హాయిగా పాడడమే పి బి హాబీ..!

తలపై చిత్రమైన టోపీ
గొంతు చాలా సాఫీ
ఎస్పిబీకి ముందు తరం గాయకుడీ పీబీ
హాయిగా పాడడమే
ఆయన హాబీ..!

ఘంటసాల ఉన్నప్పుడే
ఎన్టీఆర్ కు..
ఏయెన్నార్ కి పాడినా
కాంతారావుకి, హరనాథ్ కి
ఆయన గళం పేటెంట్
అందాల ఓ చిలకా
అందుకో నా లేఖ..
మెలోడీ పాటల్లో
ఆయనది తిరుగులేని టాలెంట్..!

ప్రతి పాట ఇప్పటికీ
జనం నోట
ముద్దుముద్దు పాపాయి
అంటూ పిబి
గొంతులో విషాదం
ఎన్టీఆర్ మొహంలో విరాగం
ఎవరినైనా ఇట్టే బాల్యపు తీపి గురుతుల్లోకి తీసుకుపోయే
సమ్మోహన రాగం..
శ్రీనివాసుడి గొంతు వినడమే
మన జన్మజన్మల యోగం..
నీ అందాల చేతులు కందేను పాపం అంటూ
ఆ గొంతు చేసిన అల్లరి…
వినోదాల వల్లరి..!

నీలికన్నుల నీడలలోన
దోర వలపుల దారులలోన..
అనుచు కురిపించలేదా
స్వరాల వాన..
మన గుండెలోన
ఎనిమిది భాషల్లో
మాటల పేరడీ
పాటల గారడీ చేసిన
ఈ ప్రతివాద భయంకర
సప్తస్వర మనోహర..
మంచి పాటకు చిరునామా…
మంచి మనసుకు వీలునామా!

– సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply