Suryaa.co.in

Editorial

కిషన్‌రెడ్డికి షాక్‌!

– సొంత నియోజకవర్గంలోనే బీజేపీని వీడిన సీనియర్లు
-బాగ్‌అంబర్‌పేట బీజేపీ కార్పొరేటర్‌ పద్మా వెంకటరెడ్డి రాజీనామా
– కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
– గతంలో బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరెడ్డి
– అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి ఒంటెత్తుపోకడపై క్యాడర్‌ అసంతృప్తి
– అందుబాటులో ఉండని తీరుపై ఆగ్రహం
– నేతలను అవమానిస్తున్న వైనంపై కన్నెర్ర
– వెంకటరెడ్డిని గంటలపాటు వేచిఉంచిన కిషన్‌రెడ్డి?
– ఆ అవమానంతో బయటకు వెళ్లిన వెంకటరెడ్డి
-నామినేటెడ్‌, లేదా రాష్ట్ర కమిటీ పదవి ఇవ్వాలని కోరిన వెంకటరెడ్డి
– వెంకటరెడ్డి వినతిని పట్టించుకోని కిషన్‌రెడ్డి
– దానితో ఆగ్రహించిన వెంకటరెడ్డి
– కొద్దిరోజుల క్రితమే బీఆర్‌ఎస్‌తో చర్చలు
– కేటీఆర్‌ సమక్షంలో చేరిక
– కిషన్‌రెడ్డిపై పోటీకి గంగపుత్రుల సంఘం నేత సిద్ధం
– గతంలో గంగపుత్రులకు సీటుపై మాట తప్పిన ఫలితం
– బీఆర్‌ఎస్‌లోకి మరికొందరు బీజేపీ నేతలు?
– కిషన్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ
( మార్తి సుబ్రహ్మణ్యం)

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాక్‌ తగిలింది. బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఆయన భార్య అయిన బాగ్‌ అంబర్‌పేట బీజేపీ కార్పొరేటర్‌ పద్మ బీజేపీకి ఝలక్‌ ఇచ్చారు. ఎవరూ ఊహించనివిధంగా కారు ఎక్కి, కిషన్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే సెగ పెట్టారు. అటు సికింద్రాబాద్‌ పార్లమెంటులోనూ.. కిషన్‌రెడ్డి ఒంటెత్తుపోకడలు అనుసరిస్తున్నారని నేతలు రుసరుసలాడుతున్నారు. సీనియర్లకు నామినేటెడ్‌ పదవులు ఇప్పించడంలో విఫలమయ్యారని, తన రాజకీయ ఎదుగుదల తప్ప తమను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం సీనియర్లలో వ్యక్తమవుతోంది.

బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న ఆ పార్టీకి రాజధాని నగరంలోనే షాక్‌ తగిలింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సొంత అంబర్‌పేట నియోజకవర్గంలోనే, ఎదురుదెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ నేత-బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ‘కమలవనం’ నుంచి బయటకు వచ్చి, ‘కారు’ ఎక్కడం బీజేపీని ఖంగుతినిపించింది. వెంకటరెడ్డి కార్పొరేటర్‌ అయిన తన భార్య సహా , బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌-మంత్రి కేటీఆర్‌.. ఆయనకు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ఎన్నికల సమీపిస్తున్న వేళ నగరంలో బీజేపీకి ఇలాంటి షాక్‌ తగలడం ఇబ్బందికర పరిణామమే అంటున్నారు. పైగా అంబర్‌పేట నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేస్తారని వార్తలు వెలువడతున్న నేపథ్యంలో.. బీజేపీ సీనియర్‌ నేత, నగర మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి -కార్పొరేటర్‌ అయిన తన భార్య సహా బీఆర్‌ఎస్‌లో చేరడం, ఒకరకంగా కిషన్‌రెడ్డికి వ్యక్తిగతంగా అప్రతిష్టేనంటున్నారు.

గత కొంతకాలం నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై.. అటు సొంత అంబర్‌పేట నేతలే కాకుండా, ఇటు లోక్‌సభ నియోజకవర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పుట్టిననాటి నుంచి పనిచేస్తున్న సీనియర్లను విస్మరిస్తుండటం, సొంత కుల నాయకులను ప్రోత్సహిస్తుండటం, అవకాశాలు రాని సీనియర్లకు నామినేటెడ్‌ పదవులు ఇప్పించకపోవడంతో రాష్ట్ర-నగర స్థాయి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఎంతసేపూ తన ఎదుగుదలే తప్ప, పార్టీజెండా మోసే కార్తకర్తలు, నేతల గురించి ఆలోచించడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. దానికితోడు పార్టీలో తనకు నచ్చని వారిని అణగదొక్కుతున్నారన్న విమర్శలు కూడా విస్తృతస్థాయిలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తన విజయానికి పనిచేసిన గంగపుత్రులకు ఒక టికెట్‌ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన కిషన్‌రెడ్డి మాట తప్పడంపై గంగపుత్రుల సంఘం ఆగ్రహంతో ఉంది. అంబర్‌పేటలో గంగపుత్రుల ఓట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి గంగపుత్ర నేత ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.

గతంలో బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది సీనియర్లకు, నామినేటెడ్‌ పోస్టులు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దానితోపాటు కిషన్‌రెడ్డి తమకు అందుబాటులో ఉండటం లేదని, ఢిల్లీలోనే ఎక్కువకాలం కేటాయిస్తున్న వైనంపై కూడా, బీజేపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు సమయం ఇవ్వకపోగా, మనస్తాపం చెందేలా మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డి చుట్టూ ధనవంతులే తప్ప సామాన్య కార్యకర్తలు కనిపించరన్న వ్యాఖ్యలు, చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

తమలాంటి కార్యకర్తల త్యాగాలతోనే కిషన్‌రెడ్డి లాంటి నేతలు.. ఈ స్థాయికి చేరుకున్న విషయాన్ని విస్మరిస్తున్నారని, సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం-పదవులు రాగానే మూలాలు మర్చిపోతే కార్యకర్తలు మళ్లీ పాతస్థాయికి తీసుకువస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా పార్టీకి రాజీనామా చేసిన నగర మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి కూడా.. కిషన్‌రెడ్డి వ్యక్తిగత వ్యవహారశైలికి నిరసనగానే, పార్టీ నుంచి నిష్ర్కమించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయననను కిషన్‌రెడ్డి గంటలపాటు వెయిట్‌ చేయించారని , నామినేటెడ్‌ పదవి లేదా రాష్ట్ర పార్టీ పదవి అడిగినప్పటికీ కిషన్‌రెడ్డి స్పందించలేదంటున్నారు. దానితో అక్కడి నుంచి ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయి, తనకు జరిగిన అవమానాన్ని సహచర సీనియర్‌ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

తాను పార్టీలో కొనసాగలేనని వెంకటరెడ్డి తన సహచర నేతల వద్ద స్పష్టం చేశారట. ఆ విషయాన్ని వారు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దానితో బీఆర్‌ఎస్‌ నేతలతో చర్చించిన వెంకటరెడ్డి, హటాత్తుగా కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పేసుకుని, బీజేపీకి షాక్‌ ఇచ్చారు.

కాగా కిషన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్‌పేట నుంచి, మరికొందరు బీజేపీ సీనియర్లు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈ పరిణామం రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్‌రెడ్డికి, వ్యక్తిగతంగా ఇబ్బందికరమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న సమయంలో.. సొంత పార్టీ సీనియర్‌ నేత అధికార పార్టీలో చేరడం కిషన్‌రెడ్డికి వ్యక్తిగత అవమానమేనంటున్నారు. దీనివల్ల ఆయనకు సొంత నియోజకవర్గంపై పట్టులేదన్న సంకేతాలు వెళతాయని విశ్లేషిస్తున్నారు. నగర అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరెడ్డి వంటి సాత్వికుడు, చిత్తశుద్ధి గల నాయకుడికే విలువ లే కపోతే.. ఇక తమ సంగతి ఏమిటని ద్వితీయ స్థాయి నేతల్లో, అప్పుడే చర్చ మొదలవడంపై కమలంలో కలవరం కనిపిస్తోంది.

LEAVE A RESPONSE