– బీజేపీలో దియోధర్ ముసలం
– సునీల్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు
– సిద్ధమవుతున్న బీజేపీ సీనియర్లు
– ‘కమలం’లో అసమ్మతి కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దియోధర్‌పై ఆ పార్టీ సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ విస్తరణకు అడ్డంకి ఉన్న సునీల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సీనియర్లు గళమెత్తుతున్నారు. ఆ మేరకు వారంతా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ నద్దాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, వారంతా అమిత్‌షా-జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ సీనియర్లను అవమానిస్తూ, బెదిరించి పనిచేయించే సునీల్ వైఖరిపై చాలాకాలం నుంచి రగిలిపోతున్న సీనియర్లు, ఆయన తాజా ప్రకటనపై భగ్గుమన్నారు. ఆ మేరకు ఆయనతో తాడో పేడో తేల్చుకునేందుకు చలో ఢిల్లీ పయనవుతున్నారు. ఆయనను తొలగించకపోతే ఏపీలో పార్టీ మనుగడ కష్టమని నాయకత్వానికి స్పష్టం చేయనున్నారు.
అత్యంత విశ్వసనీయ సమచారం ప్రకారం… ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అసమ్మతి కల్లోలానికి దారితీశాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి బీజేపీ పార్కింగ్ జోన్‌గా మారనిచ్చేది లేదంటూ ఇటీవల పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, సీనియర్లకు మనస్తాపం కలిగించాయి. ప్రధానంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీడీపీ నుంచి చేరి, వివిధ హోదాలో ఉన్న ఇతర బీజేపీ నేతలు సైతం సునీల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. విజయవాడలో సుజనా చౌదరికి చెందిన పంక్షన్‌హాల్‌ను ‘పార్కింగ్ జోన్’గా వాడుకుంటూ, తిరిగి ఆయనతోపాటు టీడీపీ నుంచి వచ్చిన వారిని పార్కింగ్‌జోన్‌గా వ్యాఖ్యానించడం ఏమిటన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దీనితో ఆత్మాభిమానం దెబ్బతిన్న సీనియర్లు తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఇప్పటికే సునీల్ వైఖరితో చాలాకాలం నుంచి విసిగిపోయి ఉన్న వారంతా, ఇకపై ఆయన విషయంలో మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. సునీల్‌ను తొలగించకపోతే ఏపీలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారెవరూ బీజేపీలో చేరడం కష్టమని, పైగా సీనియర్లను అవమానించే ఆయన వైఖరి తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని స్పష్టం చేశారు. గతంలో సునీల్ వైఖరిపై పార్టీ చీఫ్ నద్దాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేనందున, ఈసారి అమిత్‌షాకు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ఒకదశలో సునీల్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టాలని కొందరు సిద్ధమవగా, సీనియర్లు వారిని వద్దని వారించారు. ప్రెస్‌మీట్ పెట్టడం వల్ల పార్టీ పరువు బజారునపడుతుందని, ఎలాగూ అమిత్‌షా వద్దకు వెళుతున్నందున అన్ని విషయాలూ అక్కడే తేల్చుకుందామని సముదాయించారు. కాగా, సునీల్ వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో మాట్లాడేందుకు ఒక ఎంపీ, వీర్రాజుకు ఫోన్ చేసినా ఆయన ఫోన్ తీయలేదు.
సునీల్ తీరుపై ఆది నుంచి అసంతృప్తి
కాగా సునీల్ దియోథర్ ఒంటెత్తు పోకడ, ఏకపక్ష నిర్ణయాలపై ఏపీ బీజేపీ సీనియర్లు మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. ఎవరికీ చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం, దానిని సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి ద్వారా సోము వీర్రాజుతో అమలుచేయిస్తున్న తీరు ఎవరికీ రుచించటం లేదు. కోర్ కమిటీలో ఎంపీలు ఉంటే తమ నిర్ణయాలను ప్రశ్నిస్తారన్న ముందుచూపుతో, అసలు వారిని కోర్ కమిటీకే పిలవవద్దన్న నిర్ణయం వెనుక.. సునీల్ ఉన్నారన్న ఆగ్రహం ఎంపీల్లో లేకపోలేదు. ఈ విషయంలో సంఘటనా మంత్రి మధుకర్ నిమిత్తమాత్రుడిగా వ్యవహరిస్తూ, సునీల్-వీర్రాజు-విష్ణువర్దన్‌రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.
మధుకర్ రెడ్డి సంఘటనా మంత్రిగా వ్యవహరించడం లేదని, గతంలో రవీందర్‌రాజు పనితీరుతో పోలిస్తే ఆయన పనితీరు శూన్యమని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ‘సునీల్ దియోధర్‌తోపాటు మధుకర్జీని కూడా తొలగిస్తేనే ఏపీలో బీజేపీ కొద్దిగయినా బాగుపడుతుంది. మధుకర్జీ వివాదరహితుడయినప్పటికీ, ఆయన ఎవరిపై ప్రభావం చూపించకపోగా, ఆయనే ఆ ముగ్గురి ప్రభావంలో ఉన్నట్లు కనిపిస్తోంద’ని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అటు అధ్యక్షుడి అనుచరులు సైతం.. సీనియర్ అయిన తమ అధ్యక్షుడి స్పీడుకు, జూనియర్ అయిన మధుకర్ అందుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వీర్రాజు పదవీకాలం ఏడాది ముగిసిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని, ఫ్లెక్సీలు, ట్వీట్లు చేయాలని సునీల్ చేసిన హడావిడి పార్టీలో నవ్వులపాలయింది. గతంలో ఏ ఇన్చార్జి కూడా ఈవిధంగా వ్యవహరించలేదని, సునీల్ మాత్రం తన బృందంతో ఈవిధంగా హడావిడి చేస్తున్నారని పార్టీ సీనియర్లు విరుచుకుపడుతున్నారు. యుపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఇస్తున్న ప్రాధాన్యంలో, ఏపీ ఎంపీలకు పదిశాతం కూడా ఇవ్వడం లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ ఏపీ బీజేపీ నాయకత్వం-సంఘ్ అగ్ర నేతలు.. ఏపీ ఎంపీలను అన్ని విధాలుగా’ వాడుకుంటున్నా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరినీ అంటరానివారిగా చూస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనితో సీమకు చెందిన ఒక ఎంపీ అయితే సునీల్-మధుకర్‌ను లె క్కచేయడమే మానేశారు. టెలికాన్ఫరెన్సులో ఆ ఎంపీ వస్తే నాయకత్వానికి సైతం హడలే.
మురళీధరన్ మౌనమే కారణమా?
కాగా రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న కేంద్రమంత్రి మురళీధరన్ మౌనం వల్లే.. ఏపీ బీజేపీ కొందరికే పరిమితం కావలసి వస్తోందన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్న ఆయనకు తగిన సమయం లేనందున, పెత్తనమంతా సునీల్‌కు ఇచ్చారని, దానితో ఆయన ఒంటెత్తు పోకడలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయంటున్నారు. నిజానికి సునీల్‌కు సొంత మహారాష్ట్రలోనే మద్దతు లేదని, త్రిపురకు వెళ్లి అక్కడ సీఎంకు వ్యతిరేకంగా వ్యవహరించిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అయితే ఆయనకు గతంలో పార్టీ జాతీయ సహ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సతీష్‌జీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. జాతీయ పార్టీ కార్యదర్శిగా ఉన్న వారందరికీ రెండు రాష్ట్రాలు అప్పగిస్తే, సునీల్ నిర్వాకం వల్ల ఆయనను ఏపీకే పరిమితం చేశారని వివరిస్తున్నారు. రెండున్నరేళ్లలో ఆయన స్థానిక భాష కూడా నేర్చుకోలేదని చెబుతున్నారు.
‘సునీల్-మధుకర్-వీర్రాజు-విష్ణు-జీవీఎల్ ఒక గ్రూపుగా ఉండి తీసుకుంటున్న నిర్ణయాలే చెల్లుబాటవుతున్నాయని అందరికీ తెలుసు. రాష్ట్ర ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ ఇక్కడి వ్యవహారాలు పట్టించుకోవడం మానేసి, పెత్తనమంతా సునీల్‌కు అప్పగించారు. సునీల్‌కు పగ్గాలిచ్చి వదిలేయడం మురళీధరన్ చేసిన తప్పు. నిజానికి మురళీధరన్‌కు ఆసక్తిలేకపోతే, తనకు ఇన్చార్జి బాధ్యతలు వద్దని చెప్పవచ్చు. ఆయన అది కూడా చేయడం లేదు. కోర్ కమిటీలో ఎంపీలకు లేని ఆహ్వానం జీవీఎల్‌కు మాత్ర మే ఇచ్చారు. మా పార్టీ ఎంపీలు విజయవాడకు వచ్చినప్పుడు గవర్నమెంటు, పోలీసు ఎస్కార్టు ఇవ్వదు. కానీ జీవీఎల్‌కు మాత్రమే ఇస్తున్నారు. కీలకమైన నిర్ణయాలన్నీ ఆ ముగ్గురే తీసుకుంటున్నారు. సోము వీర్రాజు అధ్యక్షడుయిన తర్వాత నిర్దిష్టంగా వైసీపీ ప్రభుత్వాన్ని కదిలించే ఒక్క ప్రోగ్రాం జరగలేదు. కేవలం మీడియా ప్రకటనలు, హడావిడి తప్ప ప్రత్యక్ష కార్యాచరణ లేదు. టీడీపీని విమర్శించిన వాటిలో ఐదు శాతం కూడా వైసీపీపై విమర్శించడం లేదు. అంటే ఏపీ బీజేపీ నాయకత్వం ఎవరి కోసం పనిచేస్తోందో అర్ధమవుతూనే ఉంది. ఇవన్నీ మేం అమిత్‌షా, బీఎల్ సంతోష్ గారిని కలిపినప్పుడు వివరిస్తాం’ అని ఓ సీనియర్ నేత వెల్లడించారు.