‘రూల్ ఆఫ్ లా ‘ అని ప్రతి సమాజం లోనూ ఒకటి ఉంటుంది. అది ప్రజాస్వామిక వ్యవస్థ అయినా, రాచరిక వ్యవస్థ అయినా, నియంత్రత్వ వ్యవస్థ అయినా… మయన్మార్ లాగా అడ్డగోలు మిలిటరీ వ్యవస్థ అయినా ; అక్కడి సమాజానికి ‘ రూల్ అఫ్ లా’ అంటూ ఒకటి ఉంటుంది. అడవుల్లో జీవించే జంతువులకే ‘రూల్ అఫ్ లా ‘ ఉండదు. అసలు ‘లా’ అనేదే ఉండదు కనుక.
మనుషులు నివసించే సమాజం లో…. ఆ సమాజం లోని ‘రూల్ అఫ్ లా’ ను పాటించి తీరాలి. ఈ నిబంధలు, చట్టాలు… ఒక్కో సమాజానికి ఒక్కో విధం గా ఉండవచ్చు. నిజానికి, ఏ సమాజం లో అయినా 99శాతం మంది పౌరులు ఎవరూ చెప్పకుండానే ‘రూల్ అఫ్ లా ‘ ను పాటిస్తారు. ‘ రూల్ అఫ్ లా’ అనేది ఒకటి ఉంటుందని తెలియకుండానే పాటిస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, ఎవరి బతుకు వారు – ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా బతకడమే – ‘రూల్ అఫ్ లా ‘. 99 శాతం మంది ప్రజలు ఏ సమాజం లో అయినా ఇలాగే బతుకుతూ ఉంటారు. ఎటొచ్చీ ఆ ఒక్క శాతం తోనే…. ఏ పౌర సమాజానికైనా ఇబ్బంది కలుగుతుంది..
గణాంకాలుగా చూసి, ఒక్క శాతమేగా అని తేలికగా తీసుకునే ప్రమాదం లేక పోలేదు.
మాట వరుసకు ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు అయిదు కోట్ల ముప్ఫయ్ లక్షలు.
ఇందులో 99 శాతం మంది – అంటే – అయిదు కోట్ల ఇరవ నాలుగు లక్షల డెబ్బయ్ వేల మంది పౌరులు తు. చ. తప్పకుండ ‘ రూల్ అఫ్ లా ‘ ను పాటిస్తున్నారు అనుకుందాం.
ఇక, మిగిలిన ఒక్క శాతం మంది – అంటే – అయిదు లక్షల ముప్ఫయ్ వేల మంది మాత్రమే ‘రూల్ అఫ్ లా ‘ ను అసలు ఖాతరు చేయడం లేదని… వాదన కోసం – అనుకుందాం.
వీరు – కారణాలు ఏమైనప్పటికీ – పౌర సమాజం పై హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలు,మాన భంగాలు, ఫోర్జరీ లు, చీటింగ్ లు, కబ్జాలు, గృహ దహనాలు, శిరో ముండనాలు వంటి చెప్ప లేనన్ని అకృత్యాలకు తెగ బడితే….?!
ఈ ఒక్క శాతం ‘ రూల్ అఫ్ లా ‘ ఉల్లంఘనుల చేతుల్లో….99 శాతం చట్ట బద్ద జీవనం సాగించే పౌర సమాజం పరిస్థితి ఏమిటి?
ఒక్క శాతం కాదు గదా…. ఆ ఒక్క శాతం లో ఒక్క శాతం మంది ‘రూల్ అఫ్ లా ‘ ఉల్లంఘనలకు తెగబడినా….99.99 శాతం పౌర సమాజం తట్టుకోలేదు.
దీనికీ, రాజకీయాలకూ సంబంధం లేదు. రాజకీయాలు అనేవి రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం. ఏమి చెప్పి…. అధికారం లోకి వద్దామా అని అవి ఆలోచిస్తుంటాయి.
‘ రూల్ అఫ్ లా ‘ ను పాటించడం అనేది పౌర సమాజానికి సంబంధించిన అంశం.
ఏ పార్టీ అధికారం లో ఉన్నది అనే అంశం తో పెద్ద సంబంధం ఏమీ లేకుండానే –
ఈ ‘రూల్ అఫ్ లా’ ఉల్లంఘనులు… పౌర సమాజాన్ని ఈతి బాధలకు గురి చేస్తూ ఉంటారుఒక్కొక్క దేశం లో ఒక్కొక్క రీతిగా ఈ ఉల్లంఘనులతో వ్యవహరిస్తారు. ఉదాహరణకు చైనా లో అయితే…. సింపుల్ గా వీరిని ఉరి తీస్తారు. సౌదీ అరేబియా లో అయితే, బహిరంగంగా గా కొరడాలతో కొట్టి జైళ్ళ లో పారేస్తారు. రష్యా లోనూ జైళ్ళ లో కుక్కు తారు.
అమెరికా లో అయితే…. అత్యంత కఠిన జైలు శిక్షలు విధిస్తారు.
ఉదాహరణకు – అమెరికా అధ్యక్షుడుగా 2020లో జో బైడెన్ గెలుపును ధృవీకరించడానికి సమావేశమవుతున్న అమెరికన్ కాంగ్రెస్ భవనం పై (మన భాషలో పార్లమెంంట్ భవనం ) పైకి దండెత్తిన ట్రంప్ అనుయాయులలో నేరం రుజువైన వారికి వరసబెట్టి 15,16,17,18 ఏళ్ళ జైలు శిక్షలు విధించేశారు. మన దేశం లో మర్డర్ లు చేసిన వారికి కూడా అంతంత శిక్షలు పడవు.
పాకిస్తాన్ లో కూడా మిలిటరీ కోర్టులు ఉరి తీస్తున్నాయి. వారి పట్ల చట్ట బద్ద వ్యవస్థలు అంత కఠినం గా వ్యవహరించక పోతే, సమాజాలు గౌరవప్రదంగా, ప్రశాంతం గా, శాంతియుతం గా జీవించలేవు. ‘రూల్ అఫ్ లా ‘ ఉల్లంఘనులకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాజకీయ అభిమాన… దురభిమానం లేదు. సమాజాన్ని నంజుకు తినడమే… వారికి కులమైనా, మతమైనా, ప్రాంతామైనా, రాజకీయమైనా. వీరు ఉండాల్సింది… నిజానికి పౌర సమాజం లో కాదు. జైళ్ళల్లో.
మరి, మన సమాజ జీవనం…. అటువంటి ఉల్లంఘనుల ఫలితం గా ఎంతగా కలుషితం అయిపోతున్నదో ఆలోచించవలసిన వారు, చర్యలు తీసుకునే బాధ్యత, అధికారం కలిగిన వారు ఉదాసీనం గా ఉంటున్నారు.
ఫలితం గా పొర సమాజాన్ని నంజుకు తినే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బిడి గా పెరిగి పోతున్నది. పౌర సమాజం వారి చేతుల్లో ఎంతగా నలిగి, చితికి చిన్నాభిన్నం అయిపోతున్నదో రోజు వారీ దిన పత్రికల జిల్లా ఎడిషన్లు చూస్తే తెలుస్తుంది.
వారి అరాచకాలను పౌర సమాజం నిస్సహాయం గా చూస్తుండి పోవలసి వస్తున్నది.. రాజకీయ వ్యవస్థలు వారిని పల్లెత్తు మాట అనవు. వారి నుంచి పౌర సమాజాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు…. ఆ పని చేయడం లేదనే అభిప్రాయం సమాజం లో గట్టిగా పాతుకు పోతున్నది.
ఈ ‘భీతావహ’ పరిస్థితుల్లో పౌర సమాజపు నడక పరిస్థితి ఏమిటి? భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటి? మరో తరం గడిస్తే – మన సమాజానికి…. ఆటవిక సమాజానికి తేడా ఏమిటి? మన తరువాతి తరాల పిల్లలు సగౌరవంగా… ఆత్మాభిమానంతో జీవించే అవకాశం ఉంటుందా?
” నిజమే!చట్ట బద్ద జీవనం పట్ల నిబద్ధత కలిగిన పౌరులందరూ ఆలోచించాల్సిన -పైకి సమస్యలాగా కనపడని- పెను సమస్య ఇది అని సీనియర్ జర్నలిస్ట్ ముసునూరి సోమయజులు, న్యాయవాది ఆరేటి ప్రకాష్ అన్నారు. రాజకీయ రాగ ద్వేషాలతో సంబంధం లేకుండా…. ఉల్లంఘనులను రాజకీయాలనుంచి వేరు చేయడానికి ప్రజలే కృషి చేయాలని ఆయన అన్నారు.
ప్రవాసాంధ్రుల పైనే భారం…!
అమెరికా తో సహా పలు దేశాలలో ప్రవాసాంధ్రులు తెలుగు కీర్తి పతాక ను ఎగురవేస్తున్నారు. ఒక్క అమెరికా లోనే పది లక్షల మంది తెలుగు వారు ఉన్నట్టు ఓ అంచనా.
వారు… ఇక్కడ – మన రాష్ట్రం లోనే పుట్టారు. ఇక్కడే పెరిగారు. వీధి బళ్ళల్లో చదువుకున్నారు. బురద లోంచి పుట్టి,నవనవోన్మేషం గాపెరిగిన పద్మాల్లా… ఇప్పుడు అమెరికా, ఇంగ్లండ్ ఆస్ట్రేలియా తదితర సుదూర ప్రాంతాలలో వైద్యులుగా, పారిశ్రామిక వేత్తలుగా, సాఫ్ట్ వె్ర్ ప్రొఫెషనల్స్ గా, పలురకాల వృత్తుల్లో తెలుగు వెలుగులు విరజిమ్ముతున్నారు. వారు ఒక ‘సమానావకాశాల’ స్వేచ్చా సమాజం లో సగౌరవం గా జీవిస్తున్నారు.
అయినప్పటికీ, పుట్టి, పెరిగిన నేల తల్లిని మరిచిపోకుండా…. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఇతర సేవా కార్యక్రమాలకు లక్షలు, కోట్ల రూపాయలు తృణ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వరాష్ట్రం లో పర్యటిస్తున్నారు.
పైపెచ్చు తమ తమ అసోసియేషన్లు తమ తమ నివాస దేశాల్లో జరుపుకునే వార్షిక సదస్సులకు తెలుగు నాట ప్రసిద్ధులైన రాజకీయ, సినీ, సాంస్కృతిక, సంగీత, నృత్య, గాయక కళాకారులను ఆహ్వానించి… సన్మానించి – మాతృ భాష, మాతృ భూమి పట్ల తమ మమకారాన్ని,అభిమానాన్ని విశేషంగా చాటుకుంటున్నారు.
అయితే, వీటితో పాటు – తెలుగు సమాజం లో – రోజు రోజుకూ పేట్రేగి పోతున్న ‘ రూల్ అఫ్ లా ఉల్లంఘనుల(యాంటి – సోషల్ ఎలిమెంట్స్) కార్యకలాపాలను అధికార, రాజకీయ వ్యవస్థల దృష్టికి బలం గా…ఎప్పటికప్పుడు తీసుకురావలసిన ఆవశ్యకతను పరిగణన లోకి తీసుకోవాలి. జన సామాన్యం లో ఒక చైతన్యం కలిగించడానికి ఏమి చేయాలా అని కూడా ఆలోచించాలి. విదేశీ తెలుగు పెద్దలు తలుచుకుంటే…. కాన్సర్ లాటి ఈ సమస్యకు పరిష్కారం కనపడక పోదు.

medhomadhanam@gmail.com