Suryaa.co.in

Features

శెభాష్ శాస్త్రీజీ!

లాల్ బహదూర్ శాస్త్రి విలక్షణ నైజం గురించి చెప్పే చిత్రమైన ఉదంతం ఇది..
శాస్త్రిజీ రైల్వే మంత్రిగా ఉన్న రోజులవి..తాను దేశానికి రైల్వే మంత్రిగా ఉన్న విషయం లాల్ బహదూర్ తన తల్లికి చెప్పలేదు.’నేను రైల్వేలో పని చేస్తున్నాను” అని మాత్రమే ఆయన తన తల్లి గారికి చెబుతుండేవారు.ఒకసారి భారతీయ రైల్వే నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.యాదృచ్ఛికంగా అదే కార్యక్రమానికి ఆయన తల్లి గారు కూడా రావడం తటస్థించింది.ఆమె అక్కడ చేరిన రైల్వే ఉద్యోగులను తన కొడుకు గురించి అడుగుతూ మీలో ఎవరికైనా మా అబ్బాయి తెలుసా..వాడు కూడా మీలా రైల్వేలోనే పనిచేస్తున్నాడని వాకబు చేశారు.వెంటనే వారు మీ అబ్బాయి పేరేంటని అడిగారు.ఆమె లాల్ బహదూర్ శాస్త్రి అని గొప్పగా చెప్పారు.చుట్టూ ఉన్నవారు విస్తుపోయారు.

ఆమె అబద్దం చెబుతోందని వారు భావించారు. మా అబ్బాయి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అని ఆ పెద్దామె నమ్మకంగా చెప్పడంతో వారు ఆమెను శాస్త్రిగారి వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన్ని చూపించి ఈయనేనా మీ అబ్బాయి అని అడగ్గా ఆమె సంతోషంగా “వీడే” అన్నారు.అయినా వారు ఉండబట్టలేక శాస్త్రి గారినే నేరుగా అడిగేసారు”ఆ పెద్దావిడ మీ అమ్మగారేనా” అని.. వెంటనే శాస్త్రిజీ తన తల్లి దగ్గరకు వెళ్ళి పలకరించి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని మాటాడి ఆనక ఇంటికి పంపేశారు.ఆమె వెళ్ళిన తర్వాత ఆయన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తర్వాత విలేఖరులు శాస్త్రి గారి చుట్టూ చేరి మీ అమ్మ గారు ఉన్నప్పుడు మీరెందుకు మాట్లాడలేదు.మీ ప్రసంగం విని ఉంటే ఆమె సంబరపడేవారు కదా..అని అడిగారు.దానికి లాల్ బహదూర్ వినమ్రంగా ఇలా అన్నారు “మా అమ్మకి నేను మంత్రినని తెలియదు.తెలిస్తే ఏవో పనులు అడుగుతుంది. సిఫార్సులు చేస్తుంది. అవి నేను చెయ్యలేకపోవచ్చు..అలాగని తిరస్కరించనూలేను. అప్పుడామె బాధపడుతుంది.. కోపగించవచ్చు కూడా..అవసరమా అదంతా.. ఆ మాటలు విని అక్కడి వారంతా నిర్ఘాంతపోయారు.

ఈ రోజుల్లో ఇలాంటి ఓ ఉదంతాన్ని చూడగలమా.. అంతటి నిజాయితీని కనీసం ఊహించగలమా.. అలాంటి నేతలు నేటి రాజకీయాల్లో పేరుకైనా మిగిలి ఉన్నారా..? తాను రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో ఒక్క రైలు ప్రమాదం జరిగినంతనే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నిబద్ధత కలిగిన వ్యక్తి శాస్త్రిజీ.. అలా అయితే ఇన్ని ప్రమాదాలు..ఇన్నిన్ని స్కాములు జరుగుతుంటే మన మంత్రులు, ప్రధానమంత్రులు రోజూ రాజీనామా చేయాల్సిందే కదా..అంత సీన్ ఇప్పుడెక్కడిది… మన పిచ్చి గాని..!?
చరిత్రపుటల నుంచి..

ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE