పుణ్యం కొద్దీ పునీతుడు..!

మనిషికి ఉంటుందేమో మరణం..
మంచికి ఉంటుందా..!

నటుడికి ఉంటుంది
మరణం,..
కళకు ఉంటుందా..!

ఊపిరి ఆగితే మరణం..
అదే ఊపిరి
లక్షలాది అభిమానుల
గుండెల్లో నిలిస్తే
ఆ వ్యక్తికి
ఇంకెక్కది మరణం..!?

సేవకు తానే అర్థమై..
ఆ సేవలోనే పునీతమై..
ప్రతి గుండెలో…
శాశ్వతంగా కొలువై
ఉండే మనిషి
మరణించినా చిరంజీవే!

పునీత్ రాజ్..
కన్నడ నటుడే..
కాని ఆయన లేడన్న
ఓ కబురు..
దేశానికే గుబులు..
నాన్న రాజ్ కుమార్ లోని గుణాలకు
తన గణాలను చేర్చి
తండ్రిని మించిన తనయుడై..
ఇంటింటి ముద్దుల బిడ్డడై..
పుట్టిన గడ్డ దాటి జాతి మొత్తాన్ని కలవరపరుస్తూ
అనంత కీర్తి శిఖరాలకు
ఇదే రోజున
పయనమైన పునీతుడు..
కోట్ల కంటిపాపల్లో సజీవుడు..
మొత్తంగా ధన్యజీవుడు..
ఇంటింటి దేవుడు..!

పోయినోళ్ళు అందరూ
మంచోళ్లే..
కొందరే ఉన్నప్పుడు కూడా
మంచోళ్లు..
పునీత్.. ఈ పేరెత్తితే
వేనోళ్ళ అదే మాట
మంచి మారాజ్ అని..
చచ్చినోడి కళ్ళు చారడేసి..
ఆ కళ్ళను చావుకు ముందే దానం చేసిన శిబి..
ఉన్నంతకాలం మోగించాడు
కన్నడ సీమలో విజయదుందుభి..!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే
లోకులున్న కాలంలో..
జనాలున్న లోకంలో..
తన దీపం ముందుగానే ఆరిపోతుందని
గ్రహించాడో ఏమో
వేల ఇళ్ళు చక్కబెట్టి
ఆ ఇళ్లలో ఈ రోజున
తన బొమ్మ ముందు
దీపం వెలిగించేలా
బ్రతికిన ఈ బొమ్మలరేడు..
మనిషిగా తిరిగిరాడు..
మనసులోంచి
పొమ్మన్నా పోడు!

అసంఖ్యాక అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి గత ఏడాది ఇదే రోజున తిరిగిరాని లోకాలకు పయనమైన పునీత్ రాజ్.. నీకు జోహార్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply