– ప్రగతిభవన్ లో ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ ఏమైంది?
– బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి లేఖ రాసి, కేసీఆర్ డ్రామాలు
– కేసీఆర్ సంతకం పెట్టి, రైతులకు శిక్ష వేస్తుండు
– రైతుల్ని బావిలో పడేసి, రక్షించండని ధర్నాలు చేస్తుండు
– ఇక్కడేం ఉద్దరించారని దేశం ఏలడానికి పోతున్నారు?
– సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి వెళ్లిపోతా..
– సమస్యలు ఉంటే కేసీఆర్ రాజీనామా చేసి, దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా?
– కేసీఆర్ గారడి మాటలతో ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలె
– ఓటుతోనే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలె
– YSR తెలంగాణ పార్టీ ప్రజల పార్టీ, ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తాం
– YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల
ప్రజాప్రస్థానంలో భాగంగా 47వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం తాళ్ల చెరువు వద్ద YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దపోచారం గ్రామానికి చేరుకుని గ్రామంలోని రైతు వేదిక వద్ద ధర్నా చేశారు. రైతులు పండించిన వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత చిన్నపోచారం, నర్సింహులగూడెం, క్రిష్ణాపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. అనంతరం కూసుమంచి గ్రామంలో బహిరంగసభ నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ..
వైయస్ఆర్ కేవలం ఐదేండ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఐదేండ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. 108, 104 సేవల ద్వారా గ్రామాలకు వైద్యం చేరువ చేశారు.
పేదలకు 46లక్షల పక్కా ఇండ్లు నిర్మించి, రికార్డు సృష్టించారు. రైతులకు రుణమాఫీ చేసి ఆదుకున్నారు. ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు మన వైయస్ఆర్. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టారు.
ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి, లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు.
లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఎరువల మీద సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రెండుసార్లూ ప్రజలను మోసగించారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు.
కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు.దళితబంధు ఇస్తానని మోసం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగు భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలు ఇస్తానని మోసం చేశారు.వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఓసారి వరి సన్నొడ్లు వేయాలని చెప్పాడు. మరోసారి దొడ్డొడ్లు వేయాలని చెప్పాడు. ఇంకోసారి అసలు వరే వేయొద్దని, వరి ధాన్యం కొనబోమని చెబుతున్నారు.
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆరే స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, సంతకం పెట్టారు. అసలు రైతుల తరఫున సంతకం చేసే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది? ఏ రైతును అడిగి సంతకం చేశారు? – కేసీఆర్ సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇప్పటికే రైతులు అప్పులపాలై బాధపడుతుంటే కేసీఆర్ లేనిపోని సమస్యలు సృష్టించి, మళ్లీ రైతుల మీదే మోపుతున్నారు.
ఓవైపు రుణమాఫీ లేదు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఉచిత ఎరువులు లేవు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు. యంత్ర లక్ష్మి లేదు. మరోవైపు వరి వేయొద్దని, వడ్లు కొనబోమని రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా తగ్గడానికి కేసీఆరే కారణం. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా లేఖ రాశారు? 80వేల పుస్తకాలు చదివిన అపరమేధావికి బాయిల్డ్ రైస్ ఎప్పుడు వస్తుందో తెలియదా? తానే సంతకం పెట్టి రైతులను బావిలో తోసి, రైతులు మునిగిపోతుంటే, కేసీఆర్ గారు రక్షించండి రక్షించండి అని నేడు ధర్నాలు చేయడం సిగ్గుచేటు.
–కేసీఆర్ రాసిన లేఖ వల్లనే కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోంది. అందువల్ల కేసీఆరే రైతులు పండించిన వడ్లన్నీ బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలి. వరి వేసుకునే హక్కు రైతులకు ఉంది. దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కేసీఆర్ చేసిన తప్పుకు రైతులను శిక్షించడం న్యాయం కాదు. కేసీఆర్ బేషరతుగా ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి.
రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందేవి. ఇన్‌పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మి ద్వారా ఆదుకున్నారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. మద్దతు ధరతో పాటు 20శాతం బోనస్ ప్రకటించి, వడ్లు కొన్నారు. సన్నొడ్లు పండిస్తే.. దిగుబడి తక్కువ, శ్రమ ఎక్కువ అని భావించి, క్వింటాలుకు రూ.300 అదనంగా చెల్లించారు. అంతేకాక రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి, ఆర్థికంగా ఆదుకున్నారు.
కేసీఆర్ కు పంట నష్టపరిహారం ఇవ్వాలన్న సోయి లేదు. ప్రగతి భవన్లో ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి, రైతుల్ని మోసగించారు. మిల్లర్లకు లాభాలు చేకూరాలనే ఉద్దేశంతోనే నేడు వడ్లు కొనబోమని చెబుతున్నారు.రైతులు పండించిన వడ్లను రా రైస్ చేసుకుంటారో, బాయిల్డ్ రైస్ చేసుకుంటారో, బంగారం చేసుకుంటారో కేసీఆర్ ఇష్టం. వడ్లను మాత్రం కొని తీరాల్సిందే.
ఎకరాకు రూ.5వేల రైతు బంధు ఇచ్చి, రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టిండు. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ లేదు. ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మిల లేదు. ఇచ్చిన ఆ రూ.5వేలు బ్యాంకు రుణాలకు వడ్డీకి కూడా సరిపోవు.
రాష్ట్రంలో ఉద్యోగాలు లేక డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులు హమాలీ పనులు చేసుకుంటున్నారు. ఆటోలు నడుపుకొంటున్నారు, ఆడపిల్లలు పొలం పనులకు, పత్తి ఏరడానికి పోతున్నారు. కేసీఆర్ నాలుగు లక్షల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. బీడి బిచ్చం కల్లు ఉద్దర అన్నట్లు నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, రూపాయి లేదంటున్నాడు కేసీఆర్.
బంగారు తెలంగాణ పేరుతో బార్లు, బీర్ల తెలంగాణగా మార్చాడు. బంగారు తెలంగాణ పేరుతో అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు. ఉద్యమకారుడు కదా అని ముఖ్యమంత్రిని చేస్తే.. వేల మంది రైతులు, నిరుద్యోగుల మరణాలకు కారణమయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ రేట్లు పెంచి పేదల రక్తం తాగుతున్నయ్. పెట్రోల్, డీజిల్, నూనె రేట్లు కేంద్రం పెంచితే.. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మున్సిపల్ చార్జీలను రాష్ట్రం ప్రభుత్వం పెంచి, పేదల నడ్డి విరుస్తున్నయ్.
కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి.కేసీఆర్ఎనిమిదేండ్లుగా నియంత, అక్రమ పాలన సాగిస్తున్నా.. ఏ ఒక్క పార్టీ ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వారంతా కేసీఆర్ కు అమ్ముడుపోయారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అందుకే మేం YSR తెలంగాణ పార్టీని స్థాపించాం.- ప్రజల తరఫుర పోరాటం చేయడానికి, ప్రజా సమస్యలు ఎత్తిచూపడానికి, వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం.
మాట తప్పని, మడమ తిప్పని వైయస్ఆర్ బిడ్డగా మాటిస్తున్నా.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ఆరోగ్యశ్రీని బ్రహ్మాండం చేస్తాం. మహిళలకు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికంగా బలోపేతం చేస్తాం.- పేద వాళ్లకు ఇండ్లు నిర్మించి, మహిళల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఉచిత విద్య, వైద్యంతో పాటు మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం. బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తాం. రైతులతో పాటు కౌలు రైతులకూ న్యాయం చేస్తాం.