలక్ష్మి అవార్డు వారి అత్యుత్తమ ప్రతిభకు తార్కాణాలు.

ఘటనాఘటన సమర్ధుడు ముళ్ళపూడి వెంకట రమణ జీవితంలోని ఘటనల సమాహారమే ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’. ప్రతి తెలుగు వారి ఇంట ఉండవలసిన ఒక ముత్యాలముగ్గు, ఒక గోరంత దీపం, లాంటిది. జీవన పోరాటాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలని ఉద్భోదించు సజీవ గీతా సారం కోతికొమ్మచ్చి. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని దట్టించిన వ్యక్తిత్వ వికాస చిచ్చుబుడ్డి కోతికొమ్మచ్చి . అది అక్షర మాధుర్యాన్ని సదా లావాలా వెదజల్లే చమత్కార సిరాబుడ్డి .సినీ ‘ముళ్ళ పోడియం’ ని ముళ్లపూడియంగా మార్చుకోవడమే కోతికొమ్మచ్చి .

ముళ్ళపూడి కరోనా టైం లో ఉండి ఉంటే కరోనాను వ్యంగ్య బాణాలతో కట్టడిచేసి, బాపుతో కలిసి గీసిన గీతని కరోనా దాటకుండా చేసి ప్రపంచ ప్రజల ఋణం తీర్చుకొని, కోతికొమ్మచ్చిలో ఇంకో అధ్యాయం ‘ఋణ రోగానందలహరి ‘అని చేర్చి ఉండేవారు. గతాన్ని మరిచిపోతే చరిత్రహీనులవుతాము . అలాగే గతంలో మనకు ఆరాధ్యులైన మహానీయులు ఎందరో ఉంటారు . వారిని మరిచిపోతే జాతి క్షమించదు. భావితరాలకు వారిని అందించకపోతే భావి భారత సమాజం కూడా హర్షించదు. తెలుగోడి గుండెగోడలపై ముళ్ళపూడి వారి చెరగని సంతకం భావితరాలకు కనిపించేలా చెయ్యాలి.

ఇది నిజం, రమణ గారి రచనలు రచయితలకు ముడి ఖనిజం. విశ్వవిద్యాలయాలలో పరిశోధనా గ్రంథాలకు కూడా . తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత . హాస్యం, పేరడీ, వ్యంగ్యం, రచనా శైలి ఇలా ఎన్నో ముడి ఖనిజాల గని వారి మది . వారి సిరా ఇంకుడు గుంత ఇంకి పోకుండా చూడటం మన సామాజిక బాధ్యతగా గుర్తెరిగి వారిని సదా స్మరించడం . వారి సాహిత్య నిధిని గుప్త నిధిగా కాకుండా సాహితీ ప్రియులు తవ్వుకునేలా ప్రోత్సహించడం తద్వారా వారి సాహిత్య ప్రతిభ ఇనుమడించి సామాజిక స్పృహ చైతన్యం పరిఢవిల్లి రమణ గారి ఆశయం నెరవేరేలా చెయ్యాలి .అదే మనం తెలుగు వారిగా ముళ్ళపూడి వెంకట రమణకు ఇవ్వగలిగిన ఘన నివాళి .

కళారత్న డాక్టర్ రమణ యశస్వి
బాపు-రమణ – బాలు కళా పీఠం అధ్యక్షుడు
గుంటూరు 9848078807

Leave a Reply