– 4న కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల
– ఏపీలో కాంగ్రెస్‌కు షర్మిల ఆక్సిజన్
– ఇడుపులపాయ నుంచి సెకండ్ ఇన్నింగ్స్
– వైసీపీ భూస్థాపితమే కాంగ్రెస్ లక్ష్యం
– షర్మిల భుజంపై తుపాకీ పెట్టిన కాంగ్రెస్
– వైసీపీ సిట్టింగులపైనే కాంగ్రెస్ గురి
– ఇప్పటికే షర్మిలకు టచ్‌లో 13 మంది సిట్టింగులు
– సీట్లు రాని సీమ సిట్టింగులూ షర్మిలతో భేటీ?
– జనవరి నెలాఖరు కు నిర్ణయం తీసుకోనున్న వైసీపీ సిట్టింగులు
– వైసీపీలో షర్మిల కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీలో కల్లోలం మొదలయింది. అప్పట్లో జగనన్న విడిచిన బాణమైన షర్మిల ఇప్పుడు.. అదే జగన్‌పై ‘కాంగ్రెస్ సంధించిన బాణం’గా రానుంది. ఆమేరకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. ఈనెల 4న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అంటే తిరిగి
సొంతింటికి… తండ్రి కడవరకూ కొనసాగిన పార్టీలో చేరనున్నారన్నమాట. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధివద్ద ఉంచడంతో షర్మిల… ఏపీ నుంచి తన సెకండ్ పొలిటికల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఇది కాంగ్రెస్‌కు కమ్మటి వార్తయితే.. అధికార వైసీపీకి కలవరం కలిగించే వార్తనే.
దివంగత మహానేత వైఎస్ ముద్దులబిడ్డ షర్మిల, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏపీలో గత పదేళ్ల నుంచి ఐసియులో మగ్గుతున్న కాంగ్రెస్‌కు పునరుజ్జీవం ఇచ్చి, ఎన్నికల సమరానికి సిద్ధం చేయించే బాధ్యతను ఆమె తన భుజస్కంధాలపై పెట్టుకున్నారు. అంటే అన్న జగన్ సారథ్యంలోని వైసీపీ అధికారపార్టీని.. భూస్థాపితం చేయాలన్న కాంగ్రెస్ సంకల్పానికి, షర్మిల సేనాని కానున్నారన్నమాట. పదేళ్ల క్రితం తనకు రక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టిన అన్న జగన్ పార్టీ నుంచి.. మళ్లీ ఆయా వర్గాల ఓటు బ్యాంకును కాంగ్రెస్ ఖాతాలో కలపాలన్న రాజకీయ లక్ష్యంతో, షర్మిల వేసే అడుగులు అప్పుడే వైసీపీ నేతలకు దడ పుట్టిస్తున్నాయి.
నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని మాత్రమే తెలుసు. ఎప్పుడు చేరతారు? ఆమెకు ఏ పదవి ఇస్తారు? అన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఆమెకు అధ్యక్ష పదవి ఇస్తారా? లేక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారా? అన్నది కూడా ఇంకా ఖరారు కాలేదు. కర్నాటక నుంచి రాజ్యసభ ఇస్తారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అయినా సరే.. తాను షర్మిల వెంటే నడుస్తానని, వైఎస్ కుటుంబ వీరవిధేయుడైన, మంగళగిరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు.
ఆయనలా ప్రకటించారో లేదో.. సీటు దక్కని.. సీటు ఇచ్చేది లేదని వైసీపీ సమన్వయకర్తల నుంచి తెలుసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా, షర్మిలతో టచ్‌లోకి వెళుతున్నారు. ఇప్పటికి ఆళ్లతో కలిపి, 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు షర్మిల-కెవిపి టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా కొందరు రాయలసీమ ఎమ్మెల్యేలు కూడా ఆమెతో టచ్‌లోకి వెళ్లడం విశేషం. తమకు సీట్లు దక్కవని భావిస్తున్న వారితోపాటు.. 30 నుంచి 40 కోట్లు ఇచ్చుకోలేని సిట్టింగులంతా షర్మిలతో భేటీ అవుతుండటం, వైసీపీ శిబిరానికి కలవరం కలిగిస్తోంది.
కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మందికి పైగా సీట్లు దక్కవని ఖరారు చేసుకున్నారు. ఆమేరకు వారు ఇప్పటికే ప్రాంతీయ సమన్వయకర్తలను కలసి, సీటుపై అంచనా వేసుకున్నారు. ఆ
తర్వాతనే కాంగ్రెస్‌లో తమ రాజకీయ భవిష్యత్తు కొనసాగించాలని నిర్ణయించుకోవడం విశేషం. జనవరి నెలాఖరున వీరంతా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలయిన ఇద్దరు ప్రముఖులు, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీలక నేతకూడా షర్మిల-విజయమ్మతో ఇప్పటికే చర్చించినట్లు చెబుతున్నారు.
నిజానికి వీరంతా ముందు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే షర్మిల రాక ఖరారయిన నేపథ్యంలో.. ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు మినహా, మిగిలిన వైసీపీ నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా గతంలో కాంగ్రెస్ నాయకులే కావడం ప్రస్తావనార్హం.
అయితే షర్మిల రాకతో తాడేపల్లి తర్జన భర్జన పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. టికెట్లు రాని 90 మంది సిట్టింగులో కనీసం సగం మంది కాంగ్రెస్‌లో చేరినా, పార్టీపుట్టి మునుగుతుందన్నది వైసీపీ నాయకత్వ భయంలా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. స్థానికంగా వారికి 5 నుంచి 10 వేల ఓట్లు సాధించే సత్తా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సహజంగా అవన్నీ వైసీపీ ఓటుబ్యాంకులే కాబట్టి, అంతిమంగా పార్టీకే నష్టమని విశ్లేషిస్తున్నారు.
ఇక 31 ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ సాధించిన ఓట్లన్నీ గతంలో కాంగ్రెస్‌వే. అందువల్ల షర్మిల ప్రధాన దృష్టి అంతా ఆ 31 నియోజకవ ర్గాలే కాబట్టి, తమను ఆ నియోజకవర్గాలే తొలి దెబ్బతీస్తాయన్న
ఆందోళన వైసీపీ నాయకత్వంలో ఉందంటున్నారు. పైగా అసెంబ్లీకి 40 కోట్లు, ఎంపికి 140 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలన్న కొత్త నిబంధన కూడా.. చాలామంది సిట్టింగులు పార్టీ మారేందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ నిబంధనతో చాలామంది పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి షర్మిల రాకతో.. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భ్రమలు కాంగ్రెస్ నాయకత్వానికి లేదు. అయితే కనీసం 10 నుంచి 15 శాతం ఓట్లు సాధించడమే కాంగ్రెస్ ప్రధమ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఎస్సీ-ఎస్టీ-మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి వైసీపీ నుంచి రాబట్టుకుంటే, ఏపీలో కాంగ్రెస్ ఉనికి ఉంటుందన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
దళిత-గిరిజన నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం ద్వారా.. కనీసం ఒకటి నుంచి ఐదు స్థానాలు సాధించడమే లక్ష్యంగా, కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించింది. సీనియర్ నేత కెవిపి మార్గదర్శకత్వంలో ..షర్మిల అడుగులు వేయనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి ఊపిరిపోసుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేకులు చెబుతున్నారు.
ఈ పరిణామాలన్నీ వైసీపీని కలవరపరిచేవేనన్నది సుస్పష్టం. దళిత-గిరిజన నియోజకవర్గాల్లో సింహభాగం వైసీపీ అధీనంలోనే ఉన్నాయి. మైనారిటీలు ఎక్కువ ఉన్న కడప-కర్నూలు వంటి జిల్లాల్లో కూడా.. షర్మిల ప్రచారంతో కాంగ్రెస్ ప్రభావం చూపిస్తే, వైసీపీకి ఆ మూడు వర్గాల ఓటు బ్యాంకు దూరమవడం ఖాయమని సీనియర్లు స్పష్టం చేస్తున్నాయి. ‘ఈ చీలిక పరిణామాలన్నీ పరోక్షంగా టీడీపీ విజయానికి దోహదం చేసేవే. దానితోపాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేవేనన్నది మా పార్టీ నాయకత్వానికీ తెలుసు’ అని ఓ వైసీపీ సీనియర్ నేత విశ్లేషించారు.