హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. మాదాపూర్‌లో శేజల్ నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్యాగ్‌లో నిద్రమాత్రలు, సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. ఇందులో పలు విషయాలను శేజల్ ప్రస్తావించారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్.. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు..
మధ్యాహ్నం 1.30 గంటలకు శేజల్‌ను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వదిలి వెళ్లగా.. టెంపుల్ నుంచి కనిపించకుండా పోయారు. ఆ తరువాత మాదాపూర్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు.