కార్మిక నేత పాడె మోసిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన ఒక డీజీపీ స్థాయి అధికారి. అంతకుమించి ఆ సంస్థకు మేనేజింగ్ డైరక్టర్. వేలాదిమంది కార్మికుల మంచిచెడ్డలకు ఆయన పూచీదారు. సహజంగా ఆ స్ధాయి అధికారికి ఏ స్థాయిలో దర్పం ఉండాలి? ఇంకెంత అహంకారం ఉండాలి? కానీ.. ఆయన అందుకు పూర్తి భిన్నం. తన సంస్థలో పనిచేసే ఓ కార్మిక నాయకుడు మృతి చెందిన సందర్భంగా, అక్కడికి వెళ్లి భౌతిక కాయం వద్ద నివాళులర్పించడం ఎవరైనా చేసే పని. కానీ ఆ అధికారి…. ఆ కార్మిక నేత భౌతికకాయం ఉన్న పాడె మోసి, అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.
ఆ అధికారి పేరు ద్వారకా తిరుమలరావు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీలో ఏపిపిటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు విజయవాడలో మృతి చెందారు. ఆ వార్త ఆర్టీసీ కార్మికులను కలచివేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు, వివిధ ట్రేడ్‌యూనియన్ లీడర్లు దివంగత ఆర్టీసీ ఉద్యోగనేత వైవి రావు మృతదే హం వద్ద నివాళులర్పించారు. ద్వారకా తిరుమల రావు మాత్రం ఒక అడుగుముందుకేసి, దివంగత కార్మిక నేత పాడె కొద్దిదూరం మోశారు.
‘వైవి రావు గారు చాలామంచి నాయకుడు. సంస్థలో సమస్యలు వచ్చినప్పుడు కార్మికులు-యాజమాన్యం మధ్య ఆయన సమన్వయం కుదిర్చేవాడు. సంస్థకు సమస్యలు రాకుండా ఉండాలన్న దృక్పథం ఆయనది. నాకు యూనియన్లతో పనిలేదు. ఆయన చాలామంచి మనిషి. నేను ఒక మనిషిగా, మా సంస్థకు సుదీర్ఘకాలం సేవచేసిన నేత పాడె మోశా. అది నా ధర్మంగా భావించా. అందులో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. మనమంతా మనుషులం కదా’ అని ద్వారకా వ్యాఖ్యానించారు.
ఒక ఐపిఎస్ అధికారి అయి ఉండి ఎలాంటి భేషజం లేకుండా, తన సంస్థలో పనిచేసే కార్మిక నేత పాడె మోసి మానవత్వం చాటిన ద్వారకా తిరుమలరావును చూసి.. భేషజాలు, డాబు , దర్పంతో రగిలిపోయే ఐపిఎస్-ఐఏఎస్ అధికారులు నేర్చుకోవలసిందే!