Home » మూడు నెలల్లోనే ముగించాలి!

మూడు నెలల్లోనే ముగించాలి!

అందుకు యాక్షన్ ప్లాన్ అవసరం
-అలాంటి ఆపరేషన్ కు ఏ బి వెంకటేశ్వరరావు మాత్రమే సమర్ధుడు

జగన్ నాయకత్వం లోని వైసీపీయులు సాగించిన అరాచకాలకు తెలుగు సమాజం ఎంతగా భీతిల్లిపోయిందో…. భయపడిపోయిందో…. చంద్రబాబు – పవన్ కు లభించిన విజయాన్ని బట్టి అంచనా వేయవచ్చు.

జనం బొచ్చేల్లో నాలుగు పైసలు విదిలించి, సర్వ అక్రమాలకు పాల్పడడం అనేది ఫ్యాక్షనిష్టులు రాయలసీమ లొ మామూలుగా చేసే పని.

వైసీపీ పాలనలో రాష్ట్రమే ఒక ఫ్యాక్షన్ జోన్ గా మారిపోయింది. ఆ జోన్ లో అరాచకాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, కబ్జాలు, మాన భంగాలు మొదలైన నేరాలకు పాల్పడినవారు…. అక్కడక్కడా ఉంటే ఫరవాలేదు.

మామూలు పోలీసులు వారి వారి పరిధిలో వారి విషయం చూస్తారు. కానీ, వరద వచ్చి ఊళ్ల మీద పడిపోయినట్టుగా రాష్ట్రం లోని సమస్త అసాంఘిక శక్తులు, నేర చరితులు, రౌడీ షీటర్లు …. వైసీపీ అనే మేక తోళ్లు కప్పుకుని… ప్రభుత్వ ధనాగారం మీద, ప్రజల మీద, ప్రజల – ప్రభుత్వ ఆస్తుల మీద తోడేళ్ల లా బిళ్ళబీటుగా పడిపోయారంటూ ప్రజలు భీతిల్లి పోయారు. హాహాకారాలు చేశారు.

ఈ తోడేళ్ల లాటి మందలకు పోలీసులు నిస్సిగ్గుగా రక్షణ వలయం లాగా నిలబడ్డారు. ఉచ్ఛ నీచాలు వదిలేశారు.

భారత దేశం లో ఏ రాష్ట్రం లోనూ ఎప్పుడూ చూడని భయానక స్థితి ఇది. భవిష్యత్ లో సైతం చట్ట సభలకు ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధులు ఇన్ని అరాచకాలకు పాలపడతారని ఎవరైనా అంటే నమ్మడం కష్టం.

ఒకటా…. రెండా… ఆరాచకాలు!?
ప్రభుత్వాన్ని దోచేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని, రాష్ట్రం లోని వనరులను, ప్రజలను, ఆస్తులను దోచేశారు. ప్రజాస్వామిక వ్యవస్థ లో పాలకులను చూసి ఇంతగా భయకంపిత మైన సందర్భం లేదు.

ఎప్పుడూ వినలేదు, ఎక్కడా చూడలేదు. చివరకు సినిమాల్లో కూడా చూడలేదు.
వీటన్నింటికీ వీరు ఎందుకు పాల్పడ్డారు?
డబ్బు. డబ్బు…. డబ్బు టు ది పవర్ అఫ్ డబ్బు కోసం. అధికారం కోసం.
లక్షలు…. కోట్లు…. వందల కోట్లు…. లక్షల కోట్లు….
ఈ డబ్బుతో ఏం చేసుకుంటారు? అన్నం తిన్నట్టు డబ్బును తింటారా? పోనీ, చనిపోయేటప్పుడు వెంట పట్టుకు పోతారా?

ఈ అరాచకీయుల పాదాలు కడిగి నెత్తిన జల్లుకుంటున్నారా అని అనిపించే విధం గా పోలీసులు, వారి బాసులు, అధికారులు వారి అడుగులకు మడుగులొత్తడానికి కారణం ఏమిటి ? తామూ ఆ అక్రమార్కుల అవతారాలు ఎత్తడానికి కారణం ఏమిటీ? డబ్బు. అధికారం.

డబ్బు ముందు సిగ్గు,శరం – లజ్జ, మానాభిమానాలు, మానవీయ లక్షణాలు అన్నీ మాయమై పోతాయి కాబోలు . పనిలో పనిగా తెలంగాణ నుంచి వచ్చినవారూ రాష్ట్రం మీద పడి మేసేశారు
అందుకే, సమాజం పై తోడేళ్ల గుంపులాగా విరుచుకు పడిన ఈ పొలిటికల్ క్రిమినల్స్ ను చూసి, తెలుగు తల్లి భీతితో నిలువెల్లా వణికి పోయింది.
“శరణు… శరణు…. నా మాన ప్రాణాలు కాపాడండి…” అంటూ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించింది.

కొందరు వైసీపీయుల కారణం గా సర్వబ్రష్టత్వం పాలైన రాజకీయ, సామాజిక, ఆర్ధిక, న్యాయ,నేర పరిశోధన మొదలైన వ్యవస్థలనుంచి చీడ పురుగుల ఏరివేతకు బాబు – పవన్ లు ఎంతకాలం తీసుకుంటారు? మూడు నెలల్లో ముగించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

అభివృద్ధి, సంక్షేమం తో పాటు, అరాచక శక్తుల ఏరివేతకు టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొందరలో తొందర గా, డిసెంబర్ లోపు సస్పెన్షన్లు, ఎఫ్ ఐ ఆర్ ల నమోదులు, అరెష్టులు, రిమాండ్లు, జైళ్ళ ప్రవేశాలు , కోర్టులలో ఛార్జ్ షీట్ల నమోదు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఏర్పాటు మొదలైన ప్రక్షాళన పనులన్నీ పూర్త యితే, 2025 నుంచి అభివృద్ది, సంక్షేమం పై పూర్తి స్థాయి దృష్టి పెట్టవచ్చు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ ను భారీగా పెంచినందున, వారు ఆనందంగా బతుకుతారు.మిగిలిన వారు ప్రభుత్వ తాయిలాల కోసం ఎదురు చూడరు. ఏదో ఒక పని పాట చేసుకుంటా బతుకుతారు.

ఇప్పుడు కావలసింది, వారంతా నిర్భయం గా… ఆత్మ గౌరవం గా జీవించడం. ఇందుకు ప్రభుత్వం చేయవలసింది ఒక్కటే. వారి మధ్యే జీవిస్తున్న నరరూప తోడేళ్లను పౌర సమాజం నుంచి వేరు చేయడం.

ఈ పని అంతా మూడు నెలల్లో పూర్తి చేయాలి. ఇందుకు ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకోవాలి. దాని అమలు బాధ్యతలు ఏ బీ వెంకటేశ్వర రావు లాటి వైసీపీ బాధిత అధికారులకు అప్పగించాలి.

“స్వచ్చాంద్ర ప్రదేశ్ ” అంటే రోడ్లు ఊడడం కాదు.రాజకీయ, సామాజిక, ఆర్ధిక, పాలక వ్యవస్థల్లో పేరుకుపోయిన కాలుష్యాన్ని ఊడ్చేయడం. మళ్ళీ ఆ కాలుష్యం బారిన పడకుండా వీటిని కాపాడడం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ నుంచి తెలుగు ప్రజలు ఈ క్షణాన ఆశిస్తున్నది అదే.ప్రక్షాళన.

భోగాది వేంకట రాయుడు

Leave a Reply