Suryaa.co.in

Entertainment

మోహన్ బాబు ఉర్దూ సంభాషణ

సరదాగా చదువుకొండి

విలక్షణ నటుడు మోహన్ బాబు. రాజకీయనేతగాను తనను నిరూపించుకున్న వ్యక్తి. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మాట ఎంత కరకో మనసు అంత మెత్తన. ముక్కున కోపం ఉంటుంది. అంతకు మించిన మంచితనం ఆయనలో ఉంది. కోపం వల్ల ఆయన చాలా కోల్పోయారు. ఇదే విషయాన్ని ఆయన నాతో చాలా సార్లు చెప్పారు. మోహన్ బాబుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉండేది.

ఎక్కడ కలిసిన చక్కగా మాట్లాడేవారు. ఎంతో గౌరవించేవారు. ఈ క్రమంలో ఒకరోజు మధ్యాహ్నం ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను హైదరాబాద్ పాతబస్తీ నుంచి మాట్లాడుతున్నానని, ఒక ముస్లిం పేరును చెప్పారు. సంభాషణ అంతా ఉర్దూలోనే కొనసాగింది. చక్కగానే మాట్లాడారు. ఉర్దూలో ఒక సామెత చెప్పారు. అందులో చివర్లో “భగవాన్ క్యా కరేగా” అనే పదాలు దొర్లాయి. మాట్లాడుతున్నది మోహన్ బాబు అనే విషయం నాకు మొదటే అర్థమైంది. ఎందుకంటే ఆయన గొంతు ప్రత్యేకమైనది. వందమందిలో ఉన్న గుర్తుపట్టగలిగిన ప్రత్యేకత ఆయన కంఠానిది. అయితే ఆయన ఉత్సాహం చూసి, నేను తొందరపడి మీరు మోహన్ బాబు కదా అనలేదు. చివర్లో ఆయనే సంభాషణను తెలుగులోకి తెచ్చారు. ఎలా ఉంది నా ఉర్దూ సంభాషణ అని అడిగారు. మీరు అంతా బాగానే మాట్లాడి, సామెత చివర్లో “భగవాన్ క్యా కరేగా” అన్నారు. ముస్లిం వ్యక్తీ అయితే “అల్లా క్యా కరేగా” అనేవాడు. కానీ మీరు అలా అనలేదు. అని నేను చెబితే, అవును కదా అని నాలుక కరుచుకున్నారు. మోహన్ బాబు మాటల మనిషి కాదు. చేతల మనిషి.

నేను మా అబ్బాయికి ఎంబీఏ సీటు కోసం తిరుపతి లోని ఆయన కాలేజీకి వెళ్తే “నాకు డొనేషన్లు ఏవి అవసరం లేదు. కేవలం యూనివర్సిటీ ఫీజు కడితే చాలని” అన్నారు. కానీ నేనే పరిస్థితుల కారణంగా అక్కడ చేర్చలేకపోయాను. మోహన్ బాబు కు భగీరథ అనే ఒక సినిమా పిఆర్ఓ ఉండేవారు. మోహన్ బాబు, నన్ను చాలా సార్లు ఇంటికి పిలుస్తున్నారని చెప్పేవారు. నాకు ఆయనతో పనేమీ ఉంది. సినిమాలప్పుడు ఎటు కలుస్తున్నాం కదా అనేవాడిని. కొన్నాళ్లకు ఆ స్థానంలోకి బాబురావు పీఆర్వోగా చేరారు. ఆయన అసలు విషయం బయటపెట్టారు. మీకు మోహన్ బాబు ఒక బహుమానం ఇవ్వాలని భావిస్తున్నారు. అటువంటివి ఫయాజ్ గారు ఇష్టపడరని ఆయనకు చెప్పానని అన్నారు.

అప్పటి నుంచి మోహన్ బాబు తో స్నేహం బలపడింది. మోహన్ బాబు గారి సొంత చిత్రం, సౌందర్య గారి చివరి చిత్రం షూటింగ్ చూడటానికి నన్ను పిలిచారు. ఆ షూటింగ్ కు వెళితే, బెడ్ రూమ్ లో షూట్ చేస్తున్నారు. సౌందర్య గారు సిగ్గు పడుతున్నారు. దాంతో నేనే బయటకు వచ్చి కూర్చున్నాను. మోహన్ బాబు గారి షూటింగ్ అన్ని షూటింగ్ ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలో పనిచేసే లాగా అందరూ యూనిఫామ్ ధరించి, ఉదయాన్నే చెప్పిన సమయానికి వస్తారు. సినిమా పరిశ్రమలో అట్లాంటిది ఎక్కడ చూడలేము. దట్ ఇస్ మోహన్ బాబు.
నేను నెల్లూరు వచ్చాక టి. సుబ్బురామిరెడ్డి గారి ఎన్నికల ప్రచార సభకు ఆయన వచ్చారు. గుర్తుపట్టి పలకరించారు. ఆయన నన్ను మర్చిపోలేదనే సంతోషం మిగిలింది.

– ఫయాజ్,
సీనియర్ జర్నలిస్టు, నెల్లూరు. 8886833033

LEAVE A RESPONSE