పెన్షన్..టెన్షన్

– ఒకటో తేదీ పెన్షన్ ఎవరిస్తారు?
-వాలంటీర్లను తప్పించిన ఈసీ
– పెన్షనర్ల డేటా వాలంటీర్ల దగ్గరే
– పెన్షనర్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తున్న వాలంటీర్లు
– వచ్చే నెల వారికిపెన్షన్లు ఇచ్చేదెవరు?
– పోస్టాఫీసుల ద్వారా ఇస్తారా?
-ఇప్పటిదాకా ప్రత్నామ్నాయంపైఆలోచించని ఈసీ
– సిమ్ కార్డులు స్వాధీనం చేయని వాలంటీర్లు
– మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్‌కార్డులూ వారివద్దనే
– కలెక్టర్లకు ఆదేశాలివ్వని ఈసీ
– ముందుచూపు లేని సీఈసీ

మార్తి సుబ్రహ్మణ్యం

ఏపీలో పెన్షనర్లకు టెన్షన్ మొదలయింది. ఎన్నికల కోడ్ రావడంతో వాలంటీర్లను, ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇప్పటిదాకా వాలంటీర్లే పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులిస్తున్నారు. మరి వచ్చే నెల ఒకటిన వారికి పెన్షనర్లు ఎవరిస్తారు? ప్రభుత్వమా? వాలంటీర్లా? ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఏర్పాటుచేశారా?.. ఇదీ ఏపీలో పెన్షన్ టెన్షన్.

ఎన్నికల నేపథ్యంలో అన్నీ కోడ్ నిబంధనల ప్రకారం అమలు కావలసిందే. లేకపోతే చిక్కులు తప్పవు. ఇప్పుడు ఏపీలో పెన్షనర్ల సామాజిక పించన్ వ్యవహారం, కోడ్‌లో ఇరుక్కుని వేయిడాలర్ల ప్రశ్నలా మారింది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థతో పించన్లు ముడిపెట్టారు. రాష్ట్రంలో 66 లక్షలమందికి సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. కొత్తగా 1,17,161మందికి పెన్షన్ కార్డులిచ్చారు. వీరికి ప్రస్తుతం నెలకు 3 వేల రూపాయల పించన్ ఇస్తున్నారు. వృద్ధులు, వితంతులు,ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్‌వ్తాధిగ్రస్తులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున, వాలంటీర్లే.. వారి ఇళ్లకు వెళ్లి పించను ఇస్తున్నారు. పించన్లకు సంబంధించి ఇదీ లెక్క.

అయితే ఈసీ ఆదేశాల ప్రకారం..వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు. ఆ ప్రకారంగా రేపు వచ్చే నెల ఒకటిన, యధావిథిగా వారే పించనర్లకు డబ్బులు చెల్లిస్తారా? లేదా అన్న అంశంపై ఇప్పటిదాకా ఈసీ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని మంత్రులు, ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని, సీఎం జగన్ సైతం పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్ధులు వాలంటీర్లకు బహుమతులిస్తున్నారు.

ఈలోగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై, ఈసీ చర్యల కొరడా ఝళిపిస్తోంది. డజన్ల సంఖ్యలో వారిపైచర్యలు తీసుకుంటోంది. ఒకవేళ వాలంటీర్ల చేతికే మళ్లీ పెన్షన్ డబ్బులిస్తే.. వారు ఈ డబ్బులు జగన్ ఇస్తున్నందున, వైసీపీకి ఓటు వేయమని ప్రచారం చేసే ప్రమాదం లేకపోలేదు. అంటే అది పరోక్షంగా ఎన్నికల ప్రచారం కిందే లెక్క. ఈ ప్రమాదంతోనే వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చింది. కానీ పించన్ల పెన్షన్ల చెల్లింపుపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవటం, గందరగోళానికి దారితీస్తోంది.

ఈసీ ఆదేశాలవరకైతే బాగానే ఉన్నా.. పించన ర్లు సహా ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన వ్యక్తిగత డేటా అంతా ఇంకా వారివద్దనే ఉంది. దానిని కలెక్టర్లు ఇంతవరకూ స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. ఆ రికార్డును స్వాధీనం చేయాలని అటు కలెక్టర్లు గానీ, ఇటు ఈసీ గానీ ఆదేశాలివ్వలేదు. పైగా వారివద్ద ఉన్న సిమ్ కార్డులను కూడా, ప్రభుత్వం ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోలేదు.

దానిపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. తమకు ఇప్పటిదాకా వాలంటీర్ల దగ్గర సిమ్ కార్డులు గానీ, మల్టీపర్సస్ హౌస్ హోల్డ్ కార్డులు గానీ స్వాధీనం చేసుకోవాలని ఈసీ ఆదేశాలివ్వలేదు. ఈసీ ఆదేశాలివ్వనిదే మా అంతట మేం చర్యలు తీసుకోలేం కదా అని ఒక జిల్లా కలెక్టర్ వ్యాఖ్యానించారు.

అసలు వాలంటీర్ల దగ్గర ఉన్న మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ కార్డులే కీలకమని, వాటి వివరాలు అధికార పార్టీకి ఈపాటికే చేరి ఉంటాయని ఎన్డీఏ కూటమి ఆరోపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో,వారి దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేయాలని ఆదేశించకపోవడమే ఆశ్చర్యంగా ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

కీలకమైన సామాజిక పెన్షన్లపైనయినా స్పష్టత ఇవ్వకపోవడం బట్టి…ఈసీ కీలకమైన అంశాలపైనా నాన్ సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోందన్న విమర్శలు, విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఇచ్చిన ఫిర్యాదులపైనే స్పందించని ఈసీ.. కీలకమైన పెన్షన్ల చెల్లింపుపైనా, ప్రతామ్నాయం ఏర్పాటు చేయకపోవడంపై విస్మయంవ్యక్తమవుతోంది.

దీనితో అసలు ఒకటిన పెన్షన్లు ఎవరిస్తారు? మునుపటిలా వాలంటీర్లే ఇస్తారా?లేక పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ఒకవేళ గతంలోమాదిరిగా పోస్టాఫీసుల నుంచి చెల్లించాలని భావిస్తే, ఆర్ధిక శాఖకు ఈపాటికే ఆదేశాలిస్తేనే,చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉద్యోగ సంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి వచ్చిన నగదును, వాలంటీర్లు పించనర్లకు ఇస్తున్నారు.ఇప్పుడు అది కుదరదు. కాబట్టి పెన్షన్లు ఏ రూపంలోచెల్లిస్తారన్న దానిపై స్పష్టత లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అదికాకుండా మునుపటి మాదిరిగా వాలంటీర్లే ఇస్తారని నిర్ణయిస్తే, ఆ విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తే, పెన్షనర్లలోఎలాంటి ఆందోళన ఉండదని ఉద్యోగ సంఘనేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఈసీకి ముందుచూపు లేకపోవడంపైనే విస్మయం వ్యక్తమవుతోంది.

One thought on “పెన్షన్..టెన్షన్

Leave a Reply