Suryaa.co.in

Entertainment

“కెజి”లకొద్ది హీరోయిజం!

నేటి సినిమాలో హీరో..
భారతంలో అర్జనున్ని మించిన చతురుడు..
భీముడి కంటే బలవంతుడు..
భీష్మునికి సైతం లేనంతటి సమయస్ఫూర్తి..
చాణక్యుని దాటిపోయే రాజనీతి..
టైసన్..మహ్మద్ ఆలీ..
దారాసింగ్..కింగ్ కాంగ్..
నిన్నమొన్నటి ప్రపంచ హీరో
బ్రూస్లీ..అందర్నీ మించిన మొనగాడు..

ఇన్ని ఉన్నా రాముని లాంటి సద్వర్తన ఉండదు..
విలనే హీరో..
గుండానే నాయకుడు..
స్మగ్లర్లే ఆదర్శప్రాయుులు..
నిన్న పుష్పలో గంధం చెక్కల స్మగ్లర్ హీరోగా జేజేలు అందుకుంటే..ఇప్పుడు బంగారం స్మగ్లర్ కెజిఎఫ్ పేరిట దేశాన్ని శాసిస్తూ..
ప్రధానినే ఎదిరిస్తూ..
వేల మందిని ఒంటి చేత్తో
అడ్డుకుంటూ.. కొట్టేస్తూ…నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ హీరోగా వెలిగిపోతుంటాడు..మనం ప్రశ్నించకుండా ఉండేందుకు దర్శకుడు తెలివిగా అతడిని కొందరి దృష్టిలో దేవుడుగా నిలబెట్టి కథని నడిపించాడు.
పైగా అమ్మ సెంటిమెంటు..
ఓ లవ్ స్టోరీ..తల్లి కాబోతున్న నాయికను ప్రత్యర్థులు చంపేసే ఎన్నో సినిమాల హృదయ విదారక సన్నివేశం.. కథని మాటలతో ముందుకు నడిపే ప్రకాష్ రాజ్..అతనికి తోడుగా జర్నలిస్టు బృందం..
ఎప్పుడు వర్తమానమో..ఏది గతమో..అవగతం కాని కన్ఫ్యూజన్..అదే నేటి సీజన్.. వాటినే నచ్చుతున్నట్టున్నాడు ఆధునిక సిటిజన్..మెచ్చుతున్నట్టన్నాడు నెటిజన్..!

సినిమా కథ ఎటూ చీకటి సామ్రాజ్యం చుట్టూనే తిరుగుతుంది..దానికి తగ్గట్టు చాలా వరకు దృశ్యాలన్నీ చీకటే.. ఎవడు హీరో మనిషో..ఎవడు విలన్ల తరపో..మనకి ఎటూ అర్థం కాదు..హీరోకి..విలన్లకు ఎలా తెలుస్తుందో మరి..దొమ్మీలో ఎవడు ఎవన్ని ఎందుకు కొడుతున్నాడో..చంపేస్తున్నాడో తెలియని గందరగోళం..!
ఇప్పటికే మన సినిమాల్లో హీరోలు అసాధారణ శక్తిసంపన్నులు..
ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ మరీనూ..
తన హీరోకి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ భాషలోనూ ఏ హీరోకి ఉండని హైప్ ఇచ్చేసి..అతడిని ప్రతి ఫ్రేములోనూ ఒక కొత్త సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు.అసలు ఈ హీరోకి చావే ఉండదా అనే స్ధాయిలో ఉంటుంది ఈ సినిమాలో నాయకుడు రాఖీ లెవెల్..చివరకు అతగాడు బంగారంతో సహా సముద్రంలో మునిగిపోయినప్పుడు…
ఓహ్..ఇక రాఖీ కథ ముగిసినట్టే అనుకునే లోగా పుస్తకంలో మరో కాగితం నెమ్మదిగా కేజీఎఫ్ మూడో చాప్టర్ ఆంటూ జరిపి మరో సీరీస్ కు తెర ఎత్తి ఉంచాడు దర్శకుడు..ముందస్తు చర్యగా..!
యష్..ఇప్పుడు నాకు తెలిసినంతలో…బ్రూస్లీ..గ్రెగరీ పెక్..సీన్ కానరీ..రోజర్ మూర్.. క్లింట్ ఈస్ట్ ఉడ్..ధర్మేంద్ర..అమితాబ్..మిథున్ చక్రవర్తి..సల్మాన్ ఖాన్..మమ్ముట్టి,మోహన్ లాల్..సురేష్ గోపి…రజనీ కాంత్..కమల్ హాసన్..అజిత్..విజయ్..మన ఎన్టీఆర్..కృష్ణ..అందర్నీ మించిన వీరుడు..ఆర్ ఆర్ ఆర్ ఇద్దరు హీరోలను కలిపినా ఒక రాఖీకి సరిపడినంత శూరుడు.. దీవార్ విజయ్…పుష్పరాజ్..ఇలాంటి స్మగ్లర్ దేవుళ్ళ కంటే గొప్పోడు..అంతెందుకు రియల్ స్మగ్లర్లు హాజీ మస్తాన్..వీరప్పన్లను మించిన మొనగాడు..ప్రపంచ సినిమాలో ఇప్పటివరకు చూడనంత భయంకరమైన హీరోయిజం గలిగిన ఏక్ థా టైగర్..మళ్లీ ఏదో ఒక రోజు టైగర్ జిందా హై అంటూ తిరిగి వచ్చి మరిన్ని వీరోచిత పోరాటాలు జరిపి ఇంకా ఇంకా హీరోయిజం(?) చూపి మరిన్ని కోట్లు కొల్లగొట్టి పోతాడు..అది పక్కా!

తాను స్వయంగా రాఖీ అనే పేరుతో …అదే సినిమా టైటిల్ గా అప్పుడెప్పుడో ఇదే యశ్ పుట్టకముందే తెరంగేట్రం చేసిన సంజయ్ దత్ పాపం ఈ సినిమాలో అంత బ్రతుకూ బతికి ఇంటెనకాల..మాదిరి అయ్యాడు..!ప్రకాష్ రాజ్..రావు రమేష్ మరీ వంధిమా’గది’ పాత్రలకు పరిమితమైపోయారు..
ఇక ఇందిరా గాంధీ గనక బ్రతికి ఉండి ఉంటే..!???

సురేష్ కుమార్ E
9948546286

LEAVE A RESPONSE