సర్కారు వారి తాట.. తీట తీరింది!?

విజయ్ మాల్యా..
నీరవ్ మోడీ..
ఇలాంటి ఓ పెద్ద జాబితా..

వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కట్టకుండా దిల్దార్ గా తిరుగుతున్న 420×420 ముఠాకి పెద్ద టికెట్ రేటుతో చూపిస్తే మొత్తం పెట్టుబడి వెనక్కి వచ్చేసే సినిమా.. సర్కారు వారి పాట..
కాని మామూలు జనాల మీదికి వదిలేసి వాళ్ళని గందరగోళంలో పడేశాడు దర్శకుడు పరశురామ్..
విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం సినిమా తీసి తన గీతని మార్చుకుని మహేష్ బాబు బొమ్మని మాత్రం గోవిందం చేసేసాడు..

ఒక బలమైన పాయింట్..బలహీనమైన స్క్రిప్ట్ తో మహేష్ బాబు వంటి స్టార్ ఇమేజ్ కు మ్యాచ్ చెయ్యలేక మొత్తంగా మిస్ హ్యాండిల్ చేసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాడు పరశురామ్..
మహేష్ బాబు వంటి చక్కనైన.. సాప్ట్ మనిషితో బూతులు పలికించే బదులు ఎటూ ఒక బలమైన పాయింట్ ని ఎన్నుకున్నాడు గనక దానిని మరింత సీరియస్ గా హ్యాండిల్ చేసి వేల కోట్ల రూపాయల బకాయిలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన..దేశంలోనే ఉంటూ రాజభోగాలు…ఆపై అధికార లాంఛనాలు,అధికార పదవులు కూడా అనుభవిస్తున్న బడాబాబుల పేర్లు కూడా కాస్త బలమైన డైలాగులతో చెప్పించి పనిలో పనిగా వారికి కొమ్ము కాస్తున్న..ఆ సొమ్మంతా వెనక్కి రాబడతామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు అలాంటి రుణాల మాఫీకి ఒడిగడుతున్న ప్రభుత్వాల మీద కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తే బాగుండి పోను..ఊహు..అటువంటి ప్రయత్నాలు చెయ్యకుండా కేవలం మహేష్ ఇమేజ్ పెంచే ప్రయత్నం మాత్రమే చేసిన దర్శకుడు తన పరువు తీసుకోవడమే గాక శ్రీమంతుడు.. భరత్ అనే నేను..మహర్షి వంటి వరస సినిమాలతో బిల్డప్ చేసుకుంటూ వచ్చిన బలమైన సందేశం అనే సెంటిమెంటుకు.. కమిట్మెంటుకు దెబ్బ కొట్టేశాడు..మన తెలుగు సినిమాలు ద్వందార్ధ డైలాగులు..కొన్ని అభ్యంతరకర తిట్లు దశ దాటి హీరోలు మాత్రమే గాక హీరోయిన్లు సైతం డైరెక్టుగా బూతులు మాట్లాడేసే రోజులు ఇంకెంతో దూరంలో లేననే అనిపించింది ఈ సినిమాలో కొన్ని తిట్లు వింటుంటే..!

హీరో సోలో సాంగ్.. ఓ రెండు డ్యూయెట్లు.. మితిమీరిన ఫైట్లు…వాటిలో నమ్మలేనంత హీరోయిజం..
ఇప్పుడు ఏ హీరో గాని..దర్శకుడు గాని వీటికి అతీతంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు..
ముఖ్యంగా పెద్ద హీరోల విషయంలో..!

