-వైసీపీకి అనుకూలంగా విద్యాశాఖ కార్యక్రమాలు
-కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ
వైసీపీకి అనుకూలంగా ఇంటర్‌బోర్డు, విద్యాశాఖాధికారులు కార్యక్రమాలు రూపొందిస్తు న్నారని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. టీచర్-పేరెంట్ సమావేశాలు, సర్టిఫికెట్ల పంపిణీ పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మార్చిలో పరీక్షలు పూర్తి చేసుకున్న పదవ తరగతి విద్యార్థుల కుటుంబాలను కలవాలంటూ జూనియర్ లెక్చరర్లకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలనే నెపంతో ప్రభుత్వ పథకాల ప్రచారం మొదలెట్టారని పేర్కొన్నారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద లాంటి పథకాల గురించి కుటుంబసభ్యులకు చెప్పాలని అందులో ఆదేశించారని లేఖలో వెల్లడిరచారు. ఇటువంటి రకమైన ప్రచారం గతంలో ఎన్నడూ చేయలేదన్నారు. 6.3 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభావితం చేయాలనేది అధికార పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని, రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వ సేవలు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో ఇటువంటి పనులు చేయించడం తీవ్ర అభ్యంతరకరమని, ఏప్రిల్ 2 నుంచి మే 13 వరకు జూనియర్ లెక్చరర్లు చేపట్టబోయే ఇంటింటి క్యార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని లేఖలో కోరారు. రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి కార్యక్రమాల రూపకల్పనకు కారకులైన విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.