Suryaa.co.in

Editorial

ట్యాపింగ్‌ చిక్కుల్లో సీతారామాంజనేయులు?

– ఆధారాలు బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
– తాను మాట్లాడిన ఆడియోను ఇంటలిజన్స్‌ చీఫ్‌ పంపించారని వెల్లడి
– 9849966000 నెంబరు నుంచి వచ్చిన ఆ ఆడియో క్లిప్‌
– ట్యాపింగ్‌ చేయకపోతే ఆ ఆడియో క్లిప్పింగ్‌ ఎలా వచ్చిందన్న కోటంరెడ్డి
– ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లూ ట్యాపింగ్‌ అవుతున్నాయా?
– హైకోర్టు సీజే, ఐఏఎస్‌, ఐపిఎస్‌, జడ్జిల ఫోన్లూ ట్యాప్‌ చేస్తారా అన్న కోటంరెడ్డి
– వైసీపీ అసంతృప్తుల ఫోన్లూ ట్యాపింగ్‌ అవుతున్నాయా?
– అది ట్యాప్‌ కాదు కాల్‌ రికార్డింగ్‌ కావచ్చన్న మంత్రి అమర్నాధ్‌
– మంత్రి వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేలలో మరో కల్లోలం
– వాలంటీర్లు, వైసీపీ మీడియా నిఘాతో ఇప్పటికే ఎమ్మెల్యేల్లో అసహనం
– కోటంరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే కల్లోలమే
– కోటంరెడ్డి కోర్టుకు వెళితే నిఘా దళపతి పీఎస్సార్‌కు చిక్కులు తప్పవా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ నిఘా దళపతి పీఎస్సార్‌ ఆంజనేయులును చిక్కుల్లో పడేస్తుందా? నెల్లూరు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌లో పీఎస్సార్‌ ఉన్నారంటూ వెల్లడించిన వైనం, పోలీసు-రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. తమ ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయంటూ.. ఇప్పటికే మరో వైసీపీ సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపించిన నేపథ్యంలో, అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇది చాలదన్నట్లు.. అది ట్యాపింగ్‌ కాదు.. కాల్‌ రికార్డు కావచ్చంటూ మంత్రి గుడివాడ అమర్నాధ్‌ చేసిన వ్యాఖ్య వైసీపీలో కొత్త కల్లోలానికి దారితీసింది.

తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతున్న వైనాన్ని, ఆధారాలతో నిరూపిస్తానన్న నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. చివరకు అన్నంతపని చేశారు. తాను తన బాల్యమిత్రుడితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, ఇంటలిజన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు తనకు ఫోన్‌ చేశారని, కోటంరెడ్డి మీడియాకు వెల్లడించారు. తన మిత్రుడితో తానేం మాట్లాడానో ఆ ఆడియో క్లిప్పింగ్‌ను 9849966000 ఫోన్‌ నెంబరు ద్వారా, తనకు పంపించారన్న బాంబు పేల్చారు. అంటే ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేయకపోతే, తన ఆడియో క్లిప్పింగ్‌.. పీఎస్సార్‌ ఎందుకు పంపిస్తారన్న లా పాయింట్‌ తీయడం.. ట్యాపింగ్‌ ఆరోపణలను నిజం చేసినట్టయింది. ప్రధానంగా ఇదే అంశంపై మాజీ మంత్రి ఆనం ఆరోపణలు కూడా, నిజమనుకునే పరిస్థితి ఏర్పడింది.

తన ఫోన్‌ ట్యాప్‌ చేసిన వైనాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని, కోటంరెడ్డి వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. నిజంగా కోటంరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, నిఘా దళపతి పీఎస్సార్‌ మరిన్ని చిక్కులు ఎదుర్కోక తప్పదని, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంలో కోటంరెడ్డి ఎంచుకునే రెండు మార్గాలూ, ప్రమాదకరమేనంటున్నారు. కోటంరెడ్డి తాను కేంద్ర హోంశాఖకు, ఈ వ్యవహారాన్ని ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కేంద్ర హోం శాఖ నుంచి వారం రోజుల్లో స్పందన రాకపోతే, కోర్టు గడప ఎక్కక తప్పదని చెప్పారు.

ఒకవేళ కోర్టులో కోటంరెడ్డి రిట్‌ పిటిషన్‌ వేస్తే.. నిఘా దళపతి పీఎస్సార్‌ చిక్కుల్లో పడక తప్పదని, న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. కోటంరెడ్డి తన వద్ద ఉన్న ఆధారం కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో, పీఎస్సార్‌ ఫోనును సీజ్‌ చేసి, అందులోని వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించవ చ్చని న్యాయవాదులు చెబుతున్నారు.

ఆ ఫోన్‌లోని అన్ని వివరాలు రికార్డు చేసి, అవి ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయా? లేవా? అని నివేదిక కోరే అధికారం, కోర్టుకు ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలాఉండగా.. సీనియర్‌ ఐపిఎస్‌ అధికారితోపాటు, అన్ని రంగాల్లో నిష్ణాతుడిగా పోలీసు వర్గాల్లో పేరున్న పీఎస్సార్‌.. ఒక ఎమ్మెల్యేకు ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్‌ను, తిరిగి ఆయనకే పంపించడంపై ఐపిఎస్‌ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

బహుశా మిగిలిన వారి మాదిరిగానే కోటంరెడ్డిని కూడా బెదిరించే వ్యూహంలో భాగంగానే, పీఎస్సార్‌ ఆ పని చేసి ఉండవచ్చని, కోటంరెడ్డి ఈవిధంగా ప్రెస్‌మీట్‌ పెట్టి తన పేరు వెల్లడిస్తారని పీఎస్సార్‌ ఊహించి ఉండకపోవచ్చని, మరికొందరు ఐపిఎస్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. పోలీసు శాఖలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన పీఎస్సార్‌, ఈవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు దొరికిపోవడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమయింది.

తాజా ఫోన్‌ ట్యాపింగ్‌ పరిణామాలు అటు అధికార పార్టీనీ, ఇటు పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. మంత్రి అమర్నాధ్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ‘‘అవి ట్యాప్‌ కాదు. రికార్డింగ్‌’’ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రజాప్రతినిధుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తమ అందరి ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయన్న అనుమానం అధికారపార్టీ ఎమ్మెల్యేలలో లేకపోలేదు.

ఒకవైపు వాలంటీర్లు, ఇంకోవైపు అధికార పార్టీ మీడియా తమపై నిఘా పెడుతున్నారన్న అసంతృప్తితో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు, తాజా పరిణామాలు షాక్‌ నిచ్చాయి. తమపై ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమేనన్న విషయం, కోటంరెడ్డి విషయంలో నిజం కావడమే దానికి కారణం. గత కొంతకాలం నుంచీ ఇలాంటి అభద్రతాభావంతో ఉన్న ఎమ్మెల్యేలు, తాజా పరిణామాలతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒక ఎమ్మెల్యేకు నేరుగా నిఘా దళపతి ఫోన్‌ చేసి, మీరేం మాట్లాడుతున్నారో ఫోన్‌ రికార్డు పంపించారంటే… తమ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఫోనుకు రక్షణ లేదన్న విషయం స్పష్టమవుతోందని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు స్వయంగా మంత్రి అమర్నాధ్‌ కూడా ‘ అది కేవలం రికార్డింగ్‌ మాత్రమే’నని స్పష్టం చేయడంతో, ఎమ్మెల్యేల ఫోన్లు రికార్డు అవుతున్నాయని అంగీకరించడమేనంటున్నారు. ఈ సెగ ఇంకా ఎంతమందికి తగులుతుందో చూడాలి.

LEAVE A RESPONSE