ఇద్దరూ స్వయంకృషి తో వచ్చినోళ్ళే..
ఇద్దరూ తెలుగు మట్టి బొమ్మలే..
ఇద్దరూ వారాల బిక్షువులే ..
ఇద్దరి జీవితం సినీమాతోనే
ఇద్దరి జీతం సినీ గీతమే..
ఇద్దరికీ పద్మ అవార్డులు..
ఇద్దరి అర్ధాంగులూ సావిత్రులే..
ఇద్దరి చివరి మజిలీ చెన్న పట్నమే!
వాళ్ళని పరిచయం చేసింది పాట!
వారి బ్రతుకు పాట
వారి మాట పాట
వారి నడక పాట
వారి నడత పాట
వారి వశం పాట
వారి పాశం పాట
వారి ఊపిరి పాట
వారి గమనం పాట
వారి మననం పాట
వారి ఆహారం పాట
వారి ఆహార్యం పాట
వారి అర్ధం పాట
వారి పరమార్ధం పాట
వారి సామ్రాజ్యం పాట
వారి సాయుజ్యం పాట
వాళ్ళని రగిల్చింది పాటే
వాళ్ళని మిగిల్చింది పాటే –
పాట గదరా శివా !
తెలుగు సినీ గీతానికి ఘంటసాల పల్లవి అయితే, ఎస్.పీ.చరణం కదా!
తెలుగు సినీ భాగవతంలో ఘంటసాల రాముడైతే, బాలూ కృష్ణుడు!
వారిద్దరి మధ్య మాటా మంతీ సాగితే ఎలా ఉంటుంది? ఇలా
ఉంటుందనుకుంటే ఎలా ఉంటుందో మరి!!
దానికి తెర తీస్తే ….
ఘ: రావయ్యా అప్పదాసూ…. ఎవరో అనుకోని అతిథి వస్తున్నాడన్నారు. ఎవరా అనుకుంటుంటే నీ అకాల ఆగమనం. అప్పుడే నీకు పాటలు చెల్లి పోయాయంటే బాధన్పిస్తుందయ్యా! రా కూర్చో! (క్రింద కూర్చోబోతుంటే) ఇక్కడ … ఈ సీటు నీది.
బాలు: మీతో సమానంగానా… ఇక్కడే బాగుంటుంది గురువు గారూ.. (క్రింద కూర్చుంటూ)
అయితే నేనూ క్రింద కూర్చోవాల్సొస్తుంది. నన్ను కష్ట పెట్టకయ్యా!
అయ్యో ఎంత మాట! నేనే అక్కడ కూర్చుంటాను లేండీ.
తెలుగు వాళ్ళే మనిద్దరికీ వాళ్ళ హృదయాన్ని సగం సగం పంచేశాక, నువ్వు సమానం కాదంటే ఒప్పుకుంటానా?
మాష్టారూ, తెలుగోడి హృదయం చాలా విశాలమైంది. మనవేమన్నా మామూలు శరీరాలా? అయినా ఇద్దర్నీ పట్టించేశాడు ఆ గుప్పెడంత జాగాలో. మీ కంటే ఎక్కువ జాగా నేనే ఆక్రమించుకున్నానేమో భారీకాయం వల్ల!
సహజమే సుమా! మరి యాభై ఏళ్లు పైన సుస్తిర పానం ఏది
వాళ్ళ గుండెల్లో. బాలా…. ముందుగా నీతో నే చెప్పుకోవాల్సిందేంటంటే నేను నీకు ఋణపడి ఉన్నానయ్యా, అంత పట్టుబట్టి నా విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించిన దానికీ, పాడుతా తీయగా లో నా ఫోటోని పెట్టి ఆపాటలన్నీ నాకు వినిపించినందుకూ! మళ్ళీ పాటల మాటికొస్తే నేను వదిలేసింది ప్రసాదంగా తీసుకున్నానన్నావట? మరీ ఇంత నిరాబండరంగా ఉంటే ఎట్లా?
ప్రసాదం మాట నిజమేగా? తెలుగు సినిమా పాటంటే ముందు గుర్తొచ్చేది మీరు, ఆ తర్వాతే నేను. అక్షరమాలలో కూడా “ఘ” ముందు తర్వాతనే “బా” కదా.
అందుకే మీరు ఆద్యుడు!
నువ్వు ? అసాధ్యుడువి..
నీ టాలెంట్ ముందు నేనే పాటి?
దక్షిణ భారతంలో ఏ భాష వాళ్ళయినా గానీ నీ పాట పాడుకోని వాళ్ళు ఉన్నారా? అదే మాదిరి ఉత్తర భారతంలోనూ నువ్వెవరో తెలియని వాళ్ళెవరు?
మాష్టారూ… మీ ముందు నేనెంతండీ! దేశం మిమ్మల్ని తపాలా బిళ్ళలో భద్రపర్చుకునే ఖ్యాతి మీది!
కాదు బాలా… పదహారు భాషల్లో నలభై వేల పై చిలుకు పాటలు పాడావట గదయ్యా… అనితర సాధ్యం.
ఆ వైవిధ్యం ఆ భావవక్తీకరణ!
ఏదో మీరులేనందున నేను ఆముదపు చెట్టునే అయినా మహావృక్షంలా చేసేశారు.
నేననుకుంటానూ, మాతృభాషలో కాక పరాయి భాషల్లో ఎక్కువ పాటలు పాడిన రికార్డు కూడా నీదే నేమో!
దక్షిణ భారద్దేశపు భాషలన్నీ నీకు మాతృ భాషలే నయ్యా బాలా.
అందులో నా గొప్పేం లేదు మాష్టారూ, వాళ్ళ హృదయాలు పెద్దవి, అంతే!
మళ్ళీ అదే నిరాడంబరత.
నువ్వు పాడిన భక్తి పాటలు ఎంత రక్తిగా ఉన్నాయో కూడా తెల్సు.
మీరు పాడిన లలిత, దేశభక్తి గీతాల మాటేంటీ? పుష్పవిలాపం, కుంతికుమారి, నిన్నునేను మరుమలేమురా అవే వినిపిస్తుంటాయ్ తెలుగునాట అంతటా! మాష్టారూ మీ పాట మళ్ళీ మళ్ళీ వినేలా ఉంటుంది!
బాలా మరి నీ పాట?… మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంటుంది!
క్లాసూ, మాసూ తేడా లేకుండా!
మాష్టారూ, మీ పాటలో మాధుర్యం ఎవరికొస్తుంది చెప్పండి. మీ మాటల్లో స్పష్టతా… ఇంకెవరన్నా “హాయి” అనే మాటని మీరన్నంత హాయిగా అని, హాయిని కల్పించారా ? చెప్పండీ… లేరు మాష్టారి సాటీ సరి గాయకులు ధారుణిలో…(లవకుశులు పాడినట్లుగా పాడారు)
నా ట్యూన్ నాకే అప్పచెబుతున్నావా? అయినా నేనొప్పుకోను బాలా! అంతర్యామి అలసితి…, ఓ పాపా లాలీ … ఒక్కడై రావడం…ఇట్లా ఎన్నని చెప్పనూ? మరొకరి వల్ల అవుతుందా?
అంతా మీ కృప మాష్టారూ!
నీ చేత నా డైరక్షన్ లో పాడించుకునే అవకాశం రాకపోయే! అది నాకు వెలితిగా ఉంటోంది బాలా.
నేనొచ్చేసరికి మీకు చేసే తీరిక లేకపోయింది మరి! అయినా మీతో పాడిన కొద్ది పాటలైనా నాకు పదివేలు!
మనం పాడిన “ప్రతీ రాత్రి వసంత రాత్రి ” ఎంత ఇష్టపడ్డారో మన వాళ్ళు.
మరి పోటాపోటీగా సాగింది కదా ఆ పాట!!
అవునూ… ఒక్కరోజులో ముఫ్ఫై పాటలు పాడి రికార్డు పెట్టేశావట? ఎంత గొప్ప విషయమయ్యా బాలా!!
మాష్టారూ మీరు ఒక్క టేకులో ” శివవంకరి ” పాట పాడేశారట!
దాని ముందు ఇదెంత మాష్టారూ!!
సర్లే…. నువ్వు మంచి మాటకారివి, నువ్వంటే నువ్వంటూ ఇబ్బంది పెట్టేస్తున్నావ్ !
మరి మీరు మోస్తే నేను మోయద్దా.. చెప్పండి.
అదే తీరుగా అదృష్టవంతుడివి బాలా! నాలుగుతరాల వాళ్ళు నీ పాటలు పాడుకుంటారు. నేను యాభై రెండేళ్ళు బ్రతికితే, నువ్వు సుమారు యాభై నాలుగేళ్ళు పాటల సేద్యం చేశావు తెలుగు సినీ క్షేత్రంలో. అంటే నా జీవితకాలం దాటి పోయింది నీపాటల ప్రయాణం. ఎంత గొప్ప విషయం!!
ఆ అదృష్టాన్ని నాకిచ్చిన వారందరికీ నా వినమ్ర పూర్వక నమస్సులు. ఈ విషయంలో మీతో విభేదించను, అడ్డురాను మాష్టారూ!
పాటల సంగతి పక్కన పెడితే, నువ్వెంత బాగా యాక్టింగ్ కూడా చేస్తావయ్యా. “మిథునం”లో అప్పదాసు పాత్ర నీ కోసమో సృష్టించబడిందా అన్నంతగా పరకాయ ప్రవేశం చేసేశావుట! రమణ నీ కోసమే రాసాడా? ఆయన కోసం నువు చేశావా?
అద్దెలియదు గానీండీ, భరణి మాత్రం నా కోసమే అది తీశాడనిపిస్తుంది. నటుడిగా నాకు చాలా అంటే చాలా తృప్తి నిచ్చింది మాష్టారూ ఆ పాత్ర. అదో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అవకాశం నాకు! పాత్రధారణ సరే, గాత్ర ధారణ మాటేంటీ!
నీ గొంతుతో ఆ అరవ అతన్ని తెలుగు వాళ్ళ సొంతం చేసేశావే! కమల్ హసన్నేనా మీరనేది! వాడు నా తమ్ముడు మాష్టారూ. మేమిద్దరం సినిమా విషయంలో వేరు చేయలేని ఒక రూపం. వాడు శరీరం నేను వాణిగా అయి పోయాం. అదేదో గత జన్మబంధం అనిపిస్తుంది. మీ లాంటి పెద్దల ఆశీర్వాదం వల్లే ఇలాంటివి జరుగుతయ్ అనుకుంటా!
సరే కానీ, తెలుగు సినీ గీతానికి నువ్వు చేసిన సేవ నేను చెయ్యలేదోమో బాలా… “పాడుతా తీయగా”, “పాడాలని ఉంది”, స్వరాభిషేకం ద్వారా ఎంతమంది కొత్త గాయకులని బైటికి తెచ్చావు! ఎంత తర్ఫీదు ఇచ్చావ్ ! మలుచు కొచ్చావు గాయనీ గాయకుల్ని. ఆ తల్లి ఋణం తీర్చేసుకున్నావయ్యా వడ్డీతో సహా!
ఏంటి మీరనేది! తెలుగు పాటని ప్రజల ఇళ్ళల్లో, నోళ్ళల్లో నానేలా చేసింది మీరు. మీరు అంత మధురంగా పాడారు కనుకనే ప్రజలు వాటిని ఇష్టపడ్డారు. కాదు కాదు మరిగారు! తర్వాత నాకూ మనసిచ్చారు. మీరు తెలుగు సినీమా పాటల నారు పెడితే నేను నీరిచ్చాను అంతే మాష్టారూ!
“పాడుతా తీయగా”లో నువ్వు పిల్లలతో పిల్లాడివై పోతావే అది భలే ముచ్చటేస్తుంది బాలా. ఒక ఎపిసోడ్ లో ఒక చిన్నమ్మాయి పోటీలో పాల్గొనడానికి వచ్చినప్పుడు చాలా నగలు పెట్టుకొచ్చింది. ఆ అమ్మాయి మన అమ్మలా పెట్టుకొచ్చింది.
ఆ అమ్మాయి వస్తుంటే నువ్వు అన్న మాట ఎప్పటికీ మర్చిపోలేను. “నడిచొచ్చే నగల కొట్టులా ఉంది చిట్టితల్లి” అని అన్నావు.
ఎలా తడతయ్ నీకు అలాంటివి అంత ఆశువుగా? మరెవరి వల్లా కాదు బాలా అలా!
గొప్పవాళ్ళ సహవాస దోషం మాష్టారూ… నేరం నాది కాదు!
ఎంత ఒదిగి పోతున్నావయ్యా! నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. పాట పదికాలాలు మ్రోగేలా చేశావు బాలా! పాడుతా తీయగా కార్యక్రమంలో, ఇంకా వేరే వాటిలో నువు చెప్పే విషయాలు, వ్యాఖ్యానానికి ఎంతమంది చెవికోసుకుంటారో తెల్సా? అసలా ప్రోగ్రామే నీలోని వేరే బా.సు’ని పరిచయం చేసింది జనానికి.
గురువు, శిష్యుడు, స్నేహితుడు, శ్రోత, అభిమాని, కృతజ్ఞుడు, చమత్కారి, విమర్శకుడు, జ్ఞాని, ప్రేమికుడు, బోధకుడు ఎన్ని రూపాల్లో కనిపించావో తెల్సా, ఇది అనితర సాధ్యం బాలా! సకల కళావల్లభుడివి, సకల శ్రోతల మానస చూరుడవి.
కానీ మాష్టారూ తెలుగు పద్యం మాత్రం ఇంకా పాదులో పడిపోయిన తీగె మాదిరే ఉండి పోయింది. పైకి లేపలేక పోయాను .
కాలమాన పరిస్థితుల ప్రభావం.
ఇవి పద్యాలు చదివే రోజులా! ఇంక పాడుకునేదెవరు?
నీ వంతు నువ్వు చేశావు బాలా, పాడుతా తీయగా’లో పద్యాన్నీ ఒక వృత్తంగా పెట్టావు. పిల్లలు తర్ఫీదు తీసుకుని ఎంత బాగాపాడేరో!
మీ నర్తనశాల, పాండవ వనవాసం, లవకుశ… ఓహ్ ఒకటేమిటి, ఆ పద్యాలు వింటుంటే వళ్ళు పులకించాల్సిందే, తెలుగుతనం తలెత్తుకు తిరగాల్సిందే!
తెలుగు భాషకి నువ్వు చేసిన సేవ నేనెక్కడ చేశాను బాలా?
ఎంత తపించే వాడివి! మాట అర్ధం చెప్పడంలో, పలకడంలో నీ కృషి అమోఘం. “చ” అక్షరం సరిగ్గా పలకించడానికి ఎంత పట్టుపట్టేవాడివి? ఎంత మందికి తెలుగు చక్కదిద్దావో కదా!
ఏదో ఉడతా భక్తిగా మాష్టారూ….
ఇంకొటి నాకు ఆశ్చర్యం బాలా! పని.. పని… పని… అది తప్ప వేరే ధ్యాస లేదే నీకు.
నీ భాషలో చెప్పాలంటే పని రాక్షసుడివయ్యా నువ్వు. పాడడం, వ్యాఖ్యానం, డబ్బింగు, యాక్టింగు, ఇంకో ఇంగూ, ఇంకో టింగూ ఇంత సమయ మెక్కడిది నీకు బాలా. వాళ్ళకి జ్ఞాపకాలు మిగల్చడం కోసం నువ్వు బ్రతకడం మర్చిపోయావేమో బాలా!
వాళ్ళ జ్ఞాపకాల్లో బ్రతికి పోవాలనే దురాశ మాష్టారూ!
నీ కీర్తి గంధం భువి నుండి దివికి గుబాళిస్తోంది బాలా. నువ్వు విశ్వనాధన్ ఆనంద్ కు చేసిన సౌజన్యం, నెల్లూరులో వున్న మీ ఇంటిని వేద పాఠశాల కోసం అర్పించడం, శబరిమల బోయీల పాదాలకు నమస్కరించడం, గుప్త దానాలు చేయడం – ఒకటేమిటి బాలా నీకు అన్నీ తెలిసినయ్ . ఇంత ఎదిగిపోయి కూడా నువ్వు ఎంత వినమ్రంగా ఉన్నావ్ ! నువ్వు జీవితాన్ని ఓ పండగలా సంబరంగా గడుపుకున్నావ్ బాలా! నీలాగ పరిపూర్ణ తృప్తితో జీవించడం మరెవరివల్లా కాదు. పుట్టుకని ఎలా సార్ధకం చేసుకోవాలో చూపించావు! నువ్వు ధన్యజీవివి బాలా.
మాష్టారూ… ఒక చిన్న కోరిక!
చెప్పు …
ఆరోగ్యం తిరిగి పొందడానికి పోరాడి పోరాడి అలసి పోయాను. ఒక్కసారి మీ ఒళ్ళో పడుకొని, మీ నోట “పాడుతాతీయగా చల్లగా” వినాలనుంది. వినిపించరూ”
నువ్వు ఒక మాటిస్తే ….
చెప్పండి…
నువ్వు “యాతవేసి తోడినా ఏరు ఎండదు” పాడాలి మరి, నీ కోసం పొగిలి పొగిలి ఏడ్చే తెలుగువాళ్ళకు ఊరడింపులా! నువ్వు వాళ్ళని వదిలి రోజులు కావస్తున్నా వాళ్ళ గుండె గాయం ఉపశమించలా!
(వాళ్ళిద్దరు గంధర్వ గాయకులూ ఒకరి కొకరు ఏమౌతారో తెలియదు గానీ, తెలుగు శ్రోతలకు మాత్రం ప్రాణ నాడులయ్యారు)
సేకరణ: మల్లేశ్వరరావు