మరిన్ని మల్టీస్టారర్లు వచ్చేనా..!?

రాజమౌళి రాజేసాడా..
తెర దించేసాడా..!

ఇది మంచికా..చెడుకా..
చేసింది రాజమౌళి..
చూసింది అశేష జనవాహిని..
చొక్కాలు చింపుకొని..జేబులకు చిల్లులు పెట్టుకుని మరీ చూసిన అభిమానులు ఇప్పుడు తీరిగ్గా నాల్కలు కరుచుకుంటున్నారు.
అభిమానులంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నమాట.ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అదే ప్రపంచవ్యాప్తంగా తమ హీరో ఎన్టీఆర్ కు అవమానం జరిగిపోయిందని మదనపడిపోతున్నారు..రాజమౌళిపై మండిపడుతున్నారు..

నిజానికి తారక్ అభిమానులంటే ప్రత్యేకంగా ఆయనకే అభిమానులని కాదు..నందమూరి ఫ్యామిలీ అభిమానులన్న మాట..పూర్వం రామారావు..నాగేశ్వర రావు..కృష్ణ..శోభన్ బాబు..ఇలా ఈ పెద్ద హీరోలు నలుగురికీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారు.అంతే స్థాయిలో అభిమాన సంఘాలు కూడా ఉండేవి.చిరంజీవి వచ్చిన తర్వాత ఆయనకు యువతరంలో పెద్ద క్రేజ్ వచ్చేసి లెక్కకు మించి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.దానాదీనా హీరోల అభిమాన సంఘాలు వారి కుటుంబ అభిమాన సంఘాలుగా మారిపోయాయి.హీరోల ఫ్యామిలీ నుంచి ఎవరు తెరంగేట్రం చేసినా వారి అభినయం ఎలా ఉంటుందో తెలియక ముందే అభిమాన సంఘాలు పుట్టేసి…పుట్టని హీరోకి బారసాల చేసేస్తారు.అలా నందమూరి ఫాన్స్..అక్కినేని ఫ్యామిలీ అభిమానులు..కృష్ణ కుటుంబ శ్రేయోభిలాషులు..అందరినీ మించి మెగా ఫ్యామిలీ ఫాన్స్..ఇదీ వరస..

సరే..ఇప్పుడు మళ్లీ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు జరక్కూడని అన్యాయం జరిగిపోయిందని ఆయన అభిమానులు గగ్గోలు పెట్టేస్తున్నారు..ఫ్యాన్స్ ఆలోచన ఎలా ఉన్నా విడుదలకు ముందు,తర్వాత కూడా ఇంత హడావుడికి కారణమైన పానిండియా మూవీ ఇప్పుడు తాజాగా పెద్ద వివాదానికి కేంద్రబిందువైంది.

నిజానికి ఇలా ఇద్దరు హీరోలు..స్టార్స్ తో సినిమా తీసేటప్పుడు రెండు పాత్రలనూ బ్యాలన్స్ చేస్తూ రావడం కష్టమే..జక్కన్న ఆ విషయంలో తాను సక్సెస్ అయినట్టు చెప్పాలని అనుకున్నా ఆయన ఎంచుకున్న స్టోరీ లైన్ అందుకు అనుమతించదు.

ఎంత కల్పిత కథ అయినా ఇలాంటి పాత్రలను ఎన్నుకున్నప్పుడు రచయితకు గాని..దర్శకుడికి గాని అనుకున్నంత స్వేచ్చ ఉండదు.అలా రాజమౌళి తనకు తెలియకుండానే ఒక చట్రంలో ఇరుక్కుపోయాడు.ఇక్కడ రాజమౌళి ఆలోచించలేదో..లేక తన మాయాజాలంతో మానేజ్ చేసేయవచ్చు అని ధీమా పడ్డాడేమో గాని పాత్రల్లోనే ఆ తేడా ఉంది..

రామ్ చరణ్ కు ఇచ్చిన అల్లూరి సీతారామరాజు పాత్ర విశ్వవిఖ్యాతమైనది.
ఇక్కడ కొమరం భీమ్ ను తక్కువ చెయ్యడం కాదు గాని సీతారామరాజుతో పోలిస్తే కొమరం గ్లామర్ తక్కువే..అదీగాక ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా పోషించడం..రామారావు కూడా ఆ పాత్రపై విపరీతమైన మక్కువ కలిగి సినిమా తియ్యాలని అనుకోవడం,ఆ కోరిక తీరకపోయినా సర్దార్ పాపారాయుడు..మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాల్లో సీతారామరాజు వేషం వేయడం వంటి పరిణామాలతో సగటు సినిమా ప్రేక్షకుల్లో కూడా సీతారామరాజు అంటే ఓ లెవెల్..సినిమా ఫీల్డ్ లో కొమరం భీమ్ కు ఆ స్థాయి లేదు..సో..పాత్రల కేటాయింపులోనే తేడా జరిగిపోయింది..ముందే చెప్పినట్టు దానిని ఎంతగా మేకప్ చేద్దామనుకున్నా ప్రయోజనం లేకపోయింది..చివరికి జూ.ఎన్టీఆర్ గొప్ప అభినయం కూడా దానిని అధిగమించలేకపోయింది.
పైగా ఇద్దరి కథలను ఒకటి చేసిన తర్వాత ఎన్టీఆర్ పాత్ర మరీ పలచనైపోయిందని ఆయన అభిమానుల ఆవేదన.సీతారాములను కలిపే ఆంజనేయుడిగా..
అసలు స్వతంత్ర పోరాట యోధుడి పాత్రగా కనిపించ లేదని వారి ఆక్రందన..
ఇక్కడే..జక్కన్న దొరికిపోయాడు.
ఎన్టీఆర్ పై రామ్ చరణ్ కూర్చోవడం నందమూరి అభిమానులకు మరీ మోయలేనంత బరువుగా మారిపోయింది. కథ అలా నడిచింది కదా అని సర్ది చెప్పుకున్నా నందమూరి ఫ్యాన్స్ రాజీ పడేదేలే..
నటించిన ఎన్టీఆర్ ఒప్పుకుని చేసినా అభిమానులు ఒప్పరు..ఇప్పుడిక ఈ చిచ్చు అలా కొన్నాళ్ళ పాటు కొనసాగుతూనే ఉంటుంది..

ఈ సందర్భంగా ఓ విషయం ప్రస్తావనార్హం.
షోలే సినిమాలో అమితాబ్ భుజాలపై ధర్మేంద్ర కూర్చున్నా జనాలు ఇలా గగ్గోలు పెట్టలేదు..పోనీ అమితాబ్..ధర్మేంద్ర ఏమైనా మామూలు హీరోలా..ఇద్దరూ సూపర్ స్టార్లే..వాస్తవానికి మన తెలుగులో..తమిళంలో కంటే ఒకనాడు హిందీలో మల్టీస్టారర్ సినిమాలు తెగ వచ్చాయి.ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు కూడా కలిసి ఎటువంటి భేషజాలు లేకుండా నటించేవారు..
రోటీ కపడా ఔర్ మకాన్..
అమర్ అక్బర్ ఆంథోనీ..ఇలా..!
మేరా నామ్ జోకర్ అయితే మరీనూ..రాజ్ కపూర్..
రాజేంద్ర కుమార్..
ధర్మేంద్ర..మనోజ్ కుమార్..అదే రిషి కపూర్ మొదటి సినిమా కూడా..
హిందీలో రాజ్ కపూర్..
రాజేంద్ర కుమార్.,
అమితాబ్.. శశికపూర్..,
జితేంద్ర..ధర్మేంద్ర.., అమితాబ్ బచ్చన్,
దిలీప్ కుమార్..చాలా కాంబినేషన్లు..నాగిన్ సినిమాలో చాలా మంది హీరోలున్నా చివరికి సునీల్ దత్ హీరోగా నిలుస్తాడు.
పెద్ద హీరోలు పాత్రల నిడివి..ప్రాధాన్యత ఇత్యాది వ్యవహారాలు పట్టించుకోకుండా కలిసి నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అభిమానులకు అందించారు.హాలీవుడ్ కూడా అదే సంప్రదాయాన్ని
కొనసాగించి కళాఖండాలను ఇచ్చింది..

తెలుగు తెర కూడా తొలి రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలకు వేదికైంది..
ఎన్టీఆర్.. ఏఎన్నార్ కలిసి నటించి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు.పాత్రలను బట్టి మాయాబజార్లో నాగేశ్వరరావు,రామారావు కాళ్ళకి దన్నం పెట్టాడు కూడా..గుండమ్మకథ తర్వాత ఇద్దరు అగ్రహీరోల మధ్య గ్యాప్ వచ్చినా రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ చాణక్యచంద్రగుప్త..,రామకృష్ణులు..,సత్యం..శివం సినిమాల్లో నటించారు ఇద్దరు మహానటులూ..!

తర్వాతి తరం అగ్రహీరోలు కృష్ణ..శోభన్..కృష్ణంరాజు..ఈ ముగ్గురిలో ఎవరో ఓ ఇద్దరి కాంబినేషన్లో సినిమాలు వచ్చినా అవి కూడా తొలిరోజుల్లో బానే సాగాయి.రామారావు..నాగేశ్వర రావు తరంలో ఆ ఇద్దరు హీరోలతో కలిసి ఎక్కువగా జగ్గయ్య..అపై కాంతారావు.. హరనాథ్,రామకృష్ణ..
కృష్ణ..శోభన్..కృష్ణంరాజు..మురళీ మోహన్.. చంద్రమోహన్..ఇలా చాలా కాంబినేషన్లు..!
తదనంతర కాలంలో హీరోలకు ఇగోలు పెరిగాయో..అభిమానుల అభిప్రాయాలకు విలువ ఎక్కువైందో గాని పెద్ద హీరోలకు ఒకే నిడివి..ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చేది.పాటలు..
ఫైట్లు ఒకే స్ధాయిలో ఉండాల్సిందే..ఒకవేళ కథను అనుసరించి ఇద్దరు హీరోలు కొట్టుకోవలసి వేస్తే ఇటో దెబ్బ పడితే అటో దెబ్బ పడాల్సిందే..అలాంటి పోకడల వల్ల ఔచిత్యం దెబ్బ తింటున్నా ఆ తరహా అవాంఛనీయ బ్యాలెన్సింగ్ దర్శకులకు తప్పేది కాదు..
దాసరి నారాయణ రావు..రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకులకు కూడా
ఈ ఫీట్ అనుభవమే…
రామారావు,నాగేశ్వర రావు..,కృష్ణ..శోభన్ కాంబినేషన్లు మాత్రమే గాక ఏయెన్నార్..కృష్ణ..లేదా ఎన్టీఆర్..కృష్ణ వంటి తరాల అంతరాలున్న హీరోల సినిమాలకూ ఇదే బాధ..
దర్శకులకు ఇరకాటమే..!
అటు తర్వాత చిరంజీవి..బాలకృష్ణ..నాగార్జున..వెంకటేష్..ఈ నలుగురిలో ఏ ఒక్కరూ తమ నలుగురిలో మరో హీరోతో కలిసి నటించలేదు.. చిరంజీవి ముందు తరం అగ్ర హీరోలు నలుగురితోనూ తెర పంచుకున్నారు.నాగార్జున కృష్ణతో..,బాలకృష్ణ నాగేశ్వర రావుతో..శోభన్ బాబుతో..ఇలా కొన్ని జోడీలు కుదిరాయి గాని చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆయా కాంబినేషన్లలో సినిమాలు రాలేదు.
కారణాలు ఏవైనా గాని మొత్తానికి మల్టీస్టారర్ సినిమాల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన
ఈ మధ్యనే కొంత తొలగి ఇటీవలి కాలంలో మళ్లీ హీరోలు కలిసి పని చేయడం మొదలైంది..
ముఖ్యంగా వెంకటేష్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు.ఆయన మహేష్ బాబు..పవన్ కళ్యాణ్ కాంబినేషన్లలో సినిమాలు చేశారు.
రాజమౌళి ప్రభాస్.. రానా తోడుగా బాహుబలి తీసి సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా రానా విలన్ పాత్రలకు కూడా సిద్ధపడి ఈ మధ్యనే పవన్ తో కలిసి భీమ్లా నాయక్
heros చేశారు.చిరంజీవి కూడా ఇతర హీరోలతో చెయ్యడానికి సిద్ధ పడుతున్నారు.ప్రధానంగా మళయాళ సినిమాలు రీమేక్ చేస్తున్నప్పుడు ఇద్దరు హీరోల కథలు ఎంచుకుంటూ పెద్ద తారలు ఇతర హీరోలతో కలిసి నటించేందుకు ఓకే చెబుతున్నారు.ఇలా మల్టీస్టారర్ సినిమాలు హీరోల కలయిక కోసమని కాకుండా కథను అనుసరించి వస్తే అది మంచి పరిణామమే.అభిమానులకు అవసరమైన జోష్ లభిస్తుంది.

ఇదంతా ఇలా ఉంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇప్పుడిప్పుడే
రాజుకున్న వివాదం మరీ పెరక్కుండా..హీరోలు..ముఖ్యంగా వారి అభిమానుల మధ్య పొరపొచ్చాలు రాకుండా ఉంటే రానున్న రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలు పెరిగి ప్రస్తుతం తెలుగు సినిమాని కమ్మేస్తున్న మొనాటనీ అనే జాడ్యం నుంచి అభిమానుల మాటేమో గాని సగటు ప్రేక్షకుడు తప్పించుకో గలుగుతాడు..
అన్నీ బాగుంటే రానున్న రోజుల్లో బాలకృష్ణ..మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉంటుంది..ఇంకా మరికొంత మంది హీరోలు కలిసి చేస్తూ ఒకనాటికి చిరంజీవి..
బాలకృష్ణ వంటి అరుదైన కాంబినేషన్ కూడా కళ్ళ చూసే రోజు రావచ్చు..
అయితే ఇలాంటి కలలు నెరవేరడానికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్..ప్రారంభమే అవుతుందో..ఇప్పటికే రాజుకున్న వివాదం మరీ ముదిరి చరమగీతమే..గతమే అవుతుందో సమీప రోజులే చెప్పనున్నాయి..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply