పెద్ద సినిమాల సైడ్ యాక్టర్..చిన్న సినిమాల సూపర్ స్టార్

పొట్టివాడే గాని గట్టివాడు..
అలా పొట్టివాడు
కాకపోయి ఉంటే
ఎన్టీఆర్..ఏయెన్నార్..
కృష్ణ..శోభన్ బాబుతో పాటు అయ్యేవాడు అయిదో
సూపర్ స్టార్..
ఆ పరంపరలోనే
చిరు..బాలయ్య..
నాగ్..వెంకీ సరసన కూడా చంద్రమోహనుడే..
రెండు తరాలకు సరిపడా
హీరోదాత్తుడు..
కళామతల్లి ప్రియపుత్రుడు
కళాతపస్వి దత్తపుత్రుడు..!

సాగరసంగమం నాటికి జతకట్టాడేమో కాశీనాథునితో
కమల్ హాసన్..
అంతకు మునుపు వరకు
చంద్రమోహనే విశ్వనాథుని
విలక్షణ నటుడు..
చిందేసినా చంద్రుడే..
డప్పు కొట్టినా మోహనుడే..
టూరింగ్ టాకీస్
ఊడ్చినా అతగాడే..
శంకరశాస్త్రి అల్లుడైనా
ఈ అయిదున్నర అడుగుల అందగాడే..!
తమిళంలో కమల్ హాసన్
చప్పానిగా చితక్కొడితే
తెలుగులో కుంటోడుగా
కుమ్మేసాడు చంద్రమోహన్..

ఎప్పటి రంగులరాట్నం..
మేడంటే మేడ కాదన్నాడు..
ఏ పాత్ర వచ్చినా కాదనకూడదన్నాడు..
హీరోలకు దర్శకేంద్రుడి బోణీ
బాలనటీమణులకు చంద్రమోహన్ తోనే
తొలిసారి హీరోయినుగా ఓణీ..
ఎత్తుకున్న పాపాయిలనే
తైతక్కలాడే
పావురాయిలుగా మార్చేశాడు..
దశ మార్చేసాడు..!
భక్తప్రహ్లాదను ఓ సీతగా..
లేతమనసులు కుట్టిని
చూపుల గారడీ చేసి పట్టి…
బూచాడమ్మా బొద్దుగుమ్మను
పదహారేళ్ళ ముద్దుగుమ్మగా..
బేబీ డాలీని
సలక్షణ సులక్షణగా..
అబ్బో..ఎన్ని లక్షణాలో
ఈ విలక్షణ నటుడిలో..!

శోభన్ను పెద్దహీరో చేసిన
వీరాభిమన్యు ముందు
మన చంద్రుడి పద్మవ్యూహమే
కాస్త కురసై
ఆ వరస నుంచి తప్పుకున్నా
కృష్ణ కురుక్షేత్రంలో హరివిల్లును
భువి నుంచి దింపాడు జయప్రదంగా..
అన్నట్టు జయప్రద..జయసుధ..
తాళ్లూరి..రాజ్యలక్ష్మి..
మనోడి నాయికలే..
అన్నవరం గుడిమెట్ల ముచ్చట్లు
కాఫీ రాగం పేరు చెప్పి
శాస్త్రి గారితో తిన్న చీవాట్లు..
ఇంటికొచ్చాక నిర్మలమ్మతో
తిన్న తిట్లు..
పెద్దాయనను ఆకట్టుకోడానికి
మాణిక్యవీణ ఫీట్లు..
ఈ కాముడివి ఎన్ని డ్రామాలో
శంకరాభరణం మత్తులో ఎన్నాళ్ళో జనాలు కోమాలో..!?

నాగయ్య నుంచి
నితిన్ వరకు
ఎన్ని కాంబినేషన్లో..
సుదీర్ఘ కెరీర్లో
ఎన్నెన్ని సెన్సేషన్లో..
పాత్ర ఏదైనా ఒదిగిపోయిన
విజయాల యాత్ర..
సహజ నటనే చంద్రమోహన్ సక్సెస్ సూత్ర..!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply