Suryaa.co.in

Entertainment

రావే బంధకీ.. ఆ వికటాట్టహాసం ఆయనదే

నిండు పేరోలగంలో
దుశ్శాసనుడి
వికటాట్టహాసం..
పాంచాలి సావిత్రిని
కురులు పట్టుకుని ఈడ్చుకొచ్చిన క్రౌర్యం…
అనంతరం వస్త్రాపహరణం..
కిట్టయ్య వస్త్రదానంతో
రొప్పుతూ కుప్పకూలిన
మిక్కిలినేని అభినయం..
పాండవవనవాసం…!

ప్రజలకు రాజుకు మధ్య
దుర్బేద్యమైన కంచుకోటను
నిర్మించాడా శూరసింహుడు..
నా అన్న ధర్మనాయకుడు ధర్మమూర్తి..ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది..
తాను బలైపోతానని తెలిసినా అన్న కోసం కొడుకు
ఎన్టీఆర్ వెంట నడచిన
తొలితరం
బందిపోటు..!

నాయనా..సుయోధనా..
ఏరునా…వాలునా మహనీయుల జన్మరహస్యములు
మనం ఎన్నదగినవి కావు..
నీవన్నట్టు ఇది నిస్సందేహంగా క్షాత్రపరీక్షే..
క్షాత్రమున్న ప్రతివాడు క్షత్రియుడే..వారిలో రాజ్యమున్న వాడు
మాత్రమే రాజు..
అట్టి రాజులే ఈ పోటీలో పాల్గొన అర్హులు..
అదే మిక్కిలినేని
ముసలి వగ్గు
భీష్ముడి పాత్రలో
అద్భుతంగా రాణిస్తే
దానవీరశూరకర్ణ…

ఊరిపెద్ద..న్యాయమూర్తి..
దొంగ..పోలీస్..విలను..
కర్ణుడు..బలరాముడు..
ఏ పాత్ర అయినా
అలా ఇమిడిపోయి
మిక్కిలి కాకుండా
ఎంత అవసరమైతే
అంతలా నటించే
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
ఆరడుగుల నిండైన మూర్తి!

వృత్తిపరంగా పశువైద్యుడైనా మిక్కిలినేని జీవితం
కళారంగానికే నైవేద్యం..
ప్రజానాట్యమండలి వ్యవస్థాపన..
స్వరాజ్య సమరంలో
భాగస్వామ్యం..
నాటకరంగంలో పునీతం..
వెండితెరకు రాక..
నాలుగు వందల
సినిమాల ప్రస్థానం..
నటరత్నాలు..
నిరంతర రచనం..
చక్కని వచనం..
కళకు మిక్కిలి బహువచనం..
ఈ రాధాకృష్ణమూర్తి..
ఎందరో నటులకు
ఆయనో స్ఫూర్తి,.!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE