ఐన పనులకైతే ఏమో గాని
కాని పనులకు అమ్మ తమ్ముణ్ణి
మేనమామని నేనున్నానుగా..
ఈ డైలాగ్ ఆనాటి
మహాభారతంలో శకుని
చెప్పి ఉంటాడో లేదో
నీ అంత కర్కశంగా..
ఇంత క్రూరంగా..?
చిత్రంగా ఒక కనుబొమ్మ
పైకి లేపి
టాపు లేపేసావు
కదయ్యా దానవీరశూరకర్ణని..
నువ్వేగా కలియుగ
శకుని మామవని..
నాడు మేనల్లునికి జరిగిన పరాభవానికి మామ ప్రతీకారం తీర్చుకున్న విధమిదా
హుర్రే హుర్రే..
అని జగమెల్ల
కొనియాడలేదా
నీ అభినయాన్ని…
పెంచుకోలేదా
నీపై అభిమానాన్ని..
ఒకనాడు సీఎస్సార్..
మర్నాడు లింగమూర్తి
దాటి వెలిగిపోయింది నీ కీర్తి
నూరు మెతుకులు మౌనంగా ఆరగించి లాగించావు శ్రీకృష్ణపాండవీయాన్ని
నూరు రోజులు..
అసలు నాటకరంగాన
నువ్వేగా మానధనుడివి..
ఎగారేసావటగా కీర్తి బావుటాని
మట్టిలో మాణిక్యంలో
పూజ దగ్గర వెలిగించిన హారతిని మధ్యలో ఆర్పేసి ఆవిష్కరించావు
పిసనారి మల్లన్నని..
భానుమతమ్మ తిడితే
ఏడ్చావు గొల్లుగొల్లుమని..
ఉండమ్మా బొట్టు పెడతా సినిమా మొత్తం
ఒక ఎత్తు..
రావమ్మా మహాలక్ష్మి అంటూ
నువ్వు కట్టిన వేషం
ఓ మత్తు
నువ్వు వంగుని బియ్యం తీసుకున్న వైనం చూపింది
నీ నటనలోని గమ్మత్తు
ఆ సినిమా హిట్టుకి
కారణం ఆ పాటలోని మహత్తు..
నీకు కృష్ణార్పణం..
నిర్మాతకు కలెక్షన్ల అర్పణం..
జమీందారు సూటు
గుమాస్తా కోటు
జానపదమైతే నువ్వే రాజు
అప్పుడప్పుడు గుమ్మడి వంటి
మెతక రాజులకు కంత్రీ మంత్రి
పౌరాణికమైతే రారాజు
పాత్ర ఏదైనా అభినయంలో నువ్వు నటరాజు..!
హీరో ఎన్టీఆరైనా,
నాగేశ్వరరావైనా..
ఎస్వీఆర్,గుమ్మడి,రేలంగి,
రమణారెడ్డి కంపల్సరీ
ధూళిపాళ ఉంటే
అదో లగ్జరీ..
కంచుకోటలో క్రూరత్వం
నిండిన మంత్రి..
నీ కూతురిగా
అభినేత్రి సావిత్రి
పతాక సన్నివేశంలో
మీ నటన
సినీ చరిత్రలో
ఓ అపూర్వ ఘటన..
విలనిజానికి నిర్వచనం ధూళిపాళ..
వానప్రస్థంలో ప్రవచనానికి
మరో రూపం సీతారామశాస్త్రి..
నటనలో ఎంత క్రౌర్యమో
మనిషిగా అంత ఔదార్యం..
నేటి బెజ్జలదేవులు,
భల్లాలదేవులు
నీ ముందు ఎండమావులు
నీ అభినయాలు ఎన్నో తరాలకు ఓనమాలు..
నీ ఉనికితోనే తరించాయి
చాలా సినిమాలు..
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286