Suryaa.co.in

Editorial

కాంగ్రెస్‌ ఖాతాలో సెటిలర్లు.. ముస్లింలు!

– 69 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలన్న జమాతే ఇస్లామీ హింద్‌
– నియోజకవర్గాల వారీగా జాబితా ప్రకటించిన వైనం
-కాంగ్రెస్‌కు 69, బీఆర్‌ఎస్‌కు 41, సీపీఐ, బీఎస్పీ, ఇండిపెండెంటుకు ఒకచోట మద్దతు
– గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మద్దతుపై విచిత్ర ఎంపిక
– బీజేపీకి కాంగ్రెస్‌ ఒక్కటే ప్రయత్నాయమని ముస్లిం సంఘాల స్పష్టీకరణ
– తెలంగాణ ఓట్లలో ముస్లింల వాటా 14 శాతం
– 50 స్థానాల్లో ముస్లింలే విజయనిర్దేశకులు
– 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న సెటిలర్లు- టీడీపీ శ్రేణులు
– టీడీపీ ఆఫీసులకు వెళ్లి మద్దతు కోరుతున్న కాంగ్రెస్‌ అభ్యర్ధులు
– బీజేపీ-బీఆర్‌ఎస్‌కు ఓటేయవద్దంటూ సోషల్‌మీడియా సందేశాలు
– సెటిలర్లు-ముస్లిం మద్దతుతో పరుగులు తీస్తున్న కాంగి‘రేసు’ గుర్రం
– బీఆర్‌ఎస్‌కు ఒక్కసారిగా దూరమయిన ముస్లింలు
– గత ఎన్నికల్లో కారుకే ఓటేసిన ఆంధ్రా సెటిలర్లు
– ఇప్పుడు ఆ ఇద్దరి ఓట్లు దూరమైన బీఆర్‌ఎస్‌
– ముస్లింలలో ఈసారి ఒవైసీ ప్రభావం కనిపించదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ ఎంత బలపడితే అక్కడ ముస్లిం శక్తులు.. దానికి వ్యతిరేకంగా అంతే వేగంగా ఏకమవుతాయన్న సత్యం మరోసారి స్పష్టమైంది. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో పనిచేస్తున్న ముస్లిం సంస్థలు, నాయకులు తెలంగాణ ఎన్నికల్లో తీసుకున్న కీలక నిర్ణయం కాంగ్రెస్‌కు మోదం- బీఆర్‌ఎస్‌కు ఖేదం కలిగించాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం సమాజం ఏకతాటిపై నిలిచి, గుండుగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ ఆ మతపెద్దలు- సంఘాలు ఇచ్చిన పిలుపు కాంగ్రెస్‌లో సమరోత్సాహం నింపింది. అదే సమయంలో ముస్లిం ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరయ్యాయి.

ఇప్పటికే ఆంధ్రా సెటిలర్లు బీజేపీ-బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ, సోషల్‌మీడియాలో ప్రచారం ప్రారంభించాయి. ఖమ్మం-నిజామాబాద్‌-నల్లగొండ-రంగారెడ్డి జిల్లాలతోపాటు, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్లు సోషల్‌మీడియా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌-బీజేపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను గెలిపించి బుద్ధిచెప్పాలంటూ పిలుపునిస్తున్నాయి.చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్న జగన్‌కు బీజేపీ-బీఆర్‌ఎస్‌ ప్రోత్సాహం ఉందన్నది వీరి బలమైన భావన. ఫలితంగా రెండు ప్రధాన వర్గాలను దూరం చేసుకున్న బీఆర్‌ఎస్‌కు తాజా పరిణామాలు ప్రమాదఘంటికలుగా మారాయి.

అయితే ఇటీవల సనత్‌నగర్‌లో కమ్మ సంఘాలు.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను వనభోజనాలకు ఆహ్వానించి, తమ మద్దతు ప్రకటించటం విశేషం. నిజానికి తలసాని కొన్ని దశాబ్దాల నుంచే వారితో సఖ్యతగా ఉంటున్నారు. బహుశా ఈ వ్యక్తిగత అనుబంధమే, కమ్మసంఘాల మద్దతుకు కారణం కావచ్చు. కానీ ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని, మిగిలిన నియోజకర్గాల్లో ఎక్కడా కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలన్న భావనే సెటిలర్లలో కనిపిస్తోంది.

పోలింగ్‌ తేదీ సమీపించేకొద్దీ తెలంగాణ ఎన్నికల్లో, కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ సర్వే సంస్ధలన్నీ, కాంగ్రెస్‌ను విజేతగా చూపిస్తున్నాయి. తాజాగా ఇప్పటిదాకా బీఆర్‌ఎస్‌కు పూర్తి అనుకూలంగా ఉన్న ముస్లిం వర్గాలు, ‘జాతీయ కోణం’లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం, అధికార బీఆర్‌ఎస్‌కు వజ్రాఘాతంలా పరిణమించింది.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రెస్‌మీట్‌ నిర్వహించి, ముస్లిం వర్గమంతా కాంగ్రెస్‌నే గెలిపించాలని పిలుపునిచ్చింది. దేశంలో చెలరేగిపోతున్న బీజేపీ మతతత్వ శక్తుల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే, కాంగ్రెస్‌ను గెలిపించడం ఒక్కటే పరిష్కారమని ముస్లిం సంఘాలు స్పష్టం చేశారు.

తాజాగా ముస్లింలపై పట్టున్న జమాతే ఇస్లామీ హింద్‌ కూడా రంగంలోకి దిగి.. ముస్లింలంతా కాంగ్రెస్‌కే ఓటు వేయాలని పిలుపునివ్వడం, కారుకు కలవరం కలిగించే అంశమే. 69 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్న జమాతే ఇస్లామీ హింద్‌, మరో 41 నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పిలుపునివ్వడం గమనార్హం. స్థానిక ముస్లింలతో ఎమ్మెల్యేల సంబంధాల ప్రాతిపదికగా, వారు ఆ జాబితా విడుదల చేసినట్లు చెబుతున్నారు.

అంటే సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చిన జమాతే ఇస్లామీ హింద్‌.. అదే పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే-జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాగంటి గోపీనాధ్‌కు కాకుండా, కాంగ్రెస్‌ అభ్యర్ధి అజారుద్దీన్‌ను గెలిపించాలని కోరడమే విచిత్రం. ఇక కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి గద్దర్‌ కూతురు వెన్నెలతోపాటు.. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఖైరతాబాద్‌-ముషీరాబాద్‌-శేరిలింగంపల్లిలో మాత్రం, బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. ఒకే నగరంలో రెండు పార్టీలకు మద్దతు ఇచ్చిన వైనంపై ముస్లిం వర్గాల్లో కొంత గందరగోళం వ్యక్తమవుతోంది.

సహజంగా ముస్లింలు ప్రతి ఎన్నికలలోనూ.. తాము ఎవరికి మద్దతునివ్వాలన్నది పోలింగ్‌ ముందు వరకూ నిర్ణయించుకోరు. వారికి ప్రార్ధన సమయాల్లో వచ్చే ఆదేశాల ప్రకారమే, ఓటు వేసే సంప్రదాయం ఉంది. అయితే తొలిసారిగా జమాతే ఇస్లామీ హింద్‌, తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వంటి సంస్థలు ముందస్తుగానే తెరపైకికొచ్చి, కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునివ్వడమే ఆశ్చర్యం.

ఇది ఒకరకంగా ముస్లిం సమాజానికి, ప్రార్ధన సమయానికంటే పంపిన ముందస్తు సంకేతాలుగానే స్పష్టమవుతోంది. ఆప్రకారంగా ముస్లిం వర్గం.. తాము ఎవరికి మద్దతునివ్వాలన్నది, పోలింగ్‌ ముందురోజు వరకూ ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నమాట. ఇది కాంగ్రెస్‌కు అనుకూలించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి తెలంగాణలో 14 శాతం ఉన్న ముస్లింలు, దాదాపు 50 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తులుగా ఉన్నారు. రాష్ట్రంలో 13 చోట్ల 20 శాతానికిపైగా, 11 స్థానాల్లో 15-20శాతం ఓట్లతో ముస్లింలు నిర్ణయాత్మకశక్తిగా ఉన్నట్లు, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమయింది. ఈసారి మైనారిటీలు ఉపాథి, ఉచిత విద్య, ఉచిత వైద్యం కోరుకుంటున్నారంటూ ఆ సంస్థ వెల్లడించింది.

అయితే 2014-2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపు నడిచిన ముస్లింలు, ఈసారి ‘కారు’ దిగి, ‘చే’యెత్తి జేకొట్టేందుకు సిద్ధమవుతున్న పరిణామమే ఆసక్తికలిగిస్తోంది. అందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో హామీలు కూడా, ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ముస్లిం సబ్‌ప్లాన్‌ కింద 4వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రకటించింది. మైనారిటీ జంటలకు లక్షా 60 వేల ఆర్ధిక సాయం, ఇమామ్‌లకు 12 వేల గౌరవ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్‌ హమీలు కూడా ముస్లిం వర్గాన్ని కాంగ్రెస్‌ వైపు చూసేలా చేస్తున్నాయి. ప్రధానంగా స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఎప్పుడూ ముస్లిం సబ్‌ప్లాన్‌ రూపొందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ హామీతో కాంగ్రెస్‌ తన ప్రత్యర్ధి బీఆర్‌ఎస్‌ ముస్లిం ఓటు బ్యాంకు కొల్లగొట్టబోతోంది.

అటు ఈ ఎన్నికల్లో ముస్లింలపై విపరీతమైన ప్రభావం చూపే.. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆదేశాలను, ఈసారి ముస్లిం సమాజం పెద్దగా పట్టించుకునే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా యువకులు- విద్యాధికులు మాత్రం, కాంగ్రెస్‌కే ఓటు వేయాలన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. దానికితోడు బీఆర్‌ఎస్‌-మజ్లిస్‌ పార్టీలు బీజేపీకి బీ టీమ్‌ అని కాంగ్రెస్‌ వేసిన ముద్ర ప్రభావం, సాధారణ ముస్లింలపై విపరీత ంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

బీహార్‌, యుపి, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో పోటీ చేయడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తున్న మజ్లిస్‌.. తెలంగాణలో మాత్రం అన్ని సీట్లకు ఎందుకు పోటీ చేయడం లేదన్న చర్చ, ముస్లిం మేధావి వర్గాల్లో గత కొంతకాలం నుంచీ జరుగుతున్న విషయం తెలిసిందే. బహుశా ఇలాంటి కారణాల వల్లనే ఈసారి ముస్లింలు, అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపును పెద్దగా పట్టించుకోకపోవచ్చంటున్నారు. అసలు మజ్లిస్‌కు గట్టి పట్టున్న నాంపల్లి నియోజకవర్గంలోనే ఆ పార్టీ గెలవడం కష్టమన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

ఈవిధంగా ఎన్నికల సమయంలో అనుకోకుండా కలసివచ్చిన.. సెటిలర్లు-ముస్లిం వర్గాల మద్దతుతో, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఖాతా పరిపుష్ఠంగా తయారైనట్లు కనిపిస్తోంది. 50 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలతోపాటు, మరో 40 సెటిలర్ల ప్రభావిత నియోజకవర్గాలు, కాంగ్రెస్‌కు చేయెత్తిజైకొట్టడం ఖాయమన్న ప్రచారం విస్తృతమవుతోంది. అంటే మళ్లీ కాలం కాంగ్రెస్‌కు కలసివస్తుందన్నమాట!

1 COMMENTS

LEAVE A RESPONSE