ఆరడుగుల అభినయం
అంతర్ధానమైపోయింది..
పోతపోసిన మంచితనం
మరలిరాని లోకాలకు
తరలిపోయింది..
నిఖార్సయిన నటనకు
నిలువెత్తు రూపం..
ఎప్పటికీ వెలుగుతూ ఉండే
ఓ అమరదీపం..!
ఆయన కన్నెర్ర చేస్తే
కటకటాలరుద్రయ్య..
అదే కన్ను పీకేస్తే భక్తకన్నప్ప.._
కొన్ని సిద్ధాంతాల కోసం
హత్యలు చేసినా
ఆయనకు అనుకూలంగానే
అంతిమతీర్పు..
ఆ తీర్పు తానే చెప్పే
బొబ్బిలిబ్రహ్మన్న..
చొక్కావిప్పి దాన్ని భుజంపై
వేసి పక్కన పులిని కూర్చోబెట్టి ఆ పులి లా
తాను గాండ్రిస్తే
ఆయన కృష్ణంరాజు..
తెలుగుతెరపై
నవరస నటరాజు..!
ముగ్గురు నాయికలతో
ఆయన అభినయజాలం
త్రిశూలం..!!
గోపీకృష్ణ..తీరిన
ఆయన కళాతృష్ణ..
ఎన్నెన్ని అపురూప చిత్రాలు..రాజుగారి
నటవినీలాకాశంలో
మెరిసే నక్షత్రాలు..!
తొలి సంధ్యవేళలో..
తొలిపొద్దు పొడుపులో..
జయప్రదంగా ఓ సినిమా..
నా జీవనసంధ్యా
సమయంలో
ఒక దేవత
ఉదయించింది..
అన్నదమ్ముల మధ్య తెలియని వ్యధ..
జయసుధ..
ఆలుబిడ్డలూ
నాకు తూనాబొడ్డు..
కోరమీసాలు..నెత్తిన పిలక
ఇంట్లో ఊగే ఉయ్యాల..
ఒక్క కేకకే అదిరే హాలు..
ఏ పాత్రకూ అభినయంలో చెయ్యలేదు లోపం..
పరాకాష్ట అమరదీపం..!
బొబ్బిలియుద్ధ కాలం
నాటి సింగం తాండ్రపాపారయుడు..
విశ్వనాధనాయకుడు లో
శివాజీ..కృష్ణతో
పోటీ పడే దేవరాయలు..
అన్న నందమూరి
దానవీరశూర’కర్ణ’గా
అదరగొడితే తనూ
తక్కువ లేకుండా కురుక్షేత్రం లో
అభినయ క్షాత్రం..
అసలు విజృంభణమే
కృష్ణంరాజు గోత్రం..!
బాపూ చేతిలో బుల్లెట్..
అదే బాపూ తీర్చిదిద్దిన
మనవూరిపాండవులు
నడుమ ఆరడుగుల
అభినవ కృష్ణుడు…
మా నాన్నకి పెళ్లి
అంటే కాస్త సిగ్గుపడినా
రౌడీ మూకల
నిగ్గు తేల్చడంలో
వెనుదీయని
గ్యాంగ్ మాస్టర్..
ప్రభాస్ కు
ఈ పెదనాన్నే బూస్టర్..!
రాజకీయాల్లోనూ నిజాయితీకి సింబల్
మన రెబల్..
ఎక్కడైనా దర్జాగా..దర్పంగా
ఇంటిగౌరవం నిలబెట్టుకుంటూ
నెగ్గుకొచ్చిన
ఆడపిల్లల తండ్రి..!
కృష్ణంరాజుకు నివాళి అర్పిస్తూ..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286