– షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి
– పురందేశ్వరి ఎవర్ని బదిలీ చేయాలో.. ఎవర్ని పెట్టాలో కూడా సూచిస్తున్నారు
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
ముందు షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆమె తెలంగాణా నుంచి హఠాత్తుగా ఎందుకు ఇక్కడికి వచ్చారు? తెలంగాణనే జీవితం అన్న ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను నీకు ఎవరు అప్పగించారు? అదే కాంగ్రెస్‌ను విపరీతంగా తెలంగాణలో తిట్టి ఇప్పుడు ఎలా కలిశారు? తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం, అవసరమైతే ఏపీతో కొట్లాడతా అని కూడా అన్నారు. అదంతా ఏమైంది..ఒక పెయిడ్ ఆర్టిస్టులా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు వీటికి సమాధానాలు చెప్తే..వివేకా హత్య, ఆమె తీసుకున్న పాత్రకు జవాబు కూడా దానిలోనే ఉంటుంది.
నాలుగేళ్లుగా పట్టని వివేకా హత్య ఈ రోజు హఠాత్తుగా ఎందుకు పట్టింది? వివేకా హత్య విషయాన్ని ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం అన్నట్లున్నారు. మరీ మంచిది..అప్పటికైనా వారి నోరు మూత పడుతుందా? ఎన్నికల్లో ఎవరేంటో తెలుస్తుందిగా. ఏ ప్రాతిపదిక లేని, అసంబద్ధమైన ఆరోపణలకు సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వీరే ఒక నిర్ణయానికి వచ్చి, ఏమీ తేలకముందే హంతకుడు అని ముద్ర వేస్తున్నారు. చంద్రబాబులా ఒక అహంకారంతో కూడా మాటలు మాట్లాడుతుంటే ఎలా? ఆమెదంతా వ్యక్తిగతమైన అజెండా. ఆ ఎజెండా కూడా చంద్రబాబు ఎజెండాను భుజానకెత్తుకుంది. అందుకే పెయిడ్ ఆర్టిస్తు అనాల్సి వస్తోంది.
పురదేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైనా..ఎజెండా చంద్రబాబుదే. ఆమె అహకారం అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసేయాలంటూ లేఖ పెట్టింది. చివరికి ఈసీ ఎవరిని పెట్టాలో కూడా ఈమే సూచించింది. బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకుని లేఖ రాసిందా? లేదంటే ఈసీ మా పార్టీ తరఫునే పనిచేస్తుందని భావించి రాసిందా? ఇంత అసహ్యంగా, దుర్మార్గంగా, అహంకార పూరితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రవర్తించిందా?
చంద్రబాబునాయుడిలా మేం అధికారులపైకి వెళ్లి బెదిరింపులకు దిగం. కానీ అధికారులపై ఫిర్యాదులు వచ్చినవారిలో ఎస్సీలు, మైనార్టీ అధికారులు సిన్సియర్‌గా పనిచేసినవారు ఉన్నారు. పురందేశ్వరి పెట్టిన లేఖ ప్రకారం అయితే రాష్ట్రంలోని అధికారులంతా అమ్ముడుపోయినట్లే. చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు కదా? ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్‌కు మర్యాద ఇవ్వాలనే కామన్‌సెన్స్ మాకుంది. అది టీడీపీకి లేదు.