Suryaa.co.in

Political News

షేమ్ టు షేమ్…. అచ్చం అప్పటి లాగానే!

నిరంకుశత్వం గా ప్రభుత్వం…..
పోలీసుల ప్రేక్షక పాత్ర….
మా కార్యకర్తల పై దాడులు……
పోలీసుల చూస్తున్నారు…
కబడ్దార్…. తేలుస్తా మీ సంగతి….
చెడిపోయిన కారు ఇచ్చారు….
మీ పోలీసులు మమ్ముల్ని ఏమీ చెయ్యలేరు…..
ప్రజలు చూస్తున్నారు….
ఏమిటీ…., ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టు ఉన్నాయా?
అవును.వినీ వినీ బాగా అరిగిపోయినయ్.
రాష్ట్రం లో ప్రభుత్వానికి సారధ్యం వహించే వారు మారారు కానీ, ప్రతిపక్షాలు వాడే భాషలో మార్పేమీ లేదు.
షేమ్ టు షేమ్. అదే భాష. ప్రభుత్వం పై అవే ఆరోపణలు….
కాకపోతే; అప్పటికీ, ఇప్పటికీ ఒక తేడా కనిపించింది. పాత జమానా లో ప్రతిపక్షాలు చేసే ఆక్రందనలు అరణ్య రోదనం గా మిగిలి పోయేవి. ప్రభుత్వం వైపు నుంచి వివరణ గానీ, స్పందనం గానీ, చలనం గానీ ఉండేవి కావు. వారు వేరే రోజువారీ పనుల్లో బిజీ గా ఉండేవారు. అందుకని,అసలు పట్టించుకునే నాథుడే ఉండేవారు కాదు. పైపెచ్చు ఏ పేర్ని నాని నో, కొడాలి నాని నో, ఆర్కే రోజా నో, అంబటి రాంబాబో తాపీగా జోకులు వేసేవారు.

నిన్న జగన్ వినుకొండ వెళ్లారు, తమ పార్టీ లో చురుకైన ఒక యువకుడి హత్య సంబంధిత కుటుంబాన్ని “ఓదార్చ” డానికి. ఆ సందర్భంగా, వీలైనంత హడావుడి చోటు చేసుకుంది. ఏమిటీ హత్యాకాండ అంటూ ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తనకు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చలేదని, సరైన భద్రత సమకూర్చలేదని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే, పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండి పోయారంటూ జగన్ గ్రూపు మీడియా….ఓ ఇదై పోయింది.

అయితే, ప్రభుత్వం ఈ ఆరోపణలను తుంపులు తుంపులు గా ఖండించింది. జగన్ కు కండిషన్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే సమకూర్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాకపోతే, జగనే…. ఆ వాహనం ముందు ఉన్న వాహనం లోకి ఆయన మారారు అని ప్రభుత్వం పేర్కొం ది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ; జెడ్ ప్లస్ కేటగిరీ కి ఎంత భద్రత సమకూర్చాలో అంతా సమకూర్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే, ఈ “వినుకొండ ఓదార్పు ” ను బట్టి, ప్రభుత్వానికి ( అంటే ప్రభుత్వ సారధులకు) ఒక విషయం స్పష్టం గా తెలియాలి. జగన్, ఇక ప్రతి హత్యకూ పరామర్శకు, అవకాశం ఉన్న మేరకు – ఈ ఐదేళ్లు వెడతారు. “కార్యకర్తలు” భారీగా పోగవ్వడానికి, పూనకం వచ్చినట్టుగా ఊగిపోవడానికి, యంత్రాలలో పిస్టన్ లో ముందుకూ, వెనకకూ ఫాస్ట్ గా తిరిగినట్టు గా….. పోగయ్యే “కార్యకర్తలు ” చేతులు మెకానికల్ గా ఊపడానికి కావలసిన ఏర్పాట్లు ముందుగానే జరిగిపోతాయానే ఆరోపణలకు సైతం కొదువ ఏమీ లేదు కదా!

2008 రోజులలో….; జగన్ పబ్లిక్ లైఫ్ లో లేరు. ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖర రెడ్డే తెరపై ఉన్నారు. జగన్ అప్పుడు వ్యాపార వ్యాపకాలలో తలమునకలు గా బెంగళూరు లో full బిజీ గా ఉండేవారు. కాకినాడ ప్రస్తుతం మాజీ ఎంఎల్ఏ గా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి…., చాలా ముందు చూపుతో,జగన్ ను కాకినాడ తీసుకు వచ్చారు. అప్పటికి ఆయన…. రాజకీయం గా ఏమీ కాదు. కానీ ఆయనకోసం చంద్రశేఖర రెడ్డి ఒక ” రోడ్ షో” ఏర్పాటు చేశారు. రోడ్డు కు అటూ ఇటూ జనం క్రిక్కిరిసి పోయారు. జగన్ పెట్టే ప్రతి దణ్ణం తో జనం ఊగిపోయారు. చప్పట్ల తో పూనకానికి లోనయ్యారు. పూల దండలు ఆయన కారు పైకి విసిరేశారు. నొప్పెట్టేదాకా చేతులు ఊపుతూనే ఉన్నారు.

ఏమిటీ పూనకం…. ఏమిటీ జన సందోహం… ఏమిటీ చప్పట్లు….. ఏమిటీ చేతులూపుడు…. అంటూ మామూలు జనం, రాజకీయాల్లో ఉన్నవారు కూడా బిత్తర పోయారు.
అయితే ఆ ” రోడ్ షో ” కు ఆ రోజుల్లోనే ఆరు కోట్లయిందని జనం చెవులు కొరుక్కున్నారు.
ఇప్పుడు రేట్లు బాగా పెరిగినయ్ కూడా.
అందువల్ల, ప్రభుత్వం… ఈ అయిదేళ్లు (అప్పుడే ఓ నెలయి పోయింది )”ఇలాటి ” ఓదార్పులకు, చేతులూపుడుకు, పూనకాలకు, ఆరోపణలకు, నెగటివ్ ప్రచారానికి సిద్ధమై ఉండాలి.
అవతల వందల, వేల, లక్షల కోట్లు ఉన్నాయ్.
అవి ఉన్నవారు ; అందులో వెయ్యో వంతు బయటకు తీస్తే ; మొత్తం రాష్ట్రం అంతా పూనకం తో ఊగిపోతుంది. చేతులు ఊపుతుంది. చప్పట్లు, ఈలలు, అరుపులు – కేకలతో గగ్గోలు ఎత్తిపోతుంది.

తట్టుకోగలిగిన పరిస్థితి పాలకులకు ఉన్నది అని అనిపించడం లేదని కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి, తట్టుకోలేక పోతే…. ఏమిటీ మార్గం. తెలిసిన వారిని అడగాలి. తెలిసిన వారు లేకపోలేదు. ప్రభుత్వ సారధ్య భాద్యతలు చూస్తున్నవారు…. మీన మేషాలు లెక్కించుకుంటూ కూర్చుంటే ; కూర్చున్నట్టే ఉంటుంది.

భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE