నెల్లూరు ‘దేశం’లో కోటంరెడ్డి చిచ్చు!

– జిల్లా నేతలకు తెలియకుండానే కోటంరెడ్డి చేరికనా?
– మాతో మాటమాత్రం చెప్పకుండా చేర్చుకుంటారా?
– పార్టీ నేతలపై కోటంరెడ్డి పెట్టించిన కేసులు మర్చిపోయారా?
– కోటంరెడ్డి దెబ్బకు జిల్లా విడిచిపోయిన తమ్ముళ్లకు ఏం సంకేతాలిస్తున్నాం?
– ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కోటంరెడ్డి బాధితులు
– జిల్లా నేతలకు నాయకత్వం ఇచ్చే విలువ ఇదేనా?
– కార్యకర్తల అభిప్రాయాలతో పార్టీకి పనిలేదా?
– ఎవరికీ తెలియకుండా కోటంరెడ్డికి ఎలా సీటిస్తారు?
– అజీజ్‌కు చేయిచ్చి మైనారిటీలకు ఏం సంకేతాలిస్తారు?
– కోటంరెడ్డి, ఆనం పెట్టించిన కేసులను మర్చిపోయారా?
-నేతలకు నాయకత్వం ఇచ్చే విలువ ఇదేనా?
– ఎదురుదెబ్బలు తిన్నా నాయకత్వం మారదా?
– నెల్లూరు టీడీపీలో కోటంరెడ్డి కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు…. ఒక జిల్లా ఇన్చార్జి ఉన్నారు.. సహజంగా అయితే జిల్లాకు సంబంధించిన ఏ అంశమయినా, వారి దృష్టిలో ఉండాలి. నాయకత్వం కూడా వారిని సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. అయితే.. అధికారపార్టీకి చెందిన ఓ అసమ్మతి ఎమ్మెల్యే, తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ.. ఆ విషయం ఆ జిల్లాలోని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జిలకు తెలియదు. ఇదీ పార్టీ నాయకత్వం నాయకులకు ఇచ్చే విలువ. ఇదంతా నెల్లూరు జిల్లా టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పెట్టిన చిచ్చు!

తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ.. నిఘా దళపతి పీఎస్సార్‌ ఆంజనేయులు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణాస్ర్తాలు సంధించిన, నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. పనిలోపనిగా ఇటు టీడీపీలోనూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీలో చేరుతున్నానని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు మంజూరు చేయిస్తానని, తన అనుచురులకు ముందస్తు హమీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ప్రకటనే నెల్లూరు జిల్లా టీడీపీలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది.

కోటంరెడ్డి చెప్పేవరకూ ఆయన టీడీపీలో చేరబోతున్నారన్న విషయం, ఆ జిల్లా సీనియర్లు ఎవరికీ తెలియకపోవడమే ఆశ్చర్యం. కోటంరెడ్డి బహుశా నేరుగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లేదా లోకేష్‌తోనే మాట్లాడుకుని ఉండవచ్చని సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆ విషయం కూడా తమతో నాయకత్వం మాట్లాడకపోవడాన్ని, తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. దీన్ని బట్టి ఎదురుదెబ్బలు తగిలినా, తమ నాయకత్వంలో మార్పు రాలేదన్న విషయం స్పష్టమవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే కోటంరెడ్డిని పార్టీలో చేర్చుకునే నాయకత్వం, ఆయనతో కేసులు పెట్టించుకుని.. జైలు పాలయిన కార్యకర్తలకు, ఏం సంకేతమిస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో కోటంరెడ్డి తమ పార్టీకి చెందిన ఆరుగురు నేతలపై ఆక్రమ కేసులు బనాయిస్తే, వారంతా నెలరోజుల పాటు బెయిల్‌ వచ్చే వరకూ హైదరాబాద్‌లో తలదాచుకోవలసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు సీనియర్‌ నేత తిరుమలనాయుడుపై హత్యాప్రయత్నం, కార్పొరేషన్‌ ఎన్నికలప్పుడు కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టించిన వైనం మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

కోటంరెడ్డిపై పోరాడిన కార్యకర్తలు జైల్లో ఉన్నప్పుడు, వారి కుటుంబసభ్యులు పడిన ఆవేదనను నాయకత్వం మర్చిపోయిందా? వారికి బెయిల్‌ కోసం నాయకులు పడిన ఆర్ధిక కష్టాలను, నాయకత్వం అంత సులభంగా ఎలా మర్చిపోతుందా? వారి కుటుంబసభ్యులకు పార్టీ నాయకత్వం ఇచ్చే సంకేతమేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీ కష్టకాలంలో జెండా మోసే క్రమంలో.. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కేసులు, జైలు పాలయిన కార్యకర్తల మనోభావాలు, నాయకత్వానికి పట్టకపోవడం దురదృష్టకరమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాదన్న అనుమానంతో, టీడీపీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలకు ఉన్న విలువ.. అదే నియోజకవర్గాల్లో పార్టీ సర్వం న ష్టపోయిన కార్యకర్తల మనోభావాలు నాయకత్వానికి పట్టవా అని కార్యకర్తలు నిలదీస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆనం నియోజకవర్గంలో కూడా, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించిన వైనం నాయకత్వానికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఆనం రాకవల్ల నష్టపోయే పార్టీ నేతలకు ఏం సమాధానం చెబుతారంటున్నారు.

కోటంరెడ్డికి సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు-ఎంపీలతోనే సఖ్యత లేదని, టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయనతో ఏ ఒక్క నేతకూ సరిపడని నేపథ్యంలో, ఆయనను టీడీపీలోకి ఎలా తీసుకుంటారో అర్ధం కావడం లేదని, సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకుంటే, నియోజకవర్గంలో కార్యకర్తలతో పని చేయించుకునే బాధ్యత కూడా, నాయకత్వమే తీసుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు.

నియోజకవర్గంలో చాలాకాలం నుంచి పనిచేస్తున్న ఇన్చార్జి అజీజ్‌కు టికెట్‌ ఇవ్వకుండా, వైసీపీ నాయకత్వంతో విబేధాలొచ్చి.. బయటకొచ్చిన కోటంరెడ్డికి, ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అజీజ్‌కు కాకుండా, కోటంరెడ్డికి సీటు ఇస్తే.. మైనారిటీల నుంచి వచ్చే వ్యతిరేకత పార్టీకి నష్టం కాదా? ఆ ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపై చూపించదా? అని ప్రశ్నిస్తున్నారు.