– లిక్కర్ నాణ్యతపై కేంద్రానికి ఫిర్యాదు ఫలితమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
మద్యం ధరలు తగ్గిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఒకవైపు వైన్‌షాపుల వద్ద మందుబాబులు సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు ఇంత హటాత్తుగా మందు ధరలు తగ్గించడానికి తెరవెనక ఏం జరిగిందన్న చర్చ మొదలయింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అనేక ప్రాంతాల్లో మందుబాబు వైన్‌షాపు ఎదుట డాన్సులు చేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ జేబులు గుల్ల కాకుండా రేట్లు తగ్గించడంపై మందుబాబుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే.. జగన్ సర్కారు ఇంత హటాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాసిన లేఖ అని తెలుస్తోంది. ఆరోగ్యశాఖ కన్సల్టేషన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే, ఇతర బ్రాండుల అమ్మకాలతోపాటు, ధరల తగ్గించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఏపీలోఅమ్ముతున్న డజన్లకొద్దీ మద్యం బ్రాండ్లలో నాణ్యత లేకపోగా, అవి తాగేవారి ఆరోగ్యం దెబ్బతీసేలా ఉన్నందున వాటిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు ఆ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆయా కంపెనీల పేర్లు కూడా పేర్కొన్న ఎంపీ రాజు.. వాటిని పరీక్షించి, తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో లక్షలమంది అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దానితో రంగంలోకి దిగిన కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన 12 మంది బృందం, దాదాపు 60 మద్యం కంపెనీల శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపగా, అవి నాణ్యతాలోపంతో ఉన్నట్లు వెల్లడయినట్లు తేలింది. అయితే ఆ వ్యవహారం వెలుగుచూసి, చర్యలు తీసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతో దిద్దుబాటకు దిగి, ఇకపై అన్ని బ్రాండ్ల అమ్మకాలతోపాటు, 20 శాతం మద్యం రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాగా చిత్తూరు జిల్లా అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి-ఎంపీల చేతిలో ఉన్న లిక్కర్ తయారీ కంపెనీల ద్వారా, తాడేపల్లి ప్యాలెస్‌కు రోజుకు అనధికారికంగా 10 కోట్లు వస్తున్నాయని గతంలో టీడీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని మద్యం తయారీ కంపెనీలను బెదిరించి లీజుకు తీసుకున్న చిత్తూరు జిల్లా అధికార పార్టీ పెద్దలు, రెండున్నరేళ్ల నుంచి లిక్కర్ అమ్మకాల ద్వారా వే కోట్లు సంపాదించారని టీడీపీ ఆరోపించింది.
అటు నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ, ఏపీలో లిక్కర్ అమ్మకాలు డిజిటల్ ఇండియాకు భిన్నంగా జరుగుతున్నాయని, క్యాష్‌తోనే చేస్తున్న అమ్మకాల ద్వారా అవినీతి జరుగుతోందని ఫిర్యాదు చేశారు. రోజూ లారీల్లో సెక్యూరిటీ సాయంతో క్యాష్ తీసుకువెళుతున్నారని ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పిన విషయం తెలిసిందే.
‘రాజు’ను ‘పవర్’ నుంచి ‘హెల్త్’కు మార్చినా.. వైసీపీకి తగ్గని తలనొప్పి కాగా తొలుత విద్యుత్ శాఖ కన్సల్టేషన్ కమిటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు.. ఏపీలో జగన్ సర్కారు విద్యుత్ కోసం చేస్తున్న కొత్త అప్పులన్నీ పాల అప్పులు తీర్చడానికే సరిపోతున్నాయని, వాటిని దారి మళ్లిస్తున్నందున కొత్తగా రుణాలివ్వడం ప్రమాదకరమని ఆ సమావేశంలో వాదించారు. ఆ మేరకు లేఖ కూడా రాశారు. దానితో బిత్తరపోయిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ, ఆయనను హెల్త్ కమిటీకి మార్చింది.
అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజు చివరకు ఆ కమిటీలో జగన్ సర్కారుకు ప్రధాన ఆదాయ వనరయిన లిక్కర్‌పైనే దృష్టి సారించారు. రాష్ట్రంలో తయార వుతున్న లిక్కర్ కంపెనీల నాణ్యత పరిశీలించాలని లేఖ రాయడం, దానితో కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన 12 మంది నిపుణులు రాష్ట్రానికి వచ్చి శాంపిల్స్ సేకరించి తీసుకువెళ్లడం, ఆ తర్వాత అన్ని బ్రాండ్లతోపాటు లిక్కర్ ధరలు తగ్గించడం జరిగిపోయింది. రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తాము చేసిన సూచనను జగన్ పెడచెవిన పెట్టిన ఫలితమే ఈ పరిణామాలని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.