అది ఓ ప్రఖ్యాత నగరంలో అత్యంత సందడిగా ఉండే మెట్రో స్టేషన్..సమయం ఉదయం 9 గంటలు..అసలే రెండు రోజుల సెలవు తర్వాత మళ్లీ జీవితం పరుగు మొదలయ్యే సోమవారమాయె.
వచ్చేపోయే రైళ్లు ..వాటి కోసం పరుగులు పెడుతున్న జనం..ఎవరి హడావిడిలో వారు..అలాంటి చోటుకి ఓ పెద్దాయన..అలా అని ముసలాడేమి కాదు(యాభైకి పైన..కాకపోతే మాంచి సోగ్గా ఉన్నాడు)అలా వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.బాగ్ తెరిచి తన వయొలిన్ తీసి వాయించడం ప్రారంభించాడు.అక్కడ ఎవరి హడావిడిలో వారు ఉన్న జనంలో ఎవ్వరూ ఆ పెద్దాయన్ని గాని..ఆయన శ్రావ్యంగా వాయిస్తున్న సంగీతాన్ని గాని పట్టించుకోలేదు.ఆయన పక్కనే కుర్చీల్లో కూర్చున్న వారు సైతం..వాళ్ళు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
అలా నిమిషాలు దొర్లుతున్నాయి..ఎవ్వరూ పెద్దాయన్ని పట్టించుకోలేదు సరికదా ఒక్క నిమిషమైనా ఆగి అద్భుతమైన ఆయన వయొలిన్ వాదనను వినిపించుకునే ప్రయత్నం చెయ్యలేదు.ఒక్క మహిళ వెళ్తూ వెళ్తూ కొన్ని చిల్లర పైసలు ఆయన టోపీలో విసిరింది.ఆ తర్వాత ఇంకొందరు..మధ్యలో ఓ పిల్లాడు అమ్మ చెయ్యి పట్టుకొని వెళ్తూ ఆ సంగీత మాధుర్యానికి ఆకర్షితుడై అప్రయత్నంగా ఆగే ప్రయత్నం చేశాడు. హడావిడిగా వెళ్తున్న తల్లి చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళ్ళినంత పని చేసింది.పాపం..ఇబ్బందిగా కదిలి వెళ్ళిపోయాడు.పిమ్మట మరో నలుగురైదుగురు పిల్లలదీ అదే పరిస్థితి.నిజానికి ఆ వయొలిన్ మాధుర్యానికి పరిసరాలే గమ్మత్తుగా మత్తెక్కినట్టు అనిపించింది.. కాని జనాలు మాత్రం స్పందించలేదు.
అలా ఓ గంట సేపు హృద్యంగా వయొలిన్ వాయించిన పెద్దాయన ఇక చాలనుకుని ముగించి వయొలిన్ బాగులో సర్దుకుని బయలుదేరబోతూ టోపీలో ఎన్ని డబ్బులు పడ్డాయో చూసుకున్నాడు.ముప్పై డాలర్లు..అంటే ఓ రెండు వేల రూపాయలు..మన లెక్కల్లో చాలా ఎక్కువ..మామూలుగా మన దేశంలో ఎంతటి మహానగరంలో హడావిడి కూడలిలో అయినా గాని ఓ యాచకుడు రోజంతా కూర్చుని అదే పని చేసి ముప్పై రూపాయలు వసూలైతే ఎక్కువే..అతగాడికి ఆ రోజు గడిచినట్టే..!
కాని ఆ పెద్దాయన పరిస్థితి అలా కాదే..ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధ వయోలిన్ కళాకారుడు జోష్వా బెల్..అంతకంటే చిత్రం ఏమిటంటే అంతకు రోజు ముందు ఆదివారం సాయంకాలం విశిష్ట సంస్థ
అదే నగరంలోని విలక్షణ ఆడిటోరియంలో అదే కళాకారుడి ప్రదర్శన ఏర్పాటు చేస్తే కలెక్షన్ ఎంతో తెలుసా..కోటి డాలర్లు..అక్షరాలా డెబ్బై కోట్ల రూపాయలు..టికెట్ ధర మినిమం వెయ్యి డాలర్లు..
ఆ క్షణంలో ఆ స్టేషన్లో అటు వైపు వెళ్ళిన ఎంతో మందిలో కొందరు ఆ ప్రదర్శనకు టికెట్ దొరకని వారు ఉండి ఉంటారు.ఇంకొందరైతే..ఆ మనకి ఎక్కడ దొరుకుతుందిలే..అని కనీసం టికెట్ కోసం ప్రయత్నించి కూడా ఉండరు.అంత మంచి ప్రదర్సన చూసే అవకాశం లేకపోయినందుకు తమను తాము ఎంతగానో తిట్టుకుని ఉంటారు కూడా..మరి అదే వ్యక్తి..ఈ రోజున అంతే గొప్పగా ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒక్కరూ పట్టించుకోలేదే..అదే విడ్డూరం..
వాస్తవానికి అది ఓ విఖ్యాత సంస్థ ఏర్పాటు చేసిన రియాల్టీ షో..అందని దాని కోసం జనం ఎంతగా అర్రులు చాస్తారో..అందింది ఎలా పులుపో..ఎంత అలుసో..రుజువు చేయడానికే అదంతా..బిజీ జీవితంలో కళ్ళెదుట కనిపించే అద్భుతమైనా..ఎదుటి వాడి కష్టమైనా పట్టించుకోని జనం వైఖరికి నిలువెత్తు దర్పణం ఈ రియాల్టీ షో..మన దేశంలో అప్పుడప్పుడు రోడ్డు పక్క పాటలు పాడే అంధ గాయకులు..ముగ్గుతో వేసే అద్భుత చిత్రాలు..సముద్ర తీరాల్లో సైకత బొమ్మలు..చెప్పులు కుట్టే వాడి ఈల పాటలు మనకి పట్టవు..అదే సినిమా షూటింగో..రాజకీయ నాయకుడి మీటింగో అయితే అర్జెంటు పనులు మానుకుని కూడా గంటలు గంటలు ఆగిపోతాం..చిత్రం కదా మనిషి నైజం..ఇది నిజం..
కొసమెరుపు
ఇంతగా పూజించే దేవుడే ఓ రోజున రోడ్డు మీద ప్రత్యక్షమైతే పగటి వేషం అనుకుంటాం..చిత్రంగా..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286