– బీసీ రిజర్వేన్ జీఓపై హైకోర్టు స్టే
– స్థానిక సమరానికీ తాత్కాలిక బ్రేక్
– కేసు నాలుగు వారాలు వాయిదా
– తాత్కాలికంగా నిలిచిపోయిన ఎన్నికల షెడ్యూల్
– విమర్శల సుడిగుండంలో రేవంత్ సర్కారు
– విపక్షాల విమర్శలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి
– నిరాశలో కాంగ్రెస్ వర్గాలు
హైదరాబాద్: అంతా అనుకున్నట్లే జరిగింది. సీఎం రేవంత్ సర్కారుకు షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రేవంత్ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ జీఓ అమలుపై తెలంగాణ హైకోర్టులో సర్కారుకు చుక్కెదురయింది. జీఓ నెంబరు 9తోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పైనా హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియపై మరోసారి సందిగ్ధం నెలకొంది.
నిజానికి రేవంత్ సర్కారు ఇచ్చిన జీఓ కోర్టులో నిలవదని, దానికి చట్టబద్దత లేదంటూ బీజేపీ, బీఆర్ఎస్ తొలినుంచీ వాదిస్తూనే ఉన్నాయి. ఆ మేరకు రేవంత్ పాటించాల్సిన చట్టబద్ద ప్రక్రియ పూర్తి చేయకుండా, హడావిడిగా ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న పిటిషనర్ వాదనతో న్యాయస్థానం కూడా ఏకీభవించినట్లు తీర్పు సష్టం చేసింది.
ముస్లిం రిజర్వేషన్లు మినహాయిస్తే తాము బిల్లుకు మద్దతునిస్తామని బీజేపీ వాదిస్తూనే ఉంది.మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, ఈ జీఓ కోర్టులో నిలబడదని ప్రముఖ న్యాయవాది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తొలి నుంచి చేస్తున్న వాదనే చివరకు నిజమయింది. ఇది బీసీలను రిజర్వేషన్ల పేరుతో మోసం చేసే ఎత్తుగడ అని బీఆర్ఎస్ తొలి నుంచీ విమర్శిస్తూనే ఉంది. మొత్తంగా విపక్షాలు చెప్పినట్లే..బీసీ రిజర్వేషన్ జీఓ అమలుకు హైకోర్టు తాత్కాలిక బ్రేకులు వేసింది. ఒకరకంగా ఇది సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అప్రతిష్ఠ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఊహించకుండా అనవసర ప్రతిష్ఠకు వెళ్లిన రేవంత్ ప్రభుత్వానికి చివరకు కోర్టులో భంగపాటు తప్పలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే విధించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం, ప్రభుత్వం తరఫున వాదనలు విని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని, హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత, రెండు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
నిరాశలో కాంగ్రెస్ వర్గాలు
బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వె ళ్లి విజయం సాధించాలని ఉబలాటపడిన కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు శరాఘాతంలా పరిణమించింది. విపక్షాలు అడ్డుకున్నా తాము బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న ప్రచారంతో.. విపక్షాలను మట్టికరిపించాలన్న సీఎం రేవంత్ సర్కారు వ్యూహం, దారుణంగా బెడిసికొట్టింది. దానితో న్యాయస్థానంలో సైతం బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిర్వేదం వ్యక్తం చేసిన పరిస్థితి, కాంగ్రెస్ నైరాశ్యాన్ని స్పష్టం చేసింది.