సజ్జల సారు చెప్పిండుగా..అట్నే కానివ్వండి!

( మార్తి సుబ్రహ్మణ్యం)
లక్ష్మీనరసింహం తన కొడుకును లక్షలు పోసి మెడిసిన్ చదివించి డాక్టరును చేశాడు. లక్ష్మీనరసింహానికి సాయంత్రం దాటితే ఓ రెండు పెగ్గులు, సిగరెట్లు తాగే అలవాటు. డాక్టరయిన కొడుకు ఓ రోజు.. నాన్నా మందు-సిగరెట్ మానెయ్ అని హితవు పలికాడు. మరి డాక్టర్ కదా? అందుకు ఆ తండ్రి ‘అరేయ్ అబ్బాయ్.. నిన్ను లక్షలు పోసి డాక్టరు చదివించింది ఈ మాట చెప్పడానికి కాదు. ఇంతోటిదానికి ఎంబీబీఎస్ చదవడం ఎందుకు? కాంపౌండర్ కూడా అదే చెబుతాడు. ఇవి తాగుతూ రోగం రాకుండా ఏం చేయాలని చెప్పడానికే కదా నిన్ను డాక్టర్‌ను చదివించింది. సరే నీ తెలివి బాగానే ఉంది గానీ చెప్పింది చాల్లే. వెళ్లు’ అన్నాడు.
* * *
ఏపీలో కరెంటు సంక్షోభం ముంచుకొచ్చింది. కరెంటు కోతలతో ఉక్కపోతలు మొదలయ్యాయి. కారణం బొగ్గు నిల్వలు లేకపోవడమే. మరి పాలకులు ఏం చేయాలి? కేంద్రంతో మాట్లాడుకుని ఏదో విధంగా సమస్య పరిష్కరించాలి. మరి ఒక్కసారి చాన్సు ఇవ్వాలని జగనన్నయ్య కోరినందుకే కదా. జనం పోలింగు సెంటర్లకెళ్లి ప్యానుకు ఓట్లు గుద్దేసింది? అన్నయ్య ఒక్క చాన్సు ఇవ్వండి మీ సమస్యలన్నీ అల్లాఉద్దీన్ అద్భుత దీపం తెచ్చి మాయం చేస్తాన ని చె ప్పినందుకే కదా.. జనం మీదపడి ముద్దులుపెట్టించుకుని మరీ 151 సీట్లు ఇచ్చింది?
మరిప్పుడు ఫలానా టైము నుంచి ఫలానా టైము వరకూ కరెంటు రాదు. ఫలానా సమయాల్లో కరెంటు ఎక్కువ వాడొద్దు. ఏసీలు,ఫ్రిజ్జులు, గీజర్లు, వాషింగుమిషన్లు వేసుకోవద్దంటే ఎలా మాస్టారూ? అంతోటి దానికి జగనన్నయ్యనే గెలిపించడం ఎందుకు? ఏసుదాసుడయిన కేఏ పాల్‌నే గెలిపించేవారు కదా? ఇంకా పాలన్నియ్యయితే, అమెరికాధ్యక్షుడితో మాట్లాడి అమెరికా నుంచి ఆంధ్రాకు ‘బొగ్గును ప్రత్యేక విమానం’లో తీసుకువచ్చేవాడు కదా?! రాష్ట్రంలో ఎలాంటి సమస్యలూ రాకుండా చూడాలని జీసస్‌కు ప్రార్ధన చేసి, కరెంటు కష్టం రాకుండా చూసేవాడు కదా?
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలు అనుభవించనున్న కరెంటు కష్టాలను ముందస్తుగా కనిపెట్టారు. దానికి తరుణోపాయం కూడా సెలవిచ్చారు. విద్యుత్ కొరత దృష్ట్యా రాష్ట్రంలో కరెంటు కోతలు విధించవచ్చు. కాబట్టి ప్రజలు పెద్దమనసు చేసుకుని ఇళ్లలో కరెంటు వాడకం తగ్గించుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 6-10 గ ంటల వరకూ కరెంటు వాడకం తగ్గించుకోవాలి. ఏసీలూ గట్రా వేయకుండా ఉంటే మంచిది. ఇదీ సజ్జల సారు అఖిలాంధ్ర ప్రజలకు ఇచ్చిన సందేశం. అంటే ఒక్కముక్కలో చెప్పాలంటే.. సాధ్యమైనంత వరకూ చీకట్లోనే ఉండి కరెంటు బిల్లుల నుంచి కాపాడుకోండి. అది మీ జేబులకే మంచిదని హితవు పలకడమే.
సజ్జలన్న చెప్పిందీ నిజమే. అసలు ప్రజల సం’క్షేమం’ చూస్తున్న జగనన్నయ్య, ప్రజల క్షేమం కోసమే అన్నీ పెంచేస్తున్నారు. కంట్రోల్ చేస్తున్నారు. ప్రజలు రోడ్లు మీద పనీపాటా లేకుండా తిరుగుతూ రోడ్లను సర్వనాశనం-దుంప నాశనం చేస్తున్నారు. అందుకే ఎక్కడ రోడ్డుందో, ఎక్కడ గుంతలున్నాయో తెలియకుండా పోయింది. అదే ఆ గుంతలు అలాగే వదిలేశారనుకోండి. పని ఉన్నవాళ్లు మాత్రమే రోడ్డుపై తిరుగుతారు. దానివల్ల బండ్లకు పెట్రోలు ఖర్చు తప్పుతుంది. టైర్లు అరిగే పనే ఉండదు. పైగా ఇంటిపట్టునే ఉంటే ఎంచక్కా కుటుంబంతో గడిపే వీలుంటుంది. దీనితో పనీ పాటా లేకుండా తిరిగేవారి తిక్క కుదురుతుంది. జనసంక్షేమం గురించి ఇలాంటివన్నీ ఆలోచించే.. ఇప్పట్లో ఆ రోడ్లు బాగుచేయకూడదని జగనన్నయ్య నిర్ణయించారు. జగనన్నయ్య కవిహృదయం అర్ధం చేసుకోలేని ‘బాబన్న’ ఏదేదో మాట్లాడి, జగనన్నను జనశత్రువును చేస్తున్నారు. రోడ్లమీద ప్రయాణం చేయాలన్న కోరికను చంపేసిన జగనన్నను అభినందిచడం ప్రతి ఆంధ్రుడి ధర్మం!
ఇక కరోనా సమయంలోనూ పెట్రోల్ రేటు పెంచిన జగనన్నయ్య జనాలకు పెద్ద మేలే చేశారు. నిజంగా పెట్రోల్ రేటు తక్కువగా ఉందనుకోండి. పోరగాళ్లు ఆవారాగా బండ్లేసుకుని ఊరంతా తిరుగుతారు. దానివల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. పైగా బోలెడు వాతావరణ కాలుష్యం. ఇదంతా అవసరమా? అందుకే జనం రోగం కుదర్చాలని, ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదన్న ప్రజాప్రయోజన లక్ష్యంతోనే జగనన్నయ్య ..పెట్రోల్‌పై సెస్, ఆర్టీసీ చార్జీలు పెంచారు. అలా పెంచటం వల్ల ఒకరకంగా ఆయన జనాలకు గొప్ప మేలు చేశారు. అంటే బండ్ల మీద తిరగాలన్న కోరికను రేట్లు పెంచి చంపేశారన్న మాట. కానీ జగనన్న సహృదయం తెలియని విపక్షాలేమో కాకి గోల చే స్తున్నాయి. ఏం చేస్తాం. పాడు ప్రపంచం! సీతమ్మకే తప్పలేదు. జగనన్న ఎంత?
ఈమధ్య తిరుపతికి వెళ్లడం ప్రతివాడికీ ఫ్యాషనయిపోయింది. ఎమ్మెల్యే రికమండేషన్ లెటర్ తీసుకువెళ్లడం, తిరుమలకు వెళ్లడం వీజీ అయిపోయింది. ఏం? మీ ఊళ్లో వెంకటేశ్వరస్వామి గుళ్లు లేవా? తిరుమల దాకా ఎందుకు? చార్జీలు, దారిఖర్చులు దండగ అని ఆలోచించిన జగనన్న.. వెంకన్న దర్శనం రేట్లు అమాంతం పెంచి, భక్తుల సంఖ్యను కంట్రోల్‌లో పెట్టారు. ఆవిధంగా భక్తుల సొమ్ము ఆదా చేసేందుకే, దర్శనం రేట్లు పెంచిన జగనన్ను హిందూ సంఘాలు ఆడిపోసుకోవడం ఏం న్యాయం? విశాఖ సాములోరు కూడా దీన్ని ఆశీర్వదించారు.
ఇప్పటికే ప్రజలు మందుతాగి ఆరోగ్యం ఖరాబు చేసుకుంటున్నందున, మద్యం ధరలు కొంటే షాక్ కొట్టేలా చేశారు. ప్రపంచంలో ఎక్కడా దొరనన్ని విదేశీ వాసనలతో కూడిన స్వదేశీ మందును, ప్రభుత్వ సారాయి దుకాణం (ప్రసాదు)లో అధిక ధరకు అందుబాటులో ఉంచారు. ఆవిధంగా మందుకొంటేనే షాక్ కొట్టేంత రేట్లు పెట్టడం ద్వారా..మద్యం తాగాలన్న కోరికను చంపేసిన జగనన్నను అభినందించాల్సింది పోయి, ఆడిపోసుకోవడం రొంబ అన్యాలం! అప్పటికీ జనాలు ‘అమ్మఒడి’కి ఇస్తున్న పైసలను ‘నాన్నతడి’కి ఖర్చుపెడుతున్నారనుకోండి. అది వేరే విషయం. ఇక ఇష్టం వచ్చినట్లు లైట్లు-ఫ్యాన్లు, ఏసీలు వేస్తూ దుబారా చేస్తున్నందుకే కరెంట్ ధరలు పెంచారు. మరి దానివల్ల జనం డబ్బు ఆదా చేసినట్లే కదా? అంటే కరెంటు వేసుకోవాలన్న కోరికను చంపినట్లే కదా బాసూ?
పనిలోపనిగా జగనన్న మరికొన్ని సం‘క్షేమ’ నిర్ణయాలు తీసుకుంటే, జనాలను రక్షించినవారవుతారు. సాగునీరు విలువ తెలియని రైతులు, తాగునీటి విలువ తెలియక జనం దానిని వృధా చేస్తున్నారు. మంచినీటినయితే ఇష్టం వచ్చినట్లు తాగేస్తున్నారు. కాబట్టి ఆ రెంటిపైనా ఎక్కువ ధరలు వసూలుచేస్తే జనం దారికొస్తారు. నీటిని ఎక్కువ తాగేయాలన్న కోరికను చంపేయడం వల్ల అటు బోలెడు నీళ్లు కూడా ఆదా అవుతాయి. వాటిని ఎంచక్కా మన సిమెంటు కంపెనీలకు మళ్లించవచ్చు. ఇహపోతే.. నాన్ వెజ్ తింటూ జనం హెల్త్ ఖరాబు చేసుకుంటున్నారు. కాబట్టి జగనన్న పెట్టబోయే ‘మటన్ కత్తి మస్తాన్ షాపుల్లో’ మూడురెట్లకు నాన్‌వెజ్ రేట్లు పెంచి, నాన్‌వెజ్ తినాలన్న కోరినను చంపేస్తే సరి. జనం కోట శ్రీనివాసరావు మాదిరిగా కోడిని వేళ్లాడదీసి, దాన్ని చూస్తూ చికెన్ తినేస్తారు. అదో తుత్తి!
ప్రతోడికీ సర్కారు ఆసుపత్రి లోకువయిపోయింది. అడ్డమైన రోగాలు కొని తెచ్చుకుని పుణ్యానికి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకొస్తున్నారు. అందువల్ల మందుధరల మాదిరిగా.. సర్కారు దవాఖానాల్లో చేరాలంటేనే భయం పుట్టేంతగా, అడ్మిషన్ ఫీజులు రేట్లు పెడితే చస్తే ఒక్కరూ రారు. ఆ భయంతో ఎవరి రోగాలు వారే కుదుర్చుంటారు. ఇవన్నీ చేస్తే జగనన్న చెప్పినట్లు 30 ఏళ్లు సీఎంగా ఉండి, ఆయన ఫొటో పెట్టుకుని పూజిస్తారు. ఇంతచేసినందుకు జగనన్న పుణ్యం కూడా ఊరకపోదు. ఒక్కసారి ఆలోచించకూడదూ? ఇవన్నీ సజ్జలన్న స్ఫూర్తితో బుద్ధిజీవుల మస్తిష్కరంలో మెరిసిన మెరపు ఆలోచనలు మరి! అన్నట్లు.. ఏపీలో కరెంటు కష్టాలు షురవయ్యాయని గ్రహించిన జనం తుప్పు పట్టిన లాంతర్లు, ఫిలప్స్ మాక్స్ లైట్లు బయటకు తీస్తున్నారు. ఎటొచ్చీ కిరోసినుకే ప్రాబ్లమ్. కాబట్టి ఆ కరెంటు కష్టాలేవో తీరేవరకూ జగనన్న కిరోసిన్ దీవెన, జగనన్న లాంతర్ల వెలుగు వంటి స్కీములేవో పెట్టి వాటిని ఉచితంగా ఇస్తే మేలన్నది యుశ్రారైకాపా కార్యకర్తల సూచన.
నిజానికి ఇవన్నీ రెండు, మూడు లక్షలు తీసుకునే సలహాదారులివ్వాలిన సలహాలు. కానీ అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆంధ్రా సర్కారును.. ఒంటిచేత్తో రక్షిస్తున్న జగనన్న పడుతున్న కష్టం చూసి, చలించి నయాపైసా ఖర్చు లేకుండా ఇస్తున్న ఉచిత సలహాలు. అదేదో సినిమాలో పవన్ బాబాయ్ చెప్పినట్లు.. ఈ సలహాలు పనికొస్తే ఈడ్నే వాడుకోండి. గుర్తుకొస్తే యాడ్నయినా వాడుకోండి. ఇట్లా జీతం తీసుకోకుండా ఇచ్చే సలహాల్లో కిక్కే వేరప్పా!

Leave a Reply