Home » జగన్ ‘పుష్ప’విలాసం

జగన్ ‘పుష్ప’విలాసం

– ఎన్డీయేకు 240 సీట్లు దాటకూడదని ప్రార్ధించాలన్న జగన్
-అప్పుడు వైసీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమట
– విశాఖస్టీల్ ఉద్యోగ నేతలతో జగన్ మనసులో మాట
– గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్
– ప్రత్యేక హోదా సాధిస్తానన్న వాగ్దానం
– మన మద్దతు అవసరం లేదు కాబట్టి మౌనంగా ఉన్నామని మాటమార్చిన వైనం
– ఇప్పుడు మళ్లీ పాతపాటనే పాడుతున్న జగన్
– అంటే బీజేపీతో వైసీపీ తెరచాటు దోస్తానా నిజమేనా?
– అందుకేనా ఏపీలో కేంద్రం దూకుడు పెంచడం లేదా?
– డీజీపీ, సీఎస్ బదిలీల ఆలస్యం వెనుకా ఇదే కోణమా?
– జగన్ వ్యాఖ్యలతో తలపట్టుకుంటున్న కమలదళం
– బీజేపీ-వైసీపీ బంధం నిజమేననుకునే ప్రమాదంపై ఆందోళన
( మార్తి సుబ్రహ్మణ్యం)

బొప్పూడి సభలో ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్ సర్కారును ఎందుకు విమర్శించలేదు?
నర్సాపురం ఎంపీ సీటు రఘురామకృష్ణంరాజుకు బీజేపీ సీటు రాకుండా అడ్డుపడ్డ బాహుబలి ఎవరు?
ఏపీలో ఇన్చార్జి డీజీపీ ఇంకా ఎందుకు బదిలీ కాలేదు?
సీఎస్‌ను మార్చాలని రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు?
డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు కేసు క్యాట్‌లో విచారణపర్వం ఎందుకు కొన‘సాగుతోంది’? పోలింగ్ వరకూ అది ఎందుకు కొనసాగుతోంది?
చంద్రబాబు-పవన్‌పై ఒంటికాలితో లేస్తున్న సీఎం జగన్.. మోదీ-బీజేపీని ఎందుకు విమర్శించడం లేదు?
మామూలుగా అయితే ఇవ న్నీ భేతాళప్రశ్నలేవీ కాదు. మెడ-మోకాలులో కాస్తంత గుజ్జున్న అందరికీ తట్టే సందేహాలే. కానీ… తాజాగా వైసీపీ అధినేత జగన్, కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు దాటకపోతే అప్పుడు వైసీపీ మద్దతుతో కేంద్రం ఏర్పాటుచేస్తుందంటూ చేసిన వాఖ్యలు.. పై సందేహాలకు సమాధానం దానంతట అదే వచ్చి తీరాలి.
మరి బీజేపీ-వైసీపీ రహస్య ప్రేమ ఇంకా కొనసాగుతోందా? రెండు పార్టీలూ ఇంకా ఢిల్లీలో దోస్తీ-గల్లీలో కుస్తీ పాలిసీ కొనసాగిస్తున్నాయా? అదే నిజమైతే ఏపీలో ‘పువ్వు’ నవ్వుల పాలవుతుంది కదా?.. ఇదీ ఇప్పుడు జగన్ వ్యాఖ్యల తర్వాత తెరపైకొచ్చిన చర్చ.

కొన్ని బంధాలు.. అనుబంధాలు దాచినా దాగవు. మనుసులో నాటుకుపోయిన ప్రేమాభిషేకం.. ఎక్కడోచోట బయటపడుతూనే ఉంటుంది. వైసీపీ-బీజేపీ బంధం కూడా అలాంటిదేనని మరోసారి బయటపడింది. కాదు.. స్వయంగా జగనన్నే బయటపెట్టారు.. బయటపడ్డారు! అదెలాగ ంటే.. జగనన్నను విశాఖ స్టీల్‌ప్లాంట్ నేతలు కలిశారు. ఇప్పటివరకూ వారి ముఖమే చూడని జగనన్న, ఎన్నికల అవసరార్ధం వారిని చూసేందుకు దయతలిచారు. సరే.. వారంతా తమ సమస్యలు ఏకరవు పెట్టుకోవడం రొటీన్‌కు భిన్నమేమీ కాదు.

అయితే మీ సమస్యలు పరిష్కరిస్తాననో, నేను మళ్లీ సీఎం అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడయినా పరిష్కరిస్తానని చెప్పాల్సిన సీఎం జగనన్న.. ‘‘ఈసారి కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు దాటకూడదని ప్రార్ధించండి. అప్పుడు వైసీపీ మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని’’ మనసులో మాట బయటపెట్టడంతో, స్టీల్‌ప్లాంట్ నేతలు అవాక్కయారట.
గతంలో కూడా జగనన్న విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.

‘‘ఏం చేస్తాం? మన ఖర్మ. మన మద్దతు అవసరం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మనమేం చేస్తాం. కాబట్టి మనం అయ్యా అని బతిమిలాడుకోవడటమే’’అని మీడియాకు చెప్పారు. ఇప్పుడు మళ్లీ జగన్ అదే రికార్డు వేశారు.

అంటే.. దీన్నిబట్టి ఎన్నికల తర్వాత కూడా, బీజేపీతో వైసీపీ బంధం కొనసాగుతుందని జగన్ చెప్పకనే చెప్పినట్లే లెక్క. బీజేపీ ఉన్న ఎన్డీఏ కూటమిలో, టీడీపీ ఇప్పటికే కొనసాగుతోంది. కాబట్టి ఎన్డీయేలో లేని జగన్ సహజంగా అయితే ఆ వ్యాఖ్యలు చేయకూడదు. అలా చేశారంటే.. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ-వైసీపీ బంధం కొనసాగుతుందని చెప్పకనే చెప్పినట్లు లెక్క.

ఇది ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు… సహజంగానే ఏపీ బీజేపీని ఇరుకునపెట్టింది. ఒకవైపు తాము జగన్ సర్కారుపై యుద్ధం చేస్తుంటే, మరోవైపు జగన్ తమ పార్టీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని చేసిన వ్యాఖ్యలు, కమలం కొంపముంచుతుందన్నది సీనియర్ల ఆందోళన. ఒకరకంగా ఇది టీడీపీ-జనసేనను ఆత్మరక్షణలో నెట్టివేసే వ్యాఖ్యలేనని, జగన్ వ్యాఖ్యలను తమ కేంద్ర నాయకత్వం ఖండించకుండా మౌనంగా ఉండటం, ఇంకా ప్రమాదకరమని తలపట్టుకుంటున్నారు.

‘ఇది టీడీపీ-జనసేన ఓట్లు బీజేపీకి బదిలీకావలసిన కీలక సమయం. మేం అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. అసెంబ్లీని వదిలేస్తే కనీసం 4 ఎంపీ సీట్లయినా గెలవాలి. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు, టీడీపీ-జనసేన కార్యకర్తలను ప్రభావితం చేస్తే మా పార్టీ అభ్యర్ధుల సంగతేమిటి? వాళ్లు ఓడిపోతే ఎవరికి పరువు తక్కువ? కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలపై మా పార్టీ సెంట్రల్ కమిటీ స్పందించాలి. లేకపోతే కూటమి వల్ల ప్రయోజనం ఉండద’’ని బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

బీజేపీ కేంద్ర నాయకత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోతే.. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే ఏ ఒక్క స్థానంలో కూడా, బీజేపీకి టీడీపీ- జనసేన ఓట్లు బదిలీ కావన్న అభిప్రాయం కూటమిలో వ్యక్తమవుతోంది. నిజానికి రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి సిద్దార్ధనాధ్‌సింగ్ దీనిపై ప్రకటన గానీ, ట్వీట్ గానీ చేయాల్సి ఉందన్నది బీజేపీ సీనియర్ల అభిప్రాయం.

‘‘సీఎం జగన్ వ్యాఖ్యలు ఖండించకపోతే.. టీడీపీ-జనసేనకు ఓటేసినా ఒకటే, వైసీపీకి ఓటు వేసినా ఒకటే. ఇద్దరూ బీజేపీ గొడుగు కిందనే ఉంటారు కాబట్టి, మళ్లీ ప్రత్యేకించి ఇక్కడ బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఏముంది అన్న భావన ప్రజల్లో ఏర్పడితే బీజేపీకి ఏపీ నుంచి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని’’ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలాగూ బీజేపీకి ఏపీలో ఏమీ లేదు కాబట్టి, కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని, ఇలాంటి వ్యాఖ్యలు ఖండించకపోవడం వల్ల నష్టపోయేది టీడీపీ-జనసేన మాత్రమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే నర్సాపురం ఎంపీ సీటు ర ఘురామకృష్ణంరాజుకు దక్కకుండా జగన్ చక్రం తిప్పారన్న ప్రచారం ఉంది. జగన్ ఒత్తిడితోనే బీజేపీ నాయకత్వం ఆయనకు సీటివ్వలేదన్న చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇన్చార్జి డీజీపీ-సీఎస్‌లను బదిలీ చేయకుండా, ఆయనే చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు కేసు జడ్జిమెంటు స్థాయి నుంచి మళ్లీ విచారణ దశకు వెళ్లి, వాయిదాల పర్వం కొనసాగడం వెనక ఏం జరుగుతోందన్న చర్చ కూడా పోలీసు వర్గాల్లో జరుగుతోంది. దీనితో ఈ ప్రచారానికి తెరదించి.. వైసీపీతో తమకు ప్రేమాభిషేకం లేదని నిరూపించుకోవడమే, తమ పార్టీ ముందున్న కర్తవ్యమని బీజేపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply