Suryaa.co.in

Entertainment Telangana

కేటీఆర్ కు పవర్ స్టార్ కృతజ్ఞతలు

“కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

ఆ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాత్రి జరిగిన భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ వేడుకకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో బిల్‌ గేట్స్‌ తో కీలకమైన వర్చువల్‌ మీట్‌ కు సన్నద్థమవుతూ బిజీగా ఉన్నా సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్‌ ప్రి రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ గారు ప్రతి ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూశాం. అటువంటి ఆత్మీయత కె.టి.ఆర్‌. గారిలో ప్రస్పుటంగా కనిపిస్తుంది.

సృజనాత్మకత, సాంకేతికత, మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్థికి ఆలోచనలను కె.టి.ఆర్‌. గారు చిత్తశుద్థితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అని ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE