– సోము వన్‌మ్యాన్‌షోపై సీనియర్ల అసంతృప్తి
– సునీల్ దియోధర్ మాటే వేదం
– ఆయనను తొలగించాలని అప్పుడే సీనియర్ల ఒత్తిడి
– సంఘటనా మంత్రి మధుకర్ ఉత్సవవిగ్రహమేనా?
– కనిపించని రాష్ర్ట ఇన్చార్జి మురళీధరన్
– పార్టీలో సమిష్ఠి నిర్ణయాలు శూన్యం
– కోర్ కమిటీలో సీనియర్ల నోటికి తాళం
-సీనియర్లకే ఏం జరుగుతుందో తెలియని అయోమయం
– సోము వీర్రాజు ఒంటెత్తు నిర్ణయాలపై సీనియర్ల అసంతృప్తి
– పార్టీకి దూరంగా సుజనాచౌదరి
– కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలతో బట్టబయలయిన ఏపీ బీజేపీ ‘కర్ర’ పెత్తనం
– సోము నాయకత్వంపై కన్నా బహిరంగ అసంతృప్తి
– ఇంకా పెదవి విప్పనివారు మరికొందరు సీనియర్లు
– ఏపీ బీజేపీలో ముఠాల ముసలం?
– దీపావళికి ముందే బీజేపీలో అసంతృప్తి బాంబు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ కమలంలో పెరుగుతున్న కర్రపెత్తనంపై సీనియర్లు కారాలుమిరియాలు నూరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడపై.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయి. చాలామంది సీనియర్లు సైతం, కన్నా అభిప్రాయంతోనే ఉన్నారు. వారిలో చాలామంది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం గమనార్హం. ప్రధానంగా కోర్ కమిటీలో సీనియర్ల నోటికి తాళాలు, ప్రెస్‌మీట్ల అంశంలో అధ్యక్షుడు వీర్రాజు గీసిన లక్ష్మణరేఖ మరోసారి చర్చల్లోకి వచ్చినట్లయింది.
ఏపీ బీజేపీలో అసంతృప్తి భగ్గుమంది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గసభ్యుడయిన కన్నా లక్ష్మీనారాయణ చేసిన బహిరంగ వ్యాఖ్యలు, ఆ పార్టీలో గూడుకట్టుకున్న అసంతృప్తిని బయటపెట్టాయి. పవన్‌తో సఖ్యత-సమన్వయంలో తమ రాష్ట్ర నాయకత్వం విఫలమయిందంటూ కన్నా పేల్చిన బాంబు,
బీజేపీకి దీపావళిని ముందే తెచ్చినట్లయింది. పవన్‌తో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలమయ్యారన్న కన్నా వ్యాఖ్యలు, బీజేపీలో కొత్త చర్చకు తెరలేపాయి. బీజేపీ-జనసేన పొత్తు కొనసాగాలని కోరుకునే బీజేపీ శ్రేణులు, కన్నా వ్యాఖ్యలకు మద్దతివ్వడం విశేషం. సోము వీర్రాజు ఒక్కడే అన్నీ చూసుకోవడం వల్లే పార్టీలో సమస్య తలెత్తిందని, అసలు పార్టీలో ఏం జరుగుతుందో తనకు కూడా తెలియడం లేదని కన్నా వాపోయిన తీరు.. పార్టీలో జరుగుతున్న ఒంటెత్తు పోకడను బహిర్గతం చేశాయి. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలని కన్నా చేసిన సూచన ఫలితంగా, ఇకపై ఏపీపై జాతీయ పార్టీ దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితి కల్పించాయి.
నిజానికి రాష్ట్రంలో ప్రజాకర్షణశక్తి ఉన్న జనసేనాధిపతి పవన్.. బీజేపీకి దగ్గరయినప్పటికీ ఆయనతో సమన్వయం చేసుకోవడంలో, బీజేపీ రాష్ట్ర నాయకత్వం విఫలమయిందన్న భావన పార్టీ వర్గాల్లో లేకపోలేదు. దీనితో విసిగిపోయిన పవన్.. ఒక సందర్భంలో తాను రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడనని, ఏమైనా ఉంటే ఢిల్లీ నేతలతోనే మాట్లాడుకుంటానని విస్పష్టంగా చెప్పారు. రాష్ట్ర బీజేపీకి చెందిన నలుగురైదుగురు ప్రముఖులు, వైసీపీ నాయకత్వంతో తెరచాటు స్నేహం చేస్తున్నారన్నది పవన్ అనుమానం. అదే విషయాన్ని ఆయన, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాకు ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
జనసేన కార్యక్రమాల్లో బీజేపీ పాల్గొనడం లేదు కాబట్టి, బీజేపీ కార్యక్రమాలకు జనసైనికులూ హాజరుకాని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ-జనసేన కలసి పోటీ చేశాయే తప్ప, జనసేన-బీజేపీ కలసి పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆవిధంగా ఇప్పటివరకూ ఇద్దరిదీ, ఉత్తుత్తి స్నేహం-పత్రికాప్రకటన బంధమే కొనసాగుతోంది. అయితే తనకు రూట్‌మ్యాప్ ఇస్తానన్న బీజేపీ ఇప్పటివరకూ ఇవ్వకపోగా, మౌనంగా ఉండటాన్ని పవన్ సహించలేకపోతున్నారు.
ఒకవైపు వైసీపీ నాయకత్వం తనపై మాటల దాడి చేస్తుండటం, తనను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా బీజేపీ పట్టించుకోకపోవడం, పవన్ అసహనానికి కారణమయిందన్నది జనసైనికుల వ్యాఖ్య. దీనితో తాను బీజేపీతో కలసి ఉన్నా ఊడిగం చేసేందుకు సిద్ధంగాలేనంటూ, పవన్ చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. దానితో ఆయన బీజేపీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న సంకేతాలు వెళ్లాయి. దానికితోడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయి, కలసి కదం తొక్కుదామన్న తీర్మానం చేయడం బీజేపీ నాయకత్వానికి కలవరం కలిగించాయి. బాబు-పవన్ భేటీ తర్వాత సోము వీర్రాజును ఢిల్లీ నాయకత్వం పిలిపించడం పార్టీలో చర్చకు తెరలేచింది.
ఈ సందర్భంలో కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై, బీజేపీలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిజంగా పవన్‌తో బీజేపీ నాయకత్వం సఖ్యతగా ఉంటే.. విశాఖ ఘటనలో బీజేపీ కార్యకర్తలు భాగస్వాములయి, జనసైనికులకు దన్నుగా నిలిచేవార ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ యువనేత లోకేష్ విశాఖ ఘటనను ఖండించి, పవన్‌కు సంఘీభావం ప్రకటించిన తర్వాత తమ పార్టీ స్పందించిందని బీజేపీ నేతలు గుర్తు చేశారు. కన్నా అసంతృప్తికి అది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పవన్ వంటి శక్తివంతుడిని డీల్ చేయడంలో, సోము వీర్రాజు నాయకత్వం విఫలమయిందన్న కన్నా వ్యాఖ్యలను సీనియర్లు అంగీకరిస్తున్నారు.
‘ మా పార్టీ నాయకత్వం మొదటినుంచీ పవన్‌తో సఖ్యతగా ఉంటే, నిన్న చంద్రబాబునాయుడు పవన్ వద్దకు వచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ మా అధ్యక్షుడే అలాంటి అవకాశాన్ని చంద్రబాబుకు కల్పించార’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. విశాఖ ఘటనలో బీజేపీ నేతలు వెంటనే స్పందించి, భౌతికంగా అక్కడ నిలబడితే పవన్ కూడా, మీడియా వద్ద అలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలకు, తాజా కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు బలం చేకూర్చినట్టయింది. కోర్ కమిటీలో తీసుకునే నిర్ణయాలను కూడా రాష్ట్ర నాయకత్వం అమలుచేయడం లేదని, కోర్ కమిటీలో ఎవరు ఉండాలన్న అంశాన్ని కూడా సోము వీర్రాజు-కో ఇన్చార్జి సునీల్‌దియోధర్ కలసి తీసుకునేవారన్న విమర్శలుండేవి. చివరకు సీనియర్లంతా కలసి జాతీయ నాయ త్వానికి ఫిర్యాదు చేసిన తర్వాత.. కోర్ కమిటీలో ఎవరుండాలన్న జాబితాను స్వయంగా, కేంద్ర పార్టీనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా దేశంలో కేంద్ర పార్టీనే, కోర్ కమిటీ సభ్యులను నిర్ణయించిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించినట్లయింది.
ఇక పార్టీలో ఏం జరుగుతోందో తనకు సైతం తెలియడం లేదంటూ జాతీయ కార్యవర్గ సభ్యుడయిన కన్నా అంత పెద్దస్థాయి నాయకుడే వాపోవడం, పార్టీ వర్గాల్లో గందరగోళానికి దారితీసింది. జాతీయ కార్యవర్గసభ్యుడైన కన్నాకే ఏం తెలియకపోతే, ఇక తమ పరిస్థితి ఏమిటని జిల్లా పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీ ఇచ్చిన షెడ్యూల్‌ను కూడా ఒకరోజు ముందు చెబుతున్నారని జిల్లా నేతలు వాపోతున్నారు. సోము వీర్రాజు-సునీల్ దియోధర్-మధుకర్ ఒక బృందంగా ఏర్పడి, నిర్ణయాలు తీసుకున్న తర్వాత పార్టీ నేతలకు వెల్లడిస్తున్న తీరు సీనియర్లకు మనస్తాపం కలిగిస్తోంది. కేంద్రమంత్రి, ఎంపీ, రాష్ట్రమంత్రి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా చేసిన స్థాయి నేతలకు సోము నాయకత్వం పనితీరు చికాకు తెప్పిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సోము వీర్రాజు పనితీరుపై అసంతృప్తితో ఉన్న కేంద్రమాజీ సుజనాచౌదరి, ఎంపీ సీఎం రమేష్ వంటి అగ్రనేతలంతా చాలాకాలం నుంచీ పార్టీ సమావేశాలు-కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కోర్ కమిటీలో సైతం ఎవరినీ మాట్లాడనీయని ఒంటెత్తు పోకడలపై, సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు ఎవరూ మీడియాకు వెళ్లకూడదన్న లక్ష్మణరేఖపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే పార్టీని సరైన దశలో నడిపించాల్సిన సంఘటనా మంత్రి మధుకర్ కూడా, ఈ విషయంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నది సీనియర్ల వ్యాఖ్య. అసలు మధుకర్జీ సమర్థవ ంతంగా వ్యవహరిస్తే పార్టీలో సమస్యలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. సోము వీర్రాజు తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఆయన తలూపుతున్నారన్నది సీనియర్ల విమర్శ.
కాగా పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ సమర్ధుడైన నాయకుడయినప్పటికీ రాష్ర్టానికి తగిన సమయం కేటాయించడం లేదన్న విమర్శ చాలాకాలం నుంచి ఉంది. ఆయన బదులు సునీల్ దియోధరే పెత్తనం చేయడంతోనే సమస్యలు వస్తున్నాయని, సునీల్ చిత్ర -విచిత్ర ధోరణిని తట్టుకోలేకపోతున్నామని పార్టీయ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సునీల్‌ను తొలగించాలంటూ గతంలో సీనియర్లంతా కలసి జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసినా, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఒక కీలకనేత ఆశీస్సులతో సునీల్ ఇంకా కొనసాగుతున్నారన్న వ్యాఖ్య పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కేంద్రమంత్రి మురళీధరన్ ఇకనయినా రాష్ట్ర పార్టీపై దృష్టి సారించకపోతే, అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ ఉనికి మాయమయ్యే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.