Suryaa.co.in

Entertainment

హింస ఏ రూపంలో ఉన్నా తప్పే:నటి సాయి పల్లవి

” ఈ మధ్య జరిగి‌న ఒక ఇంటర్వూలో నేను పొలిటికల్గా లెఫ్టా రైటా అని అడగినప్పుడు… నేను రెండిట్లో ఏదీ కాదు తటస్థంగా ఉంటాను అని చాలా క్లియర్గా చెప్పాను.మన విశ్వాసాలతో మనకి మనం గుర్తింపునిచ్చుకునే ముందు నేనొక మంచి మనిషిగా ఉండాలి అనుకుంటాను. బాధితుడు ఎవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి రక్షణ కల్పించడం మన బాధ్యత. ఇంటర్వ్యూ ఇలా సాగుతుండగా… నేను సమస్యని ఎలా చూస్తాను అనేది వివరిస్తూ ఈ మధ్య కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసి, కొన్ని రోజులపాటు నా మనసుని విపరీతంగా గాయపరిచిన రెండు సంఘటనలు కోట్ చేశాను.

మూడు నెలల క్రితం “కశ్మీర్ ఫైల్స్” చూశాక ఆ సినిమా డైరెక్టర్ తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు అక్కడి ప్రజల యొక్క దుస్థితి చూసి చాలా బాధపడ్డాను అని చెప్పాను. కొన్ని తరాల ప్రజలను నేటికీ
బాధిస్తున్న కశ్మీర్ జీనోసైడ్ లాంటి సంఘటనను నేనెప్పటికీ కించపరచను. అలానే కోవిడ్ సమయంలో జరిగిన మాబ్ లించిగ్ ను కూడా నేను ఎప్పటికీ అంగీకరించలేను. ఆ వీడియోను చూశాక నేను కొన్ని రోజులపాటు వణికిపోయాను, నాకు ఇంకా గుర్తుంది. హింస అనేది ఏ రూపంలో ఉన్నా అది తప్పు. మతం పేరుతో జరిగే ఎటువంటి హింస అయినా ఒక పెద్ద పాపం అని నేను నమ్ముతాను. నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే. కానీ సోషల్ మీడియాలో చాలామంది ఈ మాబ్ లించింగ్ ని సమర్ధించడం నన్ను చాలా బాధకు గురి చేసింది.

మనలో ఏ ఒక్కరికి కూడా వేరొకవ్యక్తిని చంపే హక్కు లేదు. ఒక మెడికల్ గ్రాడ్యుయేట్గా అందరి జీవితాలు సమానం, ప్రతి ఒక్కరి జీవితం కూడా ముఖ్యం అని నమ్ముతాను.ఒక బాలుడు/బాలిక పెరిగ పెద్దవారయ్యే క్రమంలో తమయొక్క గుర్తింపుని బట్టి భయపడే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. కనీసం అలాంటి రోజుల్లోకి మనం దిగజారిపోకూడదని ప్రార్థిస్తాను.పద్నాలుగు సంవత్సరాల నా స్కూల్ జీవితంలో ప్రతిరోజూ స్కూలుకి వెళ్ళి భారతీయులందరూ నా సహోదరులు సహోదరీలు, నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వసంపద నాకు గర్వకారణం అని పాడాను. దీన్ని నేను మనసావాచా స్వీకరించానేమో. చిన్నతనంలో ఎవరినీ కూడా వారి సంస్కృతిని బట్టో, కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఎప్పుడూ వేరుగా చూడలేదు. నేనెప్పుడు ఏది మాట్లాడినా న్యూట్రల్గానే మాట్లాడతాను. కాని నేను మాట్లాడినది పూర్తి వ్యతిరేకతతో అర్ధం చేసుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది.

అలాగే కొంతమంది ప్రముఖులు, ప్రముఖ వెబ్సైట్లు నేను మాట్లాడిన పూర్తి ఇంటర్వ్యూ చూడకుండా, నా భావాల వెనకున్న నిజాయితీని అర్ధంచేసుకోకుండా కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని ప్రచారం చేయడం బాధించింది. గత కొన్ని రోజులుగా నాకు సపోర్టుగా నిలబడ్డ ప్రజలకి కృతజ్ఞత చెప్పుకోవటానికి ఇది నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను.ఎందుకంటే నామీద జరుగుతున్న దాడిని బట్టి గత కొన్ని రోజులుగా ఒంటరితనాన్ని అనుభవించాను, నేనేం తప్పు చేశానా అని మధనపడ్డాను. నాకు సపోర్టుగా చాలామంది ప్రజలు తమ గొంతెత్తడం నా మనసుకి స్వాంతననిచ్చింది. నేను ఒంటరిని కాదు అని నాకు ఒక భరోసా కల్పించిన అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి జీవితాల్లో సంతోషం, సమాధానం‌ (శాంతి), ప్రేమ కలగాలని కోరుకుంటున్నాను.”

LEAVE A RESPONSE