‘కమలం’లో సీట్ల కుట్రలు

– ‘కమలం’లో సీట్ల కుమ్ములాటలు
– గెలవని సీట్లు ఎవరిని గెలిపించేందుకో?
– బలం లేని విజయనగరం, విజయవాడ ఎందుకు?
– విజయనగరం బదులు రాజంపేట కావాలంటున్న సీనియర్లు
– హిందూపురం సీటుపై అగ్రనేతల కుట్రలు
– పరిపూర్ణానంద స్వామి భుజంపై సత్యకుమార్ వైపు తుపాకీ
– పరిపూర్ణ వస్తే ముస్లిములు ఓటేయరన్న ప్రచారం
– ఓ కీలకనేత రాజకీయంపై సీనియర్ల ఆగ్రహం
– కైకలూరు సోముకు వద్దంటూ అభ్యంతరం
– ‘తపన’ పడేవారికోసం ఓ కీలక నేత ప్రయత్నాలు
– టీడీపీని విమర్శించిన నేతలకు సీట్లిస్తే ఓట్ల బదిలీ ఎలా?
– గెలిచే సీట్లు కోరాలంటున్న సీనియర్లు
– లాబీయింగ్‌తో సీటొచ్చినా గెలిపించేదెవరు?
– ఏపీ కమలంలో టికెట్ పంచాయతీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీలో సీనియర్ల వైఖరి నాయకత్వానికి తలనొప్పిలా మారింది. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుని సీట్లు సంపాదించుకునే నేతలను ఎన్నికల్లో ఎవరు గెలిపిస్తారు? ఓట్ల బదిలీ ఎలా అంశం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనవసర ప్రతిష్ఠకు పోయి పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకున్న బీజేపీకి, ఆయా స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వగలిగే నేతలనే బరిలోకి దించాలని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

అందుకు భిన్నంగా ఏ పార్టీనో గెలిపించేందుకు చేస్తున్న తెరవెనుక రాజకీయాలపై కమలదళాలు కస్సుమంటున్నారు. అసలు పార్టీకి ఏమాత్రం బలంలేని, గత ంలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలను సైతం ఎంపిక చేసుకోవడం పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది.

టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీకి దక్కిన 6 లోక్‌సభ-10 అసెంబ్లీ స్థానాలను సాధించుకున్న ఆనందం బీజేపీలో కనిపించడం లేదు. జనసేన 3 అసెంబ్లీ, ఒక ఎంపీ.. టీడీపీ ఒక అసెంబ్లీ సీటును బీజేపీకి త్యాగం చేసినప్పటికీ.. ఆయా స్థానాల్లో బలమైన నేతలను బరిలోకి దించలేని పరిస్థితి బీజేపీది. ఇప్పటివరకూ టీడీపీపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించి, పరోక్షంగా వైసీపీకి సహకరించిన కొందరు నేతలు పొత్తులో సీట్లు ఆశిస్తున్నారు. అయితే పార్టీ సీనియర్లుగా సీట్లు ఆశించడం తప్పు లేదని, కానీ వారికి మిత్రపక్షమైన టీడీపీ ఓట్లు ఎలా బదిలీ అవుతాయన్న ప్రశ్న వినిపిస్తోంది.

అలాంటి వారికి సీట్లు ఇస్తే, పరోక్షంగా వైసీపీకి సహకరించినట్లేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో రాజమండ్రి సీటు కేటాయించినా మరొకరికి దానిని అమ్ముకుని పారిపోయిన నేతలు కూడా ఇప్పుడు కైకలూరు సీటు అడగటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అసలు పొత్తులో తమకు దక్కిన సీట్లను ఎంపిక చేసుకోవడంపైనే బీజేపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏకంగా విజయనగరం ఎంపీ సీటునే ఎంపిక చేసుకోవడంపై సీనియర్లలో విస్మయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అక్కడ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్, కాశిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. సెయిల్ సభ్యుడు కాశిరాజు పార్టీ అధ్యక్షురాలికి సన్నిహితుడన్న పేరుంది.

విశాఖలో ఆమెకు సంబంధించిన వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తుంటారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. రాజు పేరును ఆమెనే సిఫార్సు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ వైపు నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపి రఘురామకృష్ణంరాజు బరిలో ఉంటే, మళ్లీ మరో రాజును వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టడం వెనక ఉన్న మతలబుపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

‘ఆ సీటు మా పార్టీకి ఏమాత్రం సురక్షితం కాదు. విజయనగరంలో నిలబడితే బీసీ ఉండాలి. లేకపోతే అశోక్‌గజపతిరాజు ఉత్తమం. ఆయనకు మంచివాడన్న పేరుంది. మేం పొత్తు పేరుతో ఆ సీటు తీసుకుంటే వైసీపీ ఎంపీని మేమే గెలిపించినట్లు లెక్క’’ అని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. ఉత్తరాంధ్రలో విజయనగరం, అనకాపల్లి ఎంపీ స్థానాలు ఏమాత్రం సురక్షితం కాదంటున్నారు. విశాఖ స్టీల్, రైల్వేజోన్ వంటి అంశాలతో ముడిపడిన ఉత్తరాంధ్రలో బీజేపీ పోటీ చేయడమంటే సీట్లను పణంగా పెట్టినట్లేన ని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

విజయనగరం బదులు రాజంపేట లోక్‌సభ తీసుకోవడం సురక్షితమని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ బలంతోపాటు, బలిజ ఓటర్లు, కిరణ్‌కుమార్‌రెడ్డి బంధుత్వాలు కలసి వస్తాయంటున్నారు. గెలుపు-ఓటమిని పక్కనపెడితే, వైసీపీ అభ్యర్ధి మిథున్‌రెడ్డికి కిరణ్ గట్టి పోటీ ఇవ్వగలుగుతారని విశ్లేషిస్తున్నారు.

ఇక హిందూపురం సీటుపై తెరవెనుక జరుగుతున్న కుట్రలు పార్టీ వర్గాలను విస్మయపరుస్తున్నాయి. పార్టీ చరిత్రలో తొలిసారి మూడుసార్లు బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్, చాలాకాలం నుంచీ హిందూపురంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి నేత కూడా అగ్రనేతల కుట్రలు ఎదుర్కోవలసి రావడమే ఆశ్చర్యం. పొత్తులో హిందూపురం పేరు కూడా బలంగా వినిపించింది. అయితే పార్టీ కీలక నేత ఒకరు ఈ వ్యవహారంలో సత్యకుమార్‌కు వ్యతిరేకంగా తెరవెనుక రాజకీయాలకు తెరలేపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అందులో భాగంగా సదరు నేత.. పరిపూర్ణానందస్వామిని తెరపైకి తెచ్చారట. ఆయన వస్తే పార్లమెంటు పరిథిలోని, రెండున్నరలక్షల మంది ముస్లిములు ఓటు వేయరన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారట. పైగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యతో కూడా అదే మాట చెప్పించారట. దీనితో హిందూపురం సీటు బీజేపీకి దక్కకుండా పోయింది. అంటే పరిపూర్ణానందస్వామి భుజంపై తుపాకి పెట్టి, సత్యకుమార్‌ను పేల్చినట్లు స్పష్టమవుతోంది. స్థానిక ఆరెస్సెస్‌లో కొందరు పరిపూర్ణను ప్రోత్సహిస్తున్నారని, ఆయనకు స్థానికంగా ఎలాంటి పరిచయాలు లేవని హిందూపురం బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇక విజయవాడ సీటు కోరడంపైనా విస్మయం వ్యక్తమవుతోంది. అక్కడ తమ పార్టీ బలం లేకపోయినా సీటు కోరడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం-నగరాలు-క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఉన్న ఆ నియోజకవర్గంలో, ఏ ధీమాతో సీటు అడిగిందో తమకు అర్ధం కావడం లేదంటున్నారు. వైసీపీని అంగ-అర్ధబలంలో ఢీకొనే స్థాయి ఉన్న నేతలు తమ పార్టీలో లేరని గుర్తు చేస్తున్నారు.

మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు, కైకలూరు సీటు ఇస్తారన్న ప్రచారంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు కాకుండా రాజమండ్రి నుండి వచ్చిన వీర్రాజుకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘వీర్రాజు టీడీపీకి వ్యతిరేకి అన్నది అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఆయనకు సీటిస్తే టీడీపీ ఓటు మాకు ఎలా బదిలీ అవుతుంది? ఆరకంగా ఆ సీటును వైసీపీకి అప్పగించడమే కదా’ అని కృష్ణా జిల్లా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కాగా ఏలూరు ఎంపీ సీటు కోసం ‘తపన’ పడుతున్న ఓ కమ్మ వర్గ నేత, అక్కడ కుదరకపోతే కైకలూరు అసెంబ్లీ సీటు కావాలని కోరుతున్నారట. అయితే స్థానికంగా పనిచేయకుండా సంఘ్ పెద్దల అవసరాలు తీరుస్తూ, ఫ్లెక్సీలతో రాజకీయం చేస్తే టికెట్ ఇస్తారా? అని స్థానిక బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన తాను చాలాకాలం నుంచి సంఘ్‌ను పోషిస్తున్నానని, వారి కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నానని ప్రచారం చేసుకోవడంపై నాయకత్వం ఆగ్రహంతో ఉందట.

ఇక పార్టీ కోరుతున్న ఆదోనిలో గతంలో బీజేపీకి 3854 ఓట్లు, అనపర్తిలో 627 సీట్లు, బద్వేలులో 735 ఓట్లు, జమ్మలమడుగులో 536 ఓట్లు, ధర్మవరంలో 622 ఓట్లు, విజయవాడ వెస్ట్‌లో 4206 ఓట్లు, కైకలూరు లో 1701 ఓట్లు, పాడేరులో 4631 ఓట్లు, వైజాగ్ నార్త్‌లో 18790 ఓట్లు, శ్రీకాకుళంలో 1340 ఓట్లు పోలయ్యాయి. నాలుగు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ, బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. గతంలో గౌరవప్రదమైన ఓట్లు వచ్చింది ఒక్క విశాఖ నార్త్‌లోనే. వీటిలో పొత్తు కింద విష్ణుకుమార్‌రాజు, కామినేని శ్రీనివాస్ బరిలో ఉంటే వారిద్దరే గెలుపు గుర్రాలుగా కనిపిస్తున్నారు.

జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి బలమైన నేత అయినప్పటికీ, ఆయన కుటుంబసభ్యులే ఆయనకు సహకరించకపోవడం ఇబ్బందికరంగా మారింది. విజయవాడ వెస్ట్ గత టీడీపీ-బీజేపీ పొత్తులోనే బీజేపీ ఓడిపోయింది. అప్పుడు ఆర్ధికంగా వెల్లంపల్లి శ్రీనివాస్ బలంగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థాయి నేతలెవరూ భూతద్దం వేసినా కనిపించడం లేదు. అయినా ఆ సీటు కోసం బీజేపీ రాష్ట్ర నేతలు పట్టుపట్టడంపై ఆశర్చం వ్యక్తమవుతోంది.

ఇక ఎంపీలలో అంగ-అర్ధబలం ఉన్న పురందేశ్వరి, సుజనా చౌదరి, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డిని.. వైసీపీకి పోటీ ఇవ్వగలిగే నియోజకవర్గాలను ఎంపిక చేసి బరిలో దింపితే వీరిలో ముగ్గురు ఖాయంగా గెలుస్తారంటున్నారు. మరో ఇద్దరు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఇవ్వగలరంటున్నారు. వీరిలో సత్యకుమార్‌కు ఆర్గనైజేషన్ సంబంధాలు ఎక్కువగా ఉండగా, రఘురామకృష్ణంరాజు సిట్టింగ్ ఎంపీగానే ఉన్నారు. అవసరమైతే జనసేన దళపతి పవన్‌తో చర్చించి.. ఆ పార్టీ కోటాలోని బందరు, కాకినాడ ఎంపీ స్థానాలు కూడా తీసుకొని, గెలవని ఉత్తరాంధ్ర స్థానాలను టీడీపీకి ఇచ్చి, వాటి బదులు గెలిచే కోస్తా, సీమలో పోటీ చేస్తే ఫలితాలు వస్తాయంటున్నారు.

కాగా రాజంపేటలో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇవ్వకపోతే సీఎం రమేష్‌కు ఇచ్చినా గట్టి పోటీ ఇవ్వగలరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి, మిథున్‌రెడ్డి లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే సీఎం రమేష్ వంటి బలమైన నేత బరిలో ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. సీఎం రమేష్‌కు చిత్తూరు-కడపలో సత్సంబంధాలున్నాయని గుర్తు చేస్తున్నారు.

Leave a Reply