Home » పునీత్ రాజ్ కుమార్ నేర్పిన పాఠం..

పునీత్ రాజ్ కుమార్ నేర్పిన పాఠం..

కొన్ని మరణాలు చూస్తే కాసేపు స్మశాన వైరాగ్యం వస్తుంది. కానీ ఆ వైరాగ్యంలోంచి నేర్చుకోవాలసిన పాఠాలు కూడా ఉంటాయి. అందరం పోవాల్సినవాళ్లమే.
కానీ ఉన్నంతకాలం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి అనే విషయాలు కొందరి చావులు నేర్పినంతగా వారి జీవితాలు నేర్పవు. పునీత్ రాజ్ కుమార్ మరణం పొరుగున ఉన్న కన్నడిగులనే కాదు చాలా మందిని భయపెట్టింది.
పునీత్ జిమ్ లోనూ, బీచ్ లోనూ కఠినమైన కసరత్తులు చేస్తున్న ఒక వీడియో నెట్లో ఉంది. అసలంత ఫిట్ గా ఉన్న మనిషికి గుండెపోటుతో హఠాన్మరణమేంటి అనేది చాలామంది ప్రశ్న.
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో చెప్పాలంటే అతను మరణించినప్పుడు ఎంతమంది అంత్యక్రియలకు హాజరయ్యారనే దానిని బట్టి చెప్పొచ్చంటారు.
పునీత్ అంతిమయాత్రకి తరలివచ్చిన జనం దాదాపు 25 లక్షలమంది. ఆయన కన్నడ సినిమాల్లో పవర్ స్టార్. పెద్ద హీరో. అంతమాత్రమే కాదు వివిధ సేవాకార్యక్రమాల ద్వారా ఎందరి మనసులో గెలుచుకున్న వ్యక్తి. ఆ రకంగా రియల్ హీరో.
అతను పోయిన తర్వాత దేశం మొత్తం చర్చించున్నది అతను చేసిన సినిమాలగురించి కాదు. 1800 మంది విద్యార్థులకి ఉచిత విద్యాసేవ చేస్తున్నదాని గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. ఆ విషయమే వాట్సాప్ లో వైరల్ అయ్యింది.
పునీత్ మరణానంతరం ఆ సేవ ఆగిపోకుండా తాను ముందుకు తీసుకువెళ్తానని ప్రతిజ్ఞ చేసి తమిళ హీరో విశాల్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. మనిషి మూటకట్టుకుపోయేది డబ్బు, ఆస్తులు కాదు..పుణ్యం మాత్రమే అంటారు. అది నిజమే అని పునీత్ విషయంలో మరో సారి రుజువయ్యింది.
ఎన్ని సినిమాలు చేసావు, సినిమాకి ఎంత పుచ్చుకుంటున్నావు, నువ్వు బయటికొస్తే నీ వెనుక ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎన్ని కంపెనీలు నిన్ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా కోరుకుంటున్నాయి, సిటీలో ఏ ఏరియాలో ఎంత పెద్ద కొంపలో ఉంటున్నావు…ఇవేమీ మనిషి యొక్క గొప్పతనానినికి శాశ్వత ప్రమాణాలు కావు.
ఒక్కసారి ఊపిరాగిపోయాక ఈ ప్రపంచం పట్టించుకునే విషయం ఒక్కటే..”నువ్వు బతికుండి సమాజానికి ఏమాత్రం నిస్వార్థ సేవ చేసావు?”..నిజానికి ఈ ప్రశ్న సినిమాల్లో చూపించినట్టు పైన యముడు, చిత్రగుప్తుడు వేస్తారో లేదో తెలియదు కానీ, భూమీద జనం వేయడం కళ్ల ముందు కనిపిస్తోంది.
ఇంత చేసిన వ్యక్తికి మోక్షం కలగాలని కొందరు, స్వర్గలోక ప్రాప్తి సిద్ధించాలని ఇంకొందరు తీర్పులిస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి వెళ్లిపోయిన జీవుడికి స్వర్గనరకాలనేవి భూమ్మీద ప్రజలే నిర్ణయిస్తారేమో అనిపించేలా ఉంది. అదలా ఉంచితే ఇందాక “నిస్వార్థ సేవ” అనే విషయం చెప్పుకున్నాం.
కొందరు హీరోలు లక్షో, రెండు లక్షలో ఎవరికో దానం చేసి ఫోటో దిగి పబ్లిసిటీ చేసుకుంటారు. ఆ దానం ఒక్కసారికే చేసి వదిలేస్తారు. అది తప్పా అంటే తప్పు కాదు. కానీ ఎప్పుడైతే ఫోటో తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారో అందులో స్వార్థం ఉన్నట్టు. దానిని లోకం పెద్దగా మెచ్చదు.
ఒకరు జీవితకాలం ఒక బాధ్యతగా ఏ స్వర్థమూ లేకుండా, ఎటువంటి ప్రచారమూ చేసుకోకుండా సేవ చేస్తారో అది మాత్రమే గుర్తింపు పొందగలిగే నిస్వార్థ సేవ. ఇక్కడ పునీత్ చేస్తున్న విద్యాసేవ గురించి ఆయన మరణానంతరం లోకం చెప్పుకుంది. అలా ఉండాలి సేవ అనేది.ఈయన పోతే ఫలానా సేవ ఆగిపోతుందేమో అని కొందరు భయపడేంతగా సేవ చేస్తుండాలి.
పునీత్ గురించి గడచిన రెండు రోజుల్లో కన్నడ పత్రికల్లో చాలా కబుర్లు వచ్చాయి. వాటిల్లో ఒక విషయం చెప్పారు. “తెర మీద మాత్రమే మేము హీరోలం. బయట అందరిలాంటి సాధారణ జీవితాలే మావి. మీరు తినే అన్నం, సాంబారే మేమూ తింటాం. దయచేసి మమ్మల్ని వేరుగా చూడద్దు. మేము మిమ్మల్ని వేరుగా చూస్తామని అనుకోవద్దు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పునీత్.
ఇలా చెప్పడంలో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు. మాటలకే కాదు ఆయన ఆచరణ కూడా అలాగే ఉండేదని రాసారు. ఫ్యాన్స్ తో మాట్లాడడం అంటే హీరోగా కాకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్ గా, ఒక సోదరుడిగా మాట్లాడేవారట.
తన సినిమా విడుదలైనప్పుడు నేరుగా కొందరు థియేటర్ మ్యానేజర్స్ తో కూడా మాట్లాడి రెస్పాన్స్ తెలుసుకునేవారట. సాధారణంగా స్టార్స్ నేరుగా ఇలాంటి స్థాయివాళ్లతో మాట్లాడరు.
కానీ పునీత్ కి సామాన్యులతో సామాన్యుడిగా మాట్లాడడం ఇష్టం. ఇన్ని మంచి విషయాలు ఒక మనిషి మరణం తర్వాత చెప్పుకుంటున్నారంటే ఇటువంటి లక్షణాలు తమలో ఎన్నున్నాయో, అసలున్నాయో లేదో మన తెలుగు సినిమా స్టార్స్ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి.
పునీత్ ని చూసి సినిమా వారే కాకుండా అందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. అది ఆరోగ్యం గురించి.
ఆరోగ్యమంటే పైకి కనిపించే బలమైన దేహం ఒక్కటే కాదు. లోపలున్న అవయవాల పనితీరు, వాటి స్థితిగతుల మీద కూడా దృష్టి పెట్టాలి. పునీత్ మరణానంతరం ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవీ శెట్టి ఇలా చెప్పారు- “జెనెటికల్ గా భారతీయులకి గుండెపోటుకి గురయ్యే చాన్సు యురోపియన్స్ కంటే 3 రెట్లు ఎక్కువ. భారతీయుడిగా పుట్టడమే గుండెకి రిస్క్.
40 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు హార్ట్ పేషెంటే.. కాదని ప్రూవ్ అయితే తప్ప. ట్రెడ్ మిల్ మీద ఆవేశంగా పరుగెత్తే ప్రతి 40 ఏళ్లు పైబడిన వ్యక్తినీ అడుగుతుంటాను కార్డియక్ టెస్టు చేసుకున్నాకనే ఈ పని చేస్తున్నారా అని. అవసరం లేదు మేము ఫుల్లీ ఫిట్ అని చెప్తుంటారు. బాడీ ఫిట్నెస్ కి హార్ట్ ఫిట్నెస్ కి చాలా తేడా ఉంది. 100 మైళ్లు పరుగెత్తే స్టామినా ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క హార్ట్ వీక్ అవ్వొచ్చు. సగం మంది భారతీయులు సైలెంట్ హార్ట్ ఎటాక్ తో బాధపడుతున్నారు. కార్డియాక్ సి.టి యాంజియో, ఎకో కార్డియోగ్రాం టెస్టులు చేయించుకుని తీరాలి.
మొదటి టెస్టు ద్వారా కనీసం 10-20 ఏళ్లకి ముందే రాబోయే హార్ట్ ఎటాక్ ని గుర్తించవచ్చు. దురదృష్టవశాత్తూ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఫిట్ గా ఉన్నామన్న భ్రమలో బతికేస్తున్నారు”. కనుక ఆ రెండు టెస్టులూ చేయించుకోమని పునీత్ మరణం అందరికీ చెబుతున్న పాఠమనుకోవచ్చు.
అతిగా వ్యాయామాలు చేయడం వల్ల, సిక్స్ ప్యాక్ టార్గెట్స్ పెట్టుకుని శరీరంలో కండరాలకి అధిక శ్రమనివ్వడం వల్ల మంచి కన్నా చెడు జరిగే ప్రమాదం ఎక్కువుంది. అలాగని అసలు వ్యాయామం చేయకపోయినా మంచిదికాదు. అతిగా చేస్తునా ప్రమాదమే. కసరత్తుల విషయంలో అతివృష్టీ వద్దు, అనావృష్టీ వద్దు. గుండె కూడా ఒక కండరమే అని మరిచిపోకూడదు. ఏ బరువు ఎత్తుతున్నప్పుడో మజిల్ టేర్ అవడమో, మజిల్ పట్టేయడమో జరుగుతుంటుంది. ఆ మజిల్ గుండె అయితే ఏమౌతుందో ఆలోచించండి.

– వెంకట సత్యవతి

Leave a Reply