సినిమాలో కాన్సెప్ట్ పెద్దది.. కథ చిన్నది..కథనం బలహీనమైనది..టేకింగ్ పేలవం..ఉన్నదంతా మహేష్ బాబు హీరోయిజం..ఆయన ఇమేజ్… ఇంతా చేస్తే ఆయన శ్రీమంతుడు కాడు..ముఖ్యమంత్రి అంత కంటే కాడు..పెద్ద కార్పొరేట్ దిగ్గజం కానే కాడు..అప్పులిచ్చి వసూలు చేసుకునే ఆకు రౌడీ..అది కూడా అమెరికాలో..తల్లిదండ్రులు బ్యాంకు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని కళ్ళారా చూసిన కుర్రాడు మన సినిమాల సెంటిమెంట్ ప్రకారం పగ తీర్చుకునే వీరుడిగా అయినా..తన తల్లిదండ్రులు అలా కావడానికి దారి తీసిన పరిస్థితులు మార్చాలని పట్టు పట్టే సంస్కర్తగా అయినా మారాలి.. కానీ అలా కాకుండా తన వాళ్ళు ఏ అప్పులకు బలైపోయారో ఆ అప్పులే ఇచ్చే మనిషిగా ఎదగడం(?)ఎక్కడా సెంటిమెంటుకు కనెక్ట్ అవ్వలేదు..పోనీ అలాంటి వ్యవస్థ మీద వ్యతిరేకత కూడా అతడిలో కనిపించలేదు.అకస్మాత్తుగా ఎయిర్ పోర్టులో తారసపడిన నదియా..ఆమె ఈ సినిమాలో న..దయా..
అప్పు వసూలు అనే విధి నిర్వహణ కోసం అవతల ప్రాణాలు పోయినా చలించని కఠినాత్మురాలు..అలా ఆమె కారణంగా మరణించిన వారే హీరో జననీజనకులు.. మరి ఆమె కోసం..అసలు క్యారెక్టరే లేని హీరోయిన్ కోసం మహేష్ పడిన తాపత్రయం.. అబ్బే..అస్సలు సెట్ కాలేదు..అతగాడికి సూట్ అవ్వలేదు..!
కీర్తి సురేష్.. మహానటి నుంచి మహీనటి (ఈ సినిమాలో మహేష్ బాబు పేరు మహీ)కావడానికి తిప్పలు పడినా సావిత్రికి కళావతికి మధ్య నలిగిపోయింది పాపం..
ఆ స్టెప్పులు..గెటప్పులు..ఆమె కీర్తికి ఇబ్బందికరంగానే పరిణమించాయి.కీర్తి సురేష్వ ర్సెస్ కీర్తి మహేష్..అస్సలు కుదర్లేదు..మాస్ హీరోయిన్ గా తళుక్కుమందామని ఆమె చేసిన ప్రయత్నం పుసుక్కుమంది.

మొత్తంగా డైరెక్టర్లు అందరూ పునరాలోచన చేయాల్సిన పరిస్థితిని ఈ మధ్య కాలంలో విడుదలైన భీమ్లానాయక్..రాధేశ్యామ్.. ఆచార్య..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలు కల్పించాయి.హీరో ముఖ్యమే.. అంతకంటే ముఖ్యం కథ..టేకింగ్..!
వాటిని వదిలి హీరోల ఇమేజ్ కోసం..దానిని పెంచడం కోసం డైరెక్టర్లు పాటు పడితే ఇదిగో..ఇలాంటి చేదు అనుభవాలే.. సంభవాలే..!
ఇంతకీ..ఈ సినిమాలో ప్రధాన విలన్ బ్యాంకు..
సామాన్యులకు ఇచ్చే రుణం విషయంలో ఇచ్చేటప్పుడు..వసూలు చేసుకునేటప్పుడు దారుణంగా వ్యవహరించే బ్యాంకులు పెద్ద వాళ్ళ విషయంలో..ముఖ్యంగా రాజకీయ నాయకులు..వారి అండదండలు ఉన్న వ్యక్తుల విషయంలో ఉదాసీనంగా ఉందిపోవడాన్ని బలంగా చూపిస్తే బాగున్ను…దర్శకుడికి అదెలాగో తెలియలేదు..అదే మైనస్ అయింది..
నాకు తెలిసి బ్యాంకులు వేలం వేసేటప్పుడు బ్యాంకు వారి పాట అంటారేమో..
అలా కాక సర్కారు వారి పాట అనే టైటిల్ తో జనాల తాట తీశాడు పరశురాముడు..
మహేష్ బాబు మళ్లీ ఎన్నాళ్ళకి నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ హిట్టుతో మన ముందుకి వచ్చేనో,త్రివిక్రమ్ తో అయితే పర్లేదు.. రాజమౌళి చేతిలో ముందు పడితే పంచవర్ష ప్రణాళికే…!

– సురేష్ కుమార్ E
9948546286

Leave a Reply