Suryaa.co.in

Entertainment

ముచ్చటైన జంట.. రేలంగి – గిరిజ

తెలుగు వెండితెరపై నవ్వులు పూయించిన హాస్య జంటల్లో రేలంగి గిరిజ లది అగ్రస్థానం. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కామెడీ పెయిర్ గా దశాబ్దకాలం పాటు ఓ వెలుగు వెలిగారు. హీరో హీరోయిన్లు ఎవరైనా ఈ హాస్య జంట ఉండాల్సిందే అని ప్రేక్షకులు భావించేవారు. అనేక చిత్రాల్లో.. ఎక్కువగా సాంఘిక చిత్రాల్లో.. వీరి హాస్యం ఆ యా చిత్రాల విజయాలకి బాగా దోహదపడింది.

రేలంగి గిరిజల కోసమే మరోసారి సినిమా చూసే ప్రేక్షకులు ఉండేవారు. అప్పుచేసి పప్పు కూడు, ఆరాధన, రాముడు భీముడు వంటి అనేక సినిమాల విజయాల్లో వీరి హాస్యం ప్రధాన పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. కొన్ని సినిమాల్లో ఈ జంటకి రెండేసి పాటలు కూడా పెట్టేవారు. అవి కూడా బాగా ప్రజాదరణ పొందేవి. మంచి కామెడీ సెన్స్ టైమింగ్ ఉన్న హాస్య నటద్వయం రేలంగి గిరిజ. హీరో హీరోయిన్ లతో సమాంతర పాత్రలు కూడా వేశారు.

కులదైవం సినిమాలో విధవరాలైన గిరిజకి సవతికొడుకుగా రేలంగి నటించడం ఓ విశేషం. రేలంగి హీరోగా నటించిన సినిమా ఒక్కటే. అందులో హీరోయిన్ సావిత్రి కావడం ఓ విశేషం. గిరిజ మాత్రం ఏయన్నార్, ఎన్టీఆర్, జగ్గయ్య, కాంతారావు వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. కొన్నింటిలో వ్యాంప్ రోల్స్ కూడా వేసింది గిరిజ. సినీ స్వర్ణయుగాన్ని మరింత కాంతివంతం చేసిన హాస్య జంట రేలంగిరిజ. యీ ఇద్దరూ కూడా పెద్ద వయసు కాకుండానే శాశ్వతంగా దూరం కావడం చాలా బాధాకరం.

– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
ధర్మపురి రోడ్ విజయనగరం,
ఫోన్ 99855 61852

LEAVE A RESPONSE