ఆయనే ఒక సినిమా..

బక్క పలచని ఆ వ్యక్తి
సినిమా గతినే తిప్పేసిన
ఓ మహాశక్తి..
హిందీ..తమిళ..తెలుగు భాషల్లో తొలి టాకీలు..
ఆలం ఆరా.. కాళిదాసు..భక్తప్రహ్లాద..
మూడింటిలో నటించి
కొట్టాడు బోణీ..
విజయా పతాకాన్ని కూడా
తొలిసారిగా ఎగరేసి
కొట్టించాడు హిట్టు…
షావుకారుతో
మొదలెట్టి షికారు..
సంసారం అదరగొట్టేసి
మిస్సమ్మనూ విజయపధంలో నడిపిన మెస్సయ్య.. ఎల్వీప్రసాద్..!

పల్లెటూరు గుడారాల్లో
ఫిలిం ముక్కలు చూసి
సినిమాపై ఆసక్తి పెంచుకున్న
అక్కినేని లక్ష్మీ వరప్రసాద్..
బొంబాయి చేరి
మొదలు పెడితే సినీప్రస్థానం
హిట్టే అయింది
ఆయన నిజస్థానం..!

మనదేశం..ఈ సినిమాతో
ఎన్టీఆర్ పరిచయం..
ఓ చరిత్ర..
ఎల్వీ ఇస్తే
ఇనస్పెక్టర్ అవకాశం
ప్రదర్శించి ఆవేశం..
ఆనాడే వేశాడు
తనదైన ముద్ర..
ప్రసాద్ తో కొనసాగిస్తూ
వీడిపోని బంధం..
‘ఆనంద’మూరి
తారక రామారావు!

సినిమా పురస్కారాలు
అన్నిటినీ సంచిలో దోపేసుకున్న పెద్దాయన
సేవారంగంలోనూ
ఉత్తుంగతరంగం..
మూవీలతో నేత్రానందం..
ఆస్పత్రితో నేత్రదానం..
స్టూడియోతో..ల్యాబ్ తో
నిరంతరం సినిమా రంగంతో
అనుసంధానం..
బ్రతుకు ఇచ్చిన పరిశ్రమకే
ధారపోసిన శ్రమ..
తాను వెళ్ళినా ఎందరి
కళ్లతోనో జగతిని చూస్తున్న దార్శనికుడు..దిగ్దర్శకుడు..
ఈ అమావాస్య చంద్రుడు!
ఎల్వి ప్రసాద్ వర్ధంతి

ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply