Suryaa.co.in

Entertainment

నవ్వు ఆయన పెన్నులో పూచిన పువ్వు..

నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవడం ఒక రోగం!

ఇదీ హాస్యంపై
జంధ్యాల కమిట్మెంట్..
కామెడీ ఆయన మార్కు..
అదే ఆయన స్పార్కు..
ఆయన ప్రతి సినిమా
ఓ నవ్వుల పార్కు…!

పురోహితుడికి నత్తి..
మనకి భక్తి పనికిరావమ్మా..
శంకరాభరణంలో
వేశ్యోక్తి..

కొత్త కొత్త రాగాలు కట్టాను..
కనిపెట్టాను..
ఓ నవతరం
సంగీతం మాస్టారి యుక్తి..

అమ్మా..ఈ బూచాడి దగ్గర
నేను పాఠం నేర్చుకోనమ్మా…
శిష్యురాలి విరక్తి..

మా నాన్నకి
ఇద్దరు భార్యలండి..
సన్నివేశంలో
నీకు ఇద్దరు భార్యలు..
మొదటి భార్య పోయింది
కాదండీ నేను..
నేను పోయాను..
క్లయింటు చలోక్తి..
పార్టీ బజారుకెళ్ళింది..
పోయిన వకీలు భుక్తి..!

ఇలాంటి మాటలు రాయగలిగేది
జంధ్యాల మాత్రమేనన్నది
ఆర్యోక్తి..!

వేటగాడు సినిమాలో..
రాజుగారి పెద్ద కొడుకు
బెస్టుగా ఫస్టు క్లాసులో
పాసయ్యాడని.. బావుండదని గెస్టుగా ఫీస్టుకి
పిలిచి హోస్టుగా నేనుండి..
ఈ డైలాగే ఓ ఠావు..
గుక్క తిప్పకుండా చెప్పిన
రావు గోపాలరావు…
కైకాలకు చచ్చేంత చావు..
ఇది జంధ్యాల
కలం పెట్టిన చాకిరేవు..!

సున్నితమైన హాస్యానికి
జంధ్యాల పెట్టింది పేరు..
కామెడీనే ఆయన కలం పేరు
ఆయన సినిమాలన్నీ కలిపితే
అదే ఓ నవ్వుల కాసుల పేరు!

సుత్తి జంట..
జంధ్యాల పంట..
సుత్తి అనే పదానికి
ఓ బ్రాండు హోదా..
ఆయన టైమింగుకే
జనం ఫిదా..
నిర్మాతలకు బోలెడంత ఫాయిదా..!

చంటబ్బాయిలో చిరు కూడా
పండించాడు కామెడీ..
చార్లీ చాప్లిన్ కే పేరడీ..
పుత్తడిబొమ్మ పూర్ణిమను
ముద్దమందారంగా దిద్ది..
రెండు రెళ్లు ఆరు అనే
కొత్త నవ్వుల లెక్క కట్టి..
విజయశాంతి జీవితంలో
పడమటి సంధ్యారాగం
పలికించి..మల్లెపందిరి వేసి
జంధ్యాల చేసేసాడు నవ్వులగోల..హాస్య హేళ!

అక్కినేనిని అమరజీవి చేసి
గిరీష్ కర్నాడ్ తో
ఆనందభైరవి పలికించి
ఆ ట్రెండూ ట్రై చేసినా
నవ్వే జంధ్యాల బ్రాండు..
సున్నితమైన సంభాషణలకు
పట్టుగొమ్మ ఆయన మైండు..
కళాత్మక సినిమాల తపస్వి
విశ్వనాధునికి
ఆయన మంచి ఫ్రెండు..
అరగుండు బ్రహ్మానందం
ఈ దర్శకరచయిత
బెస్టు ఫైన్డు..!

నవ్వుతూ బ్రతికాడు..
నవ్వును బ్రతికించాడు..
నవ్వును ప్రేమించే మనిషి
ఏడిపించి అకస్మాత్తుగా
వెళ్లిపోయాడు..
నేడు జంధ్యాల వర్ధంతి

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE