ఐదేళ్లు మాఫియా తప్ప అభివృద్ధి శూన్యం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

 సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐదేళ్లు ప్రజలు విసుగు చెంది ఓటుహక్కుతో వైసీపీ పాలనను అంతం చేసేందుకు ఎదురుచూస్తున్నారని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం కట్టమూరు గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులు బాణ సంచా కాల్చి తప్పెట్లతో స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15 వేలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్నదాతలకు ఏడాదికి రూ.20 వేలు, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీరు అందజేస్తామని వివరించారు. సైకో పాలనను తరిమికొట్టి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారన్నారు.

వైసీపీ పాలనలో కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలు పెరిగాయని, మన ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా వాటిని తగ్గిస్తామని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటే ప్రజలు మీ పాలనపై ఎందుకు విసుగు చెందుతారని ప్రశ్నించారు. శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ మాఫియాలు తప్ప ఐదేళ్ల జగన్‌ పాలనలో బాగుపడిరది ఎవరు? అని ప్రశ్నించారు. అందుకే జనంలో తిరుగుబాటు మొదలైందని, ఓటు హక్కుతో వైసీపీని అంతం చేసేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రచారంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply