ఒక్కో బ్యాగ్ వందరూపాయలట
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)
గతంలో జయలిలత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మ పేరిట ప్రారంభించిన అనేక పథకాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అయితే ఆ పేరుతో ఇచ్చిన అనేక వస్తువులు తమిళనాడు దాటి ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లోని షాపుల్లో కనిపించాయి. అందులో ఒకటి గ్రైండర్లు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అమ్మ గ్రైండర్లు విచ్చలవిడిగా అమ్మకాలు సాగిన విషయం అప్పట్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
అచ్చంగా అలాంటి పథకానికి సంబంధించి వస్తువులే ఇప్పుడు కేరళలో విరివిగా లభిస్తుండటం చర్చనీయాంశమయింది. కేరళ గురువాయూర్‌లో షాపింగ్ కోసం వెళ్లిన మన తెలుగు అయ్యప్పస్వాములకు అక్కడి షాపుల్లో జగనన్న అత్యంత ప్రేమతో ప్రవేశపెట్టిన జగనన్న నాణ్యమైన బియ్యం బ్యాగులు కనిపించడంతో స్వాములు షాకయ్యారట. అది కూడా గురువాయూర్ దేవాలయం సమీపంలోని షాపుల్లో! అసలు సంగతేమిటో చూద్దామని లోపలికి వెళ్లి రేటెంతో కనుక్కుంటే.. సదరు షాపు యజమాని కేవలం వందరూపాయలే అని చెప్పారట. అక్కడికి వెళ్లిన తెలంగాణ అయ్యప్పస్వాములు దీనిని వీడియోలో బంధించారు.
దానితో తెలుగువాళ్లకు సహజమైన ఉత్సుకత వల్ల, ఈ బ్యాగులు ఇక్కడికెలా వచ్చాయప్పా అని అడిగితే ఏమోనప్పా.. మాకు వచ్చాయి అమ్ముతున్నాం అని చెప్పారట. ఈ జగనన్న బియ్యం బ్యాగుల అమ్మకం వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ప్రస్తుతం అక్కడే ఉన్న కొందరు
తెలుగు అయ్యప్ప స్వాములను విచారించగా ఎర్నాకులం, గురువాయూర్‌లోని చాలా షాపుల్లో జగనన్న షాపులు అమ్ముతున్నారని చెప్పారు. ఏపీలోనే కనిపించాల్సిన జగనన్న బియ్యం బ్యాగులు రాష్ట్రం దాటి కేరళకు ఎలా వెళ్లాయి? వాటికి కాళ్లొచ్చాయా? లేక బ్యాగులకు కాళ్లు ఏర్పాటుచేశారా అన్నది ప్రశ్న. మరి దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి. బహుశా.. జగనన్న అభిమానులు కేరళలో కూడా ఉన్నారని, అందువల్ల వాళ్లే ఓటీఎస్ స్కీమ్ మాదిరిగా వారంతట వారే బ్యాగులపై జగనన్న ఫొటో వేసుకుని అమ్ముకుంటున్నారని చెబుతారా? అదీకాకపోతే.. తన స్టైల్‌లో అవును.. మేమే అమ్ముతాం అయితే ఏం పీకుతారని నిర్భయంగా చెబుతారా? అదీకాదంటే తనకు అలవాటయిన భాషలో.. ‘వాడెమ్మ మొగుడెవరో’ సంచులు అమ్ముకుంటే మాకేం సంబంధమని ఎదురుదాడి చేస్తారో చూడాలి! ఏ పదాలయినా ప్యాలెస్ నుంచే రావాలి కదా?
సరే.. ఇలాంటి వాటిపై దుర్భిణి వేసి, అసలు కేరళ వరకూ మన సంచులు ఎలా వెళ్లాయని విచారించి నేరగాళ్ల తొలు తీయాల్సిన సీఐడీ, ఎక్కడ నిద్ర పోతోందన్నది బుద్ధిజీవుల ప్రశ్న. సీఐడీ అంటేనే నేర పరిశోధన సంస్థ అని కదా అర్ధం? ఎంతసేపూ పనికిమాలిన రాజకీయ వ్యవహారాలే తప్ప.. అప్పుడప్పుడూ ఇలాంటి నేరాలపైనా దృష్టి సారిస్తే వారి పుణ్యం ఊరకనే పోదన్నది జనవాక్కు. అంటే సర్కారుకు సరిపడని వారి ఇళ్ల తలుపులు.. పక్క రాష్ట్రాలకూ వెళ్లి అర్ధరాత్రి విరగొట్టి, కాళ్లు చేతులు విరగొట్టి జీరోకేసులు పెట్టే ఆ పనితనమేదో, జగనన్న సంచులమ్ముతున్న కేరళకు వెళ్లి.. అసలు ఆ సంచులు అక్కడిదాకా ఎలా వెళ్లాయని విచారిస్తే మంచిదన్నది బుద్ధిజీవుల సలహా